త్వరలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతానని ప్రకటన
ఆళ్లగడ్డ: రాష్ట్రంలో టీడీపీకి బీజేపీ మిత్రపక్షమా లేక ప్రతిపక్షమా తేల్చుకోలేక పోతున్నామని ఆ పార్టీ నియోజవర్గ ఇన్‌చార్జ్ బోరెడ్డి లక్ష్మిరెడ్డి అన్నారు. అందుకే తాను బీజేపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం నియోజవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో సామన్య కార్యకర్తగా చేరి నియోజవర్గ యువమోర్చా కన్వీనర్‌గా రెండు సార్లు, జిల్లా యువమోర్చా కార్యదర్శిగా రెండు సార్లు పార్టీకి సేవలు చేశానన్నారు. పార్టీ తరఫున ఎమ్మెల్యే పదవికి 1994 నుంచి పోటీ చేస్తున్నానన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికి పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం విచారకరమన్నారు. నామినేటేడ్ పదవుల్లో బీజేపీకి అన్యాయం జరుగుతోందన్నారు.
టీడీపీ నాయకుల అవినీతి అక్రమాలను ఎత్తి చూపలేకపోతున్నామన్నారు. అదీగాక విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ విఫలమైందన్నారు. అందుకే తనతో పాటు మండల కన్వీనర్లు, ఇతర నాయకులు అందరూ బీజేపీకి రాజీనామా చేశామన్నారు. ఈ నెల 14వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న కో –ఆర్డినేటర్ల సమావేశంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు చెప్పారు.