Bout
-
పాపం ప్రత్యర్ధి చేతిలో తనువు చాలించిన సుమో రెజ్లర్
టోక్యో : ప్రత్యర్థి చేతిలో గాయపడి ఓ యువ సుమో రెజ్లర్ తనువు చాలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నెలరోజుల తర్వాత మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. భారీకాయంతో ప్రేక్షకుల్ని అలరించే పురాతన క్రీడ అయిన సుమో రెజ్లింగ్‌లో ఇప్పుడిప్పుడే రాణిస్తోన్న హిబికిర్యూ (28) మార్చి 26న చివరి గ్రాండ్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. ఈ మ్యాచ్ జరిగే సమయంలో ప్రత్యర్ధి రెజ్లర్ హిబికిర్యూని బౌట్లో మట్టికరిపించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ప్రత్యర్ధి హిబికిర్యూని కిందపడేయడంతో తల బలంగా నేలకు తాకింది. దీంతో అస్వస్థతకు గురైన అతడు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. వాస్తవానికి గేమ్‌లో నిబంధనల మేర బౌట్లో కిందపడిన రెజ్లర్ పైకి లేసే సాంప్రదాయం ఉంది. అలాగే బౌట్లో నేలకొరిగిన హిబికిర్యూ కూడా లేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఎంతకీ పైకి లెగవలేకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన మ్యాచ్ ప్రతినిధులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సుమారు నెలరోజుల పాటు ట్రీట్మ్ంట్ తీసుకున్న రెజ్లర్ హిబికిర్యూ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో మరణించినట్లు జపాన్ సుమో అసోసియేషన్ ప్రకటించింది. -
'ఆ గేమ్ చూస్తే నాకు బీపీ పెరుగుతుంది'
రియో ఒలింపిక్స్ చివరి అంకానికి చేరుకున్నాయి. చివరి రోజు పోటీల్లో భాగంగా రెజ్లర్ యోగేశ్వర్ దత్ తలపడనున్నాడు. ఈ నేపథ్యంలో లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన యోగేశ్వర్పై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ హర్యానా రెజ్లర్ భారత పతకాల సంఖ్యను మూడుకు పెంచుతాడని క్రిడా పండితులు సైతం అంచనా వేస్తున్నారు. యోగేశ్వర్ పతకం గెలవాలని కాంక్షిస్తూ అతని మిత్రులు, అభిమానులు సోనిపట్‌లో ఆదివారం యాగం నిర్వహించారు. హరిద్వార్‌లో స్థానికులు యోగేశ్వర్ గెలవాలని కోరుతూ గంగా నదిలో పూజలు చేశారు. అయితే.. యోగేశ్వర్ తల్లి మాత్రం తన కుమారుడు తలపడే బౌట్‌ను చూడనని చెబుతున్నారు. గతంలో యోగేశ్వర్ తలపడిన బౌట్‌ను చూసిన ఆమెకు బీపీ పెరిగిందట. అందుకే, యోగేశ్వర్ బౌట్‌ను చూడనని, అయితే తన కొడుకు ఈ ఒలింపిక్స్‌లో తన కాంస్యాన్ని స్వర్ణంగా మారుస్తాడని నమ్మకంగా చెబుతున్నారు. యోగేశ్వర్ బౌట్ ఆదివారం సాయంత్రం జరుగుతుంది. -
నేడు విజేందర్ ఆరో బౌట్
బోల్టన్: అపజయం లేకుండా తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో దూసుకుపోతున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ నేడు (శుక్రవారం) తన ఆరో బౌట్లో తలపడనున్నాడు. పోలండ్‌కు చెందిన ఆండ్రెజెజ్ సోల్డ్రాతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. అయితే ఈసారి విజేందర్ తొలిసారిగా ఎనిమిది రౌండ్ల ఫైట్‌ను ఎదుర్కొనబోతున్నాడు. ‘నా ఆరో బౌట్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాను. సోల్డ్రాకు సంబంధించిన వీడియోలు చూశాను. అతనికి 16 ఫైట్లలో 81 రౌండ్ల అనుభవం ఉంది. నాకంటే అనుభవశాలే అయినా అతడిని నియంత్రిస్తాను’ అని విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ పోటీలో నెగ్గి వచ్చే నెలలో భారత్‌లో జరిగే డబ్ల్యుబీవో ఆసియా బౌట్‌కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని 30 ఏళ్ల విజేందర్ భావిస్తున్నాడు. -
