గుత్తి కోయలతో గుబులు
మారణాయుధాలతో గ్రామాల్లోకి
ప్రజాకోర్టుల్లో దాడులు
భయపడుతున్న గిరిజనులు
పాడేరు, న్యూస్‌లైన్ : గుత్తి కోయల భయంతో గిరిజనులు కలవరపడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వీరు మావోయిస్టులకు సహకరిస్తూ ఉంటారని ప్రతీతి. వీరు ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో సంచరిస్తున్నారనే వార్తలతో జిల్లాలోని మారుమూల గూడేల్లోని గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు. ఇటీవల ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు ప్రజా కోర్టులు నిర్వహించిన సమయంలో గుత్తికోయలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్టు సమాచారం.
బల్లాలు, కత్తులు, గొడ్డళ్ల వంటి మారణాయుధాలతో గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నవారు కొంతమంది మాజీ సర్పంచ్‌లు, గ్రామ పెద్దలపై దాడి చేసి భయపెట్టినట్టు తెలిసింది. విచక్షణ రహితంగా చావగొడుతున్నారని మారుమూల గ్రామాల్లో గిరిజనులు కొందరు చెబుతున్నారు. ఆ సమయంలో మావోయిస్టు నేతలు కూడా అడ్డుచెప్పడం లేదని ఆదివాసీలు వాపోతున్నారు.
మావోయిస్టులు ఇటీవల గిన్నెలుకోట, ఇంజరి, జామిగూడ, బూసిపుట్టు సమీప ప్రాంతాల్లోని ప్రజాకోర్టులు నిర్వహించి, అనేక మంది గిరిజన నేతలపై దాడులు చేసినట్టు తెలియవచ్చింది. పోలీసులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ మావోయిస్టులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెన్సీలోని రోడ్ల నిర్మాణాలను కూడా అడ్డుకోవడం లేదంటూ మాజీ, ప్రస్తుత సర్పంచ్‌లపై దాడులు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారాలలో గుత్తికోయలు అధికంగా పాల్గొంటున్నారు. వారి దాడులకు గురయిన కొందరు గిరిజనులు బయటకు చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు.
గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లవద్దనే హెచ్చరికలు కూడా మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో మావోయిస్టులు గిరిజనులను హెచ్చరించి, నాలుగైదు దెబ్బలతో వదిలిపెట్టే పరిస్థితికి భిన్నంగా గుత్తికోయల చర్యలు ఉన్నాయి. సోమవారం రాత్రి బలపం సర్పంచ్‌ను మావోయిస్టులు హతమార్చిన సంఘటనలో కూడా గుత్తికోయలే ప్రధాన భూమిక పోషించినట్టు తెలుస్తోంది.