జయహో... విజేందర్
వరుసగా నాలుగో బౌట్‌లోనూ విజయం
లివర్‌పూల్: గతేడాది పోటీపడిన మూడు బౌట్‌లలోనూ నాకౌట్ విజయాలు నమోదు చేసిన భారత ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్... కొత్త ఏడాదిలోనూ శుభారంభం చేశాడు. ఈ సంవత్సరం తాను బరిలోకి దిగిన తొలి బౌట్‌లోనే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలెగ్జాండర్ హోర్వత్ (హంగేరి)తో శనివారం జరిగిన బౌట్‌లో విజేందర్ మూడో రౌండ్‌లో ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో గెలుపొందాడు. 30 ఏళ్ల విజేందర్ సంధించిన పంచ్‌ల ధాటికి 20 ఏళ్ల హోర్వత్ ఎదురునిలువలేకపోయాడు. మూడు నిమిషాల నిడివిగల ఆరు రౌండ్‌లపాటు ఈ బౌట్ జరగాల్సింది.
తొలి రౌండ్ నుంచే విజేందర్ ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. అవకాశం దొరికినపుడల్లా పంచ్‌లు కురిపించాడు. దాంతో మూడో రౌండ్‌లో నిమిషం ముగిసిన వెంటనే హోర్వత్ ఓటమిని అంగీకరిస్తూ బౌట్‌ను కొనసాగించలేనని చేతులెత్తేశాడు. విజేందర్‌తో పోరుకు సన్నాహాల్లో భాగంగా హోర్వత్ తన ఆహార జాబితాలో పాము రక్తం కూడా చేర్చుకున్నాడు. అయితే విజేందర్ దూకుడు ముందు ఇవేవీ పనిచేయలేదు. విజేందర్ కెరీర్‌లో వరుసగా ఇది నాలుగో విజయం కావడం విశేషం.