ఫేస్బుక్ కామెంట్లు.. ప్రాణం తీశాయి
బాలిక విషయమై విద్యార్థుల తగాదా
ఆవేశంతో దాడి.. ఒకరి హత్య
నాగోలు / హస్తినాపురం, న్యూస్‌లైన్: పసి మనసులు కసితో రగిలాయి. ఓ బాలిక విషయమై ఫేస్బుక్లో చేసుకున్న ‘కామెంట్లు’ శనివారం ఓ బాలుడి హత్యకు దారితీశాయి. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. హస్తినాపురం షిర్డీసాయినగర్‌కు చెందిన గొట్టి దుర్గయ్య, రమ దంపతుల కుమారుడు ప్రవీణ్ (14) హస్తినాపురంలోని ఓ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అనిల్, యశ్వంత్, మరో బాలిక అదే స్కూలో చదువుతున్నారు.
కాగా,ఎస్‌కేడీనగర్‌కు చెందిన అజార్ దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. యశ్వంత్, ప్రవీణ్, అనిల్‌ల స్నేహితురాలితో పరిచయం పెంచుకోవడం కోసం రోజూ హస్తినాపురం చౌరస్తాకు వచ్చేవాడు. ఈ క్రమంలో అనిల్, యశ్వంత్, ప్రవీణ్‌లతో అజార్‌కు పరిచయం ఏర్పడింది. వీరు తరచుగా ఫేస్బుక్లో అభిప్రాయాలు షేర్ చేసుకుంటుండేవారు. కాగా, బాలిక ప్రవీణ్‌తో సన్నిహితంగా ఉంటుండటంతో అజార్ కక్ష పెంచుకున్నాడు. దీంతో వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.
శనివారం సాయంత్రం హస్తినాపురంలోని ఓ ఇంటర్నెట్ సెంటర్ నుంచి ఫేస్బుక్ ద్వారా ప్రవీణ్, అనిల్, యశ్వంత్‌లు అజార్‌ను దుర్భాషలాడారు. ఆవేశానికి గురైన అజార్ సాహెబ్‌నగర్‌కు చెందిన కొంతమందితో కలిసి ఆటోలో నాగార్జున హైస్కూల్‌కు వచ్చాడు. స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న ప్రవీణ్, అనిల్, యశ్వంత్‌ను హస్తినాపురం చౌరస్తాలో ఆటో ఎక్కించుకుని లక్ష్మీనరసింహకాలనీ కమాన్ వద్దకు తీసుకెళ్లాడు. యశ్వంత్ పారిపోగా ప్రవీణ్‌ను కిందపడేసి చేతికి ఉన్న కడియంతో తలభాగంలో తీవ్రంగా కొట్టి పడేశారు. అనంతరం అనిల్‌ను బీఎన్‌రెడ్డినగర్‌కు తీసుకెళ్లి దాడిచేసి వదిలేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న తండ్రి దుర్గయ్య, అన్న మహేష్.. ప్రవీణ్‌ను కామినేని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందాడు. ఎల్బీనగర్ పోలీసులు.. దాడికి పాల్పడిన అజార్, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు. వారిపై కిడ్నాప్, హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.