BPT rice
-
అద్భుతం.. అన్నదాతల ధాన్యాగారం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అద్భుత ఫలితాలు సాధిస్తూ అన్నదాతల ధాన్యాగారంగా ప్రగతి పథం వైపు దూసుకుపోతున్నది. ఇక్కడ శాస్త్రవేత్తలు సృష్టిస్తున్న వరి వంగడాలు నాణ్యమైన అధిక దిగుబడితో దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు అందుకుంటున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన పలు రకాల వరి వంగడాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సాగవుతున్నాయి. విదేశాలకు ఏటా లక్షల టన్నుల బీపీటీ రకాల సన్నబియ్యం ఎగుమతి అవుతూ విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోంది. దీంతో ఈ పరిశోధన స్థానం ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎగసింది. వరి పరిశోధన స్థానం నేపథ్యం.. 1961లో తెనాలిలో ప్రారంభమైన వరిపరిశోధన స్థానం 1973లో బాపట్లకు మార్చారు. అప్పటి నుంచి బాపట్ల వరి పరిశోధన స్థానంగా పనిచేస్తోంది. 2017లో వరి పరిశోధన స్థానం నుంచి వ్యవసాయ పరిశోధన స్థానంగా అప్‌గ్రేడ్ చేస్తూ.. 15 ఎకరాల నుంచి 40 ఎకరాలకు విస్తరించారు. కొత్త వంగడాల సృష్టి కేంద్రం.. 1982లో సోనామసూరి రకం ( బీపీటీ 3291), ధాన్యలక్ష్మి (బీపీటీ 1235), 1986లో సాంబమసూరి (బీపీటీ 5204) అనే సన్న రకం వంగడాన్ని కనుగొన్నారు. 1987లో బీపీటీ 4358, 2001లో బీపీటీ 1768 సన్నాలు, 2010లో బీపీటీ 2270 రకాల వంగడాలను సృష్టించారు. 2010లో బీపీటీ 2231, 2018లో బీపీటీ 2295 రకం ఉత్పత్తి చేయగా 2019లో బీపీటీ 2595 తేజ రకం ఉత్పత్తి చేశారు. 2020లో బీపీటీ 2782 భవతి, బీపీటీ 2411 సశ్య, 2023లో బీపీటీ 3050, బీపీటీ 2846, బీపీటీ 2841 నల్లబియ్యం, బీపీటీ 2848 హైప్రొటీన్ రకం వంగడాలను ఉత్పత్తి చేశారు. తెగుళ్లను తట్టుకునేలా నాణ్యతతో కూడిన విత్తనాలు ఉత్పత్తి చేయడం వల్లే అధిక దిగుబడులు సాధ్యమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇవి కాకుండా బీపీటీ 3082, 2858 రకాలు ఉత్పత్తి అయి మినీకిట్ దశలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందుకు.. వరి పరిశోధన స్థానం ఏర్పడి ఇప్పటికి 61 ఏళ్లు గడుస్తోంది. 2018 ఏడాది వరకు 57 ఏళ్ల కాలంలో కేవలం 7 వంగడాలను సృష్టించగా.. గడచిన 4 ఏళ్ల కాలంలోనే 9 రకాల కొత్త వరి వంగడాలు ఉత్పత్తి చేయడం గమనార్హం. వైఎస్ జగన్ప్రభుత్వం ప్రోత్సాహం, తోడ్పాటు వల్లే త్వరితగతిన నూతన వంగడాల సృష్టి సాధ్యమవుతున్నదని ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త వంగడాలు సృష్టించడమే కాకుండా దేశవ్యాప్తంగా రైతులకు అవసరమైన సీడ్‌ను ఉత్పత్తి చేసి అందిస్తున్నారు. ఏటా 60 ప్రైవేటు కంపెనీలకు సీడ్‌ను అందిస్తున్నారు. రెండు, మూడేళ్లుగా ఇక్కడ ఏడాదికి 600 క్వింటాళ్ల బ్రీడర్ సీడ్ తయారు చేస్తున్నారు. బీపీటీ విత్తనాల సాగు ఇలా బాపట్ల వరి పరిశోధన స్థానంలో సృష్టించిన బీపీటీ 5204 రకం విత్తనం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా సుమారు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రైతుల కోసం నాణ్యమైన సీడ్ బాపట్ల వ్యవవసాయ పరిశోధన స్థానంలో నూతన వరి విత్తనాల ఉత్పత్తి జరుగుతున్నది. ఇక్కడ సృష్టించిన బీపీటీ 5204 రకం దేశవ్యాప్తంగా 75 లక్షల ఎకరాలకు పైగా సాగవుతుండగా.. మరికొన్ని రకాల వంగడాలకు డిమాండ్ పెరిగింది. ఇవే కాకుండా బ్లాక్‌రైస్, హైప్రొటీన్రైస్ వంగడాలను సిద్ధం చేశాం. ఇవన్నీ తెగుళ్లు తట్టుకోవడంతోపాటు అధిక దిగుబడినిచ్చి రైతులకు ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. –బి.కృష్ణవేణి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, బాపట్ల వరి పరిశోధన స్థానం -