జయహో... విజేందర్
వరుసగా నాలుగో బౌట్లోనూ విజయం లివర్‌పూల్: గతేడాది పోటీపడిన మూడు బౌట్లలోనూ నాకౌట్ విజయాలు నమోదు చేసిన భారత ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్... కొత్త ఏడాదిలోనూ శుభారంభం చేశాడు. ఈ సంవత్సరం తాను బరిలోకి దిగిన తొలి బౌట్‌లోనే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలెగ్జాండర్ హోర్వత్ (హంగేరి)తో శనివారం జరిగిన బౌట్లో విజేందర్ మూడో రౌండ్లో ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో గెలుపొందాడు. 30 ఏళ్ల విజేందర్ సంధించిన పంచ్‌ల ధాటికి 20 ఏళ్ల హోర్వత్ ఎదురునిలువలేకపోయాడు. మూడు నిమిషాల నిడివిగల ఆరు రౌండ్లపాటు ఈ బౌట్ జరగాల్సింది. తొలి రౌండ్ నుంచే విజేందర్ ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. అవకాశం దొరికినపుడల్లా పంచ్‌లు కురిపించాడు. దాంతో మూడో రౌండ్లో నిమిషం ముగిసిన వెంటనే హోర్వత్ ఓటమిని అంగీకరిస్తూ బౌట్‌ను కొనసాగించలేనని చేతులెత్తేశాడు. విజేందర్‌తో పోరుకు సన్నాహాల్లో భాగంగా హోర్వత్ తన ఆహార జాబితాలో పాము రక్తం కూడా చేర్చుకున్నాడు. అయితే విజేందర్ దూకుడు ముందు ఇవేవీ పనిచేయలేదు. విజేందర్ కెరీర్లో వరుసగా ఇది నాలుగో విజయం కావడం విశేషం. -
ఫిబ్రవరి 13న విజేందర్ బౌట్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్‌గా మారిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ నాలుగో బౌట్ ఫిబ్రవరి 13న జరగనుంది. అయితే ప్రత్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది. తొలి మూడు బౌట్లలో ప్రత్యర్థులను నాకౌట్ చేసిన విజేందర్ నాలుగో బౌట్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. స్వల్ప విరామం కోసం భారత్‌కు వచ్చిన బాక్సర్ ఇప్పుడు మంచి జిమ్ కోసం వెతుకుతున్నాడు. జనవరి 4న అతను యూకే తిరిగి వెళ్లనున్నాడు. ‘నా తదుపరి బౌట్ ఫిబ్రవరిలో ఉంది. ప్రత్యర్థి తేలకపోయినా... రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నా. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా జిమ్‌లన్నీ మూసి ఉన్నాయి. రోజు వారి కసరత్తుల కోసం మంచి జిమ్‌ను వెతుకుతున్నా. వర్కవుట్స్ లేకుండా నా శరీరం ఏ పని చేయనివ్వదు. కాబట్టి తప్పకుండా జిమ్‌కు వెళ్లాల్సిందే’ అని విజేందర్ వ్యాఖ్యానించాడు. -
విజేందర్ ధాటికి జిలెన్ చిత్తు
డబ్లిన్ (ఐర్లాండ్): అరంగేట్రంలోనే అదరగొట్టిన భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ రెండో బౌట్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. డీన్ జిలెన్ (ఇంగ్లండ్)తో శనివారం జరిగిన బౌట్లో విజేందర్ తొలి రౌండ్లోనే ప్రత్యర్థిని చిత్తు చేశాడు. బౌట్ మొదలైన తొలి క్షణం నుంచే విజేందర్ పంచ్‌ల వర్షం కురిపించాడు. రైట్ హుక్, లెఫ్ట్ హుక్‌లతో జిలెన్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. తన కెరీర్లో పోటీపడిన రెండు బౌట్లలోనూ నెగ్గిన జిలెన్ ఈసారి మాత్రం తేలిపోయాడు. మూడు నిమిషాల నిడివిగల నాలుగు రౌండ్లపాటు ఈ బౌట్ జరగాల్సింది. అయితే విజేందర్ ధాటికి ఈ బౌట్ తొలి రౌండ్లోనే ముగిసింది.