హెడ్ పోస్టాఫీసులో 25 పైసల స్టాంపులు
– విడుదల చేసిన పోస్టల్ సూపరింటెండెంట్ కేవీ సుబ్బారావు
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఎట్టకేలకు కర్నూలు హెడ్ పోస్టాఫీసుకు 25 పైసల స్టాంపులు వచ్చేశాయి. వీటిని పోస్టల్ సూపరింటెండెంట్ కేవీ సుబ్బారావు మంగళవారం తన ఛాంబరులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచురణ కర్తలు, పబ్లిషర్లు తమ పత్రికలను బుక్‌పోస్టు ద్వారా వేరే ప్రాంతాలకు పంపించుకునే వారని, కొన్ని నెలలుగా ఈ స్టాంపుల ముద్రణ లేకపోవడం వల్ల పోస్టాఫీసుల్లో లభించక పబ్లిషర్లు 50 పైసల స్టాంపులు అతికించి మరో 25 పైసలు నష్టపోయేవారన్నారు. ఈ అంశాన్ని సాక్షి గతంలో కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. మంగళవారం నుంచి పోస్టాఫీసుల్లో 25 పైసల స్టాంపులను అందుబాటులో ఉంచారు. స్టాంపుల విడుదల కార్యక్రమంలో సిబ్బంది నాగవెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.