‘సన్నాల ఎగుమతి నిషేధం’తో రాష్ట్ర రైతులకు దెబ్బ
సాక్షి, హైదరాబాద్: రానున్న పండుగల సీజన్లో దేశీయంగా బియ్యం ధరలను అదుపులో ఉంచడంతోపాటు భవిష్యత్తు లో ఆహార కొరత లేకుండా చూసేందుకు కేంద్రం విదేశాలకు బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణ యం తీసుకోవడం తెలంగాణ రైతాంగానికి అశనిపాతంగా మారనుంది. కేంద్రం చర్యతో విదేశాల్లో డిమాండ్ ఉన్న సాగు రకాలైన జైశ్రీరాం, హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా బియ్యం వంగడాలు పండించే తెలంగాణ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా రెండు సీజన్లలో సాగయ్యే సన్నాలను స్థానిక వినియోగంతోపాటు విదేశీ ఎగు మతుల కోసమే అధికంగా పండిస్తున్న రైతులు అధిక ధరలను పొందుతు న్నా రు. క్వింటాల్ సన్న ధాన్యాన్ని రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య విక్రయిస్తూ లాభపడుతు న్నారు. కానీ ప్రస్తుతం ఈ రైతులు కూడా ఈ వానాకాలం పంట నుంచే దొడ్డు బియ్యం వైపు మరలే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎగుమతి సుంకం విధించినా పెరిగిన ఎగుమతులు... బియ్యం ఎగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో కేంద్రం గతేడాది 20 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించింది. కానీ సుంకం విధించినా ఎగుమతులు ఆగకపోగా సుమారు 35 శాతం అధికంగా విదేశాలకు బియ్యం తరలి వెళ్లింది. అదే సమయంలో దేశంలో బియ్యం ధరలు ఒక్క ఏడాదిలోనే 11.5 శాతం మేర పెరిగాయి. అలాగే దేశంలో ఏటా 12 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా గతేడాది నుంచి అది 11 కోట్ల మెట్రిక్ టన్నులకు తగ్గింది. దీంతో కేంద్రం భవిష్యత్తు దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొందని రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి తెలిపారు. దేశంలో 24 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం పండించే పరిస్థితులు ఉన్నప్పటికీ సరైన ప్రణాళిక లేకనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ‘సాక్షి’తో అన్నారు. దేశీయ అవసరాలు, విదేశీ ఎగుమతులకే 40 శాతం ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఏటా 2 కోట్ల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి వస్తోంది. ఇందులో కోటీ 40 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు ధాన్యం పండిస్తున్న రైతులు... దాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నారు. మిగతా సుమారు 60 లక్షల మెట్రిక్ టన్ను ల సన్న ధాన్యాన్ని (అంటే 40 శాతం పంటను) రైతులు స్వీ య అవసరాలతోపాటు స్థానిక, దేశీయ, విదేశీ విక్రయాల కోసం పండిస్తున్నట్లు ఓ మిల్లర్ల సంఘం నాయకుడు విశ్లేషించారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి వచ్చే సుమారు 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 20 లక్షల మెట్రిక్ టన్నులను స్థానిక, దేశీయ అవసరాలకు వినియోగి స్తున్న మిల్లర్లు... మరో 16 లక్షల మెట్రిక్ టన్ను లను వివిధ ఏజెన్సీల ద్వారా విదేశాలకు పంపుతున్నారు. నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లోని సన్నబియ్యాన్ని ఎగుమతులకు వినియోగిస్తున్నారు. ఆ రకాలను మినహాయించాలి.. బాస్మతీయేతర ముడి బియ్యం ఎగుమతిపై నిషేధం తెలంగాణ రైతుల ప్రయోజనాలకు విరుద్ధం. జైశ్రీరాం, ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ మొదలైన రకాలు దేశంతోపాటు విదేశాల్లోనూ ఎక్కువ మంది ఇష్టపడే వరి రకాలు. తెలంగాణలోనే పండే ఈ రకాలు