రై..రై..రైస్... | Price increases Narrow rice prices | Sakshi
Sakshi News home page

రై..రై..రైస్...

Published Sat, Mar 12 2016 3:42 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

రై..రై..రైస్... - Sakshi

రై..రై..రైస్...

భువనగిరి : కొత్త సంవత్సరంలో ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. రెండేళ్లుగా తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనగా.. సన్న బియ్యం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. వర్షాభావంతో ప్రధాన రిజర్వాయర్లతోపాటు వాగులు, కుంటలు, చెరువులు ఎండిపోవడం... భూగర్భ జలం అడుగంటిపోవడంతో వరి దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దీంతో సీజన్ ప్రారంభంలోనే క్వింటాల్ బీపీటీ (సన్నాలు) కొత్త బియ్యం ధర రూ.2,800 నుంచి రూ.3,000 వరకు పలికింది. క్రమక్రమంగా పెరుగుతూ తాజాగా రూ.3,600 వరకు చేరింది.

అదేవిధంగా గత సంవత్సరం ఇదే సమయంలో పాత బియ్యం (సూపర్ ఫైన్) క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.3,800 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.4,400 నుంచి రూ.4,500 పలుకుతోంది. జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు నడుస్తుండగా...  మధ్య తరగతి, సామాన్య ప్రజలు బీపీటీ బియ్యం అంటేనే బెంబేలెత్తుతున్నారు. సంపన్న, ఉద్యోగ  వర్గాలు కూడా బియ్యం రేటు పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం
సివిల్ సప్లై ద్వారా బీపీటీ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్దేశించిన లక్ష్యం చేరలేదు. ఉత్పత్తి తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. ఆశించిన స్థాయిలో ధాన్యం దిగుబడి రాకపోవడం ఒక ఎత్తయితే... ఈ సీజన్‌లో కొత్త బియ్యం టోకున కొనుగోలు చేసే ఆనవాయితీ ఉండడంతో బియ్యం ధర ఒక్కసారిగా పెరిగింది.  భవిష్యత్‌లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. జూన్ నాటికి క్వింటాల్ ఫైన్ రైస్ ధర రూ.5,000కు చేరే అవకాశం ఉందని వారు అంటున్నారు.
 
దొడ్డు బియ్యం సైతం...
గత సీజన్‌తో పోలిస్తే వ్యాపారులు 40 శాతం మించి ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోయారు. ఫలితంగా బియ్యంగా మార్చే ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు కర్నూలు, జఫర్‌గఢ్ ప్రాంతాల నుంచి బియ్యాన్ని తీసుకువచ్చి అమ్ముతున్నారు. దీంతో రేటు అమాంతంగా పెరిగింది. బీపీటీతోపాటు దొడ్డు బియ్యం బహిరంగ మార్కెట్‌లో లభిస్తున్నప్పటికీ వాటి ధర కూడా అమాంతంంగా పెరిగింది.గతంలో ఇదే సమయంలో క్వింటాల్‌కు రూ.2,200 ఉండగా... ప్రస్తుతం రూ.2,800కు చేరింది.
 
బియ్యం అమ్మకం కేంద్రాలు ఏర్పాటు చేయాలి
విపరీతంగా పెరుగుతున్న బీపీటీ బియ్యాన్ని పేదలకు సివిల్ సప్లై శాఖ ద్వారా తక్కువ ధరకు విక్రయించేలా ఏర్పాట్లు చేయాలి. గతంలో పౌర సరఫరాల అధికారులు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రైస్ మిల్లర్లతో చర్చించి బియ్యం అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేశారు.  కొద్ది రోజులకే ఆ కేంద్రాలు మూతపడ్డాయి. పూర్తి స్థాయిలో అమ్మకం కేంద్రాలను కొనసాగించాలి.
- ఉప్పల రవి , భువనగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement