బ్యాగుకు బలి
చదువులో ముందుకెళ్లాలనుకుంటున్న పిల్లలను పుస్తకాల మోత వెనక్కు లాగేస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు రకరకాల పేర్లతో పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాల సంఖ్య పెంచేశాయి. ఒకటో తరగతి నుంచే పుస్తకాల బ్యాగు బరువెక్కుతోంది. పిల్లల బరువు కన్నా పుస్తకాల సంచి బరువే అధికంగా ఉంటోంది. దీంతో వాటిని మోసుకెళ్లడం శక్తికి మించిన భారమవుతోంది. బ్యాగు బరువు వెనక్కు లాగేస్తుండటంతో పిల్లలు ఒక్కోసారి అదుపుతప్పి కిందపడిపోతున్నారు.
కొందరైతే భుజం, నడుము నొప్పితో బాధపడుతున్నారు. సైకిల్లో కూడా బ్యాగు ఇమడకపోవడంతో పిల్లలు భుజానికి తగిలించుకొని అవస్థలు పడుతూ తొక్కాల్సి వస్తోంది. పుస్తకాల మోత తగ్గించాలని న్యాయస్థానాలు జోక్యం చేసుకొని అక్షింతలు వేసినా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదు. విద్యాశాఖ అధికారులూ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
- సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం