ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీకి పూర్వ వైభవం
న్యాయవాది బోరెడ్డిలక్ష్మీరెడ్డి
పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ నియోజవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని న్యాయవాది బోరెడ్డిలక్ష్మిరెడ్డి అన్నారు. బీజేపీ నియోజవర్గ ఇన్చార్జ్గా పనిచేసిన బోరెడ్డి ఇటీవల ఆ పార్టీకి రాజీనామ చేశారు. వైఎస్సార్సీపీకి ఆక ర్షితుడైన ఆయన శుక్రవారం హైదరబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని కలిశారు. అక్కడే ఆయనతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వీరందరికీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, కార్యకర్తలు బలంగా ఉన్నారన్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ నగర పంచాయతీ వైస్‌చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి, దొర్నిపాడు మండలం నాయకుడు శ్రీపతిప్రసాద్ ఉన్నారు.
జిల్లా ఉపాధ్యక్షుడిగా బోరెడ్డి
పార్టీలో చేరిన బోరెడ్డి లక్ష్మిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. పార్టీలో చేరిన వెంటనే తనకు బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.