టీచర్ కోసం తరగతుల బహిష్కరణ
పుత్తూర్: టీచర్ బదిలీని వ్యతిరేకిస్తూ విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనబాట పట్టగా.. వారికి మద్దతుగా తల్లిదండ్రులు కూడా రోడ్డెక్కారు. టీచర్ బదిలీని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. వివరాల్లోకెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని పుత్తూర్‌లో సవితా కుమారి 19 ఏళ్లుగా ఉపాధ్యాయురాలిగా కొనసాగుతున్నారు. తనదైన శైలి బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దడంతోపాటు తల్లిదండ్రుల్లోనూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కాగా 185 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో సవితా కుమారిని అదనపు టీచర్‌గా గుర్తించిన అధికారులు ఆమెను మరోచోటుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు తరగతులను బహిష్కరించి, తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు. వీరికి ప్రజాసంఘాలు కూడా మద్దతుగా నిలవడంతో ఆందోళనకారులకు సర్దిచెప్పేందుకు అధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యే రంగంలోకి దిగాల్సి వచ్చింది. సవితా కుమారిని బదిలీ చేస్తే దాని ప్రభావం విద్యార్థుల భవిష్యత్తుపై పడుతుందని, నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తల్లిదండ్రులు చేసిన డిమాండ్‌పై స్థానిక ఎమ్మెల్యే శంకుతల స్పందిస్తూ... బదిలీని ఉపసంహరించే అధికారం తనకు లేదని, అయితే ప్రభుత్వానికి ఈ మేరకు సిఫారసు చేస్తానంటూ హామీ ఇచ్చారు. అంతేకాక బదిలీ చేయడానికిగల కారణాలను తెలియజేయాలంటూ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
అయితే నిబంధనల మేరకే సవితా కుమారిని బదిలీ చేశామని అధికారులు చెప్పడంతో ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇదిలాఉంటే బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తాము తరగతులకు వెళ్లబోమని విద్యార్థులు ప్రకటించారు. తల్లిదండ్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.