ఎకరాకు బాస్మతి కంటే తక్కువ దిగుబడి ఇస్తాయి. అలాంటి శ్రేష్టమైన రకానికి లాభ దాయకమైన ధరలను పొందకపోతే రైతులు డిమాండ్‌లేని సాధారణ రకాలను సాగు చేస్తారు. బాస్మతి తర హాలోనే తెలంగాణలోని సూపర్ ఫైన్ రకాలను నిషేధం నుంచి మినహాయించాలి. –తూడి దేవేందర్‌రెడ్డి, దక్షిణ భారత మిల్లర్ల సంఘం నాయకుడు బియ్యం సేకరణలో రాష్ట్రానికి కేంద్రం సహకరించట్లేదు.. ప్రస్తుతం దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఉంది. కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తే ప్రపంచానికి కూడా అవ సరమైన బియ్యాన్ని అందిస్తాం. ఇప్పటికే ఏటా 3 కోట్ల ట న్నుల ధాన్యాన్ని పండిస్తున్న రైతులు వచ్చే రెండేళ్లలో మరో కోటి టన్నులు అదనంగా పండించబోతున్నా రు. అసలు యా సంగిలో దేశంలో అత్యధికంగా వరి సాగవుతున్న రాష్ట్రం తెలంగాణనే. ఇతర రాష్ట్రాల్లో వరి పంట తగ్గడడం వల్లనే కేంద్రం ఎగుమ తులపై నిషేధం విధించింది. తెలంగాణలో ఉత్పత్తి అయిన బియ్యాన్ని సేకరించే విషయంలో కేంద్రం సహకరించడం లేదు. ఆంక్షలను పక్కనపెట్టి ప్రస్తుతం మిల్లులు, గోదాముల్లో ఉన్న ధాన్యం, బియ్యాన్ని ముందుగా ఎఫ్‌సీఐ సేకరించాలి. – పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ -
రై..రై..రైస్...
భువనగిరి : కొత్త సంవత్సరంలో ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. రెండేళ్లుగా తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనగా.. సన్న బియ్యం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. వర్షాభావంతో ప్రధాన రిజర్వాయర్లతోపాటు వాగులు, కుంటలు, చెరువులు ఎండిపోవడం... భూగర్భ జలం అడుగంటిపోవడంతో వరి దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దీంతో సీజన్ ప్రారంభంలోనే క్వింటాల్ బీపీటీ (సన్నాలు) కొత్త బియ్యం ధర రూ.2,800 నుంచి రూ.3,000 వరకు పలికింది. క్రమక్రమంగా పెరుగుతూ తాజాగా రూ.3,600 వరకు చేరింది. అదేవిధంగా గత సంవత్సరం ఇదే సమయంలో పాత బియ్యం (సూపర్ ఫైన్) క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.3,800 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.4,400 నుంచి రూ.4,500 పలుకుతోంది. జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు నడుస్తుండగా... మధ్య తరగతి, సామాన్య ప్రజలు బీపీటీ బియ్యం అంటేనే బెంబేలెత్తుతున్నారు. సంపన్న, ఉద్యోగ వర్గాలు కూడా బియ్యం రేటు పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం సివిల్ సప్లై ద్వారా బీపీటీ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్దేశించిన లక్ష్యం చేరలేదు. ఉత్పత్తి తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. ఆశించిన స్థాయిలో ధాన్యం దిగుబడి రాకపోవడం ఒక ఎత్తయితే... ఈ సీజన్లో కొత్త బియ్యం టోకున కొనుగోలు చేసే ఆనవాయితీ ఉండడంతో బియ్యం ధర ఒక్కసారిగా పెరిగింది. భవిష్యత్‌లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. జూన్ నాటికి క్వింటాల్ ఫైన్ రైస్ ధర రూ.5,000కు చేరే అవకాశం ఉందని వారు అంటున్నారు. దొడ్డు బియ్యం సైతం... గత సీజన్‌తో పోలిస్తే వ్యాపారులు 40 శాతం మించి ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోయారు. ఫలితంగా బియ్యంగా మార్చే ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు కర్నూలు, జఫర్‌గఢ్ ప్రాంతాల నుంచి బియ్యాన్ని తీసుకువచ్చి అమ్ముతున్నారు. దీంతో రేటు అమాంతంగా పెరిగింది. బీపీటీతోపాటు దొడ్డు బియ్యం బహిరంగ మార్కెట్లో లభిస్తున్నప్పటికీ వాటి ధర కూడా అమాంతంంగా పెరిగింది.గతంలో ఇదే సమయంలో క్వింటాల్‌కు రూ.2,200 ఉండగా... ప్రస్తుతం రూ.2,800కు చేరింది. బియ్యం అమ్మకం కేంద్రాలు ఏర్పాటు చేయాలి విపరీతంగా పెరుగుతున్న బీపీటీ బియ్యాన్ని పేదలకు సివిల్ సప్లై శాఖ ద్వారా తక్కువ ధరకు విక్రయించేలా ఏర్పాట్లు చేయాలి. గతంలో పౌర సరఫరాల అధికారులు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రైస్ మిల్లర్లతో చర్చించి బియ్యం అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొద్ది రోజులకే ఆ కేంద్రాలు మూతపడ్డాయి. పూర్తి స్థాయిలో అమ్మకం కేంద్రాలను కొనసాగించాలి. - ఉప్పల రవి , భువనగిరి -
సన్నాలకు రెక్కలు
నల్లగొండ :సన్న బియ్యం (బీపీటీ) ధరలకు రెక్కలొచ్చాయి. వాటిని సామాన్యులు తినే పరిస్థితి లేకుండా పోయింది. నెల రోజుల క్రితం పాత బియ్యం క్వింటా రూ.3800, కొత్త బియ్యం రూ.3400లకు విక్రయించారు. కానీ ప్రస్తుతం పాత బియ్యాన్ని రూ.4000 నుంచి రూ.4200 వరకు అమ్ముతుం డగా, కొత్త బియ్యం క్వింటా రూ.3600లకు విక్రయిస్తున్నారు. బియ్యం ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం రైస్‌మిల్లర్ల సహకారంతో జిల్లాలో రూ.30 కిలోబియ్యం కేంద్రాలు ఏర్పాటు చేసినా ఎలాంటి ఫలితం రాలేదు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగువిస్తీర్ణం భారీగా తగ్గింది. ఇది మిల్లర్లకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారుగా ఐదు లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. దీంతో బీపీటీ ధాన్యం భారీగా వచ్చింది. అయినప్పటికీ దోమపోటు వల్ల రైతులు తమవద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా మిల్లర్లకు విక్రయించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో కేవలం లక్ష ఎకరాల్లో మాత్రమే వరిసాగు అయ్యింది. దీంతో రాబోయే రోజుల్లో బియ్యానికి మరింత డిమాండ్ ఉండే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఇప్పటినుంచే మిల్లర్లు బియ్యం ధరలు పెంచుతున్నట్టు తెలుస్తోంది. మిల్లుల్లో భారీగా ధాన్యం నిల్వలు జిల్లాలోని పలుమిల్లుల్లో బీపీటీ ధాన్యం నిల్వలు భారీగా ఉన్నాయి. గత ఖరీఫ్ సీజన్లో రైతులనుంచి మిల్లర్లు క్వింటా బీపీటీ ధాన్యం రూ.1600 నుంచి రూ.1700 వరకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు భారీగా నిల్వ చేసుకున్నారు. అప్పుడు ధర కూడా అంతంతమాత్రంగానే ఉంది. పచ్చిబియ్యం కేవలం హైదరాబాద్‌కు మినహా ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకోవడానికి కూడా పర్మిట్లు లేకపోవడంతో స్థానికంగానే విక్రయిస్తున్నారు. అయినా మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చకుండా నిల్వపెట్టుకుంటున్నారు. ఒక్కో రైస్‌మిల్లులో లక్ష క్వింటాళ్లకు పైగా ధాన్యం నిల్వలు ఉన్నాయి. రైతుల చేతినుంచి పూర్తిగా మిల్లర్ల చేతిలోకి బీపీటీ ధాన్యం వెళ్లిన తర్వాత ప్రస్తుతం క్వింటా బీటీపీ ధాన్యం రూ.2200 ధర పలుకుతోంది. ఫలితమివ్వని కిలో రూ.30బియ్యం విక్రయ కేంద్రాలు సన్నబియ్యం ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం రైస్‌మిల్లర్ల సహకారంతో జిల్లాలో ఏర్పాటు చేసిన రూ.30 కిలో బియ్యం కేంద్రాలతో ఎలాంటిఫలితం రాలేదు. సన్నబియ్యం విక్రయ కేంద్రాలలో బియ్యం కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాలలో ఇప్పటి వరకు 2169 క్వింటాళ్ల బియ్యం మాత్రమే విక్రయించారు. రూ. 30 కిలో బియ్యం కేంద్రాలలో బియ్యం నాణ్యతగా ఉండడం లేవని వినియోగదారులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు.దీంతో చాలావరకు మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీపీటీ బియ్యం ధరలు ఏమాత్రమూ తగ్గడంలేదు.