Brad Hodge
-
కోహ్లి ఇజ్జత్ తీసిన ఆసీస్ మాజీ క్రికెటర్
టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఆటలోనే కాదు సోషల్ మీడియాలో.. టీవీ యాడ్లలో యమా క్రేజ్ సంపాదించాడు. అందుకే కోహ్లితో ప్రకటనలు తీసేందుకు కార్పోరేట్ కంపెనీలు ఎగబడుతున్నాయి. అయితే ఇటీవలే కోహ్లి, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో కలిసి నటించిన ఓ ఫెయిర్‌నెస్ క్రీం ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ ప్రకటనపై తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడ్జ్ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘అద్భుతం.. డబ్బుల కోసం మనుషులు ఏదైనా చేస్తారు’అంటూ ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ కోహ్లి పరువు తీశాడు. హాడ్జ్ ట్వీట్‌పై మండిపడిన కోహ్లి ఫ్యాన్స్ అతడిని విమర్శిస్తూ రీట్వీట్ చేయడం మొదలెట్టారు. దీంతో తన ట్వీట్‌కు వచ్చిన అనూహ్య స్పందనకు షాక్ అయిన హాడ్జ్ ‘నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు’అంటూ మరో ట్వీట్ చేశాడు. అయితే అసలు ఆ ప్రకటనలో ఏముందంటే.. కోహ్లీ.. పంత్‌లు పాట పాడుతుంటే అందులో అనుకోకుండా పంత్ మొటిమల గురించి ప్రస్తావన వస్తుంది. దానిని చూపిస్తూ ఓ ఫెయిర్ నెస్ క్రీం వాడు తగ్గిపోతుందని కోహ్లీ అంటాడు. వాడగానే మొటిమలు తగ్గిపోతాయి. ఇలా ఆ ప్రకటను ముగిసిపోతుంది. ఈ వీడియోని విరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. దీంతో నెటిజన్లు వీరిద్దరిపై తెగ ట్రోల్ చేస్తున్నారు. 'వీరిద్దరినీ 12నెలలు నిషేదించండి ప్లీజ్' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా... మరొక నెటిజన్ 'ఎవరైనా చూడడానికి ముందే ఈ వీడియోని డిలీట్ చేయి బ్రో' అని కామెంట్ పెట్టాడు. ఇంకో నెటిజన్ అయితే 'ఎవడైనా మొటిమల మీద పాట పాడతాడా.. మీరు తప్ప' అని వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు. -
ఆ వ్యాఖ్యలు అందరి గురించి కావు: విరాట్ కోహ్లి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఆటగాళ్లతో సిరీస్ ఆరంభానికి ముందు ఉన్న స్నేహభావం ఇప్పుడు లేదన్న వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వివరణ ఇచ్చుకున్నాడు. అవి అందరిని ఉద్దేశించి చేసినవి కావని, కొంతమందితో తన స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని అన్నాడు. 2–1తో సిరీస్ గెలుచుకున్న అనంతరం మీడియా సమావేశంలో కోహ్లి ఆసీస్ జట్టుపై తన అసంతృప్తి వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ‘మ్యాచ్ ముగిశాక మీడియా సమావేశంలో నేను చెప్పిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనేమీ మొత్తం ఆస్ట్రేలియా జట్టు గురించి మాట్లాడలేదు. ఆ జట్టులోని ఇద్దరు ముగ్గురి గురించే చెప్పాను. నాకు బాగా తెలిసిన వారితో.. బెంగళూరు జట్టులోని ఆసీస్ ఆటగాళ్లతో ఎప్పటిలాగే స్నేహంగా ఉంటాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు’ అని వరుస ట్వీట్లతో కోహ్లి పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ హోరాహోరీ ఆటతో పాటు మాటల తూటాలతో వివాదాస్పదంగా ముగిసిన విషయం తెలిసిందే. అలా మాట్లాడినందుకు సారీ: బ్రాడ్ హాడ్జ్ మెల్బోర్న్: విరాట్ కోహ్లి భుజం నొప్పితో ధర్మశాల టెస్టులో ఆడకపోవడంతో.. ఐపీఎల్లో పాల్గొనేందుకే ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడ్జ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌తో గుజరాత్ లయన్స్ కోచ్‌గా తన హోదా ప్రమాదంలో పడే అవకాశం ఉండడంతో వెంటనే దిగివచ్చాడు. ‘ఎవరి మనసు నొప్పించాలనో నేనా వ్యాఖ్యలు చేయలేదు. ఐపీఎల్‌ను అవమానపరిచే ఉద్దేశం కూడా నాకు లేదు. చాలా ఏళ్లుగా ఆ లీగ్‌లో పాలుపంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. నా వ్యాఖ్యలపై భారత అభిమానులు బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నాను. గతంలో చాలామంది క్రికెటర్లు తమ జాతీయ జట్లుకు దూరంగా ఉండి ఐపీఎల్‌కు సిద్ధమయ్యారు’ అని హాడ్జ్ ట్విట్టర్లో తెలిపాడు. క్షమాపణ దినోత్సవంగా నిర్వహించుకుందాం: అశ్విన్ న్యూఢిల్లీ: బ్రాడ్ హాడ్జ్ క్షమాపణపై భారత ఆఫ్ స్పిన్నర్ ఆర్.అశ్విన్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘ఈ ఏడాది నుంచి మార్చి 30ని అంతర్జాతీయ క్షమాపణ దినోత్సవంగా గుర్తుంచుకుందాం’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు అభిమానుల నుంచి విశేషంగా స్పందన కనిపించింది. వేల సంఖ్యలో రిట్వీట్స్, లైక్స్ వచ్చాయి. -
కోహ్లికి క్షమాపణ చెప్పాడు..
సిడ్నీ:ఇటీవల ధర్మశాలలో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ నుంచి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోవడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కారణమన్న ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాడ్జ్ తన వ్యాఖ్యలపై దిగి వచ్చాడు. తాను చేసిన వ్యాఖ్యలు విరాట్ ను కించపరచడానికి కాదని తాజాగా స్పష్టం చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్ లో కీలకమైన మ్యాచ్ నుంచి విరాట్ వైదొలగడాన్ని తాను అలానే అర్ధం చేసుకున్నట్లు తెలిపాడు. గాయం తీవ్రత పెద్దగా లేనప్పుడు ఎవరైనా అలానే అనుకుంటారని తన వ్యాఖ్యలను సమర్ధించుకునే యత్నం చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవర్నైనా గాయపరిచి ఉంటే క్షమించమని విజ్ఞప్తి చేశాడు. ' నా ఉద్దేశం ఏ ఒక్క ఆటగాడ్ని గాయపరచాలని కాదు. చాలా మంది ఆటగాళ్లు క్యాష్ రిచ్ టోర్నమెంట్‌కు ముందు నుంచే సిద్ధమవుతున్నారు. ఆ లీగ్ కు ఉన్న క్రేజ్ అటువంటిది. అంతకుముందు కూడా ఐపీఎల్ కారణంగా పలువురు ఆటగాళ్లు దేశం తరపున ఆడే మ్యాచ్‌లను సైతం వదులుకున్నారు. ఆ క్రమంలోనే విరాట్ చివరి టెస్టు నుంచి తప్పుకోవడాన్ని తప్పుబట్టా. అంతేకానీ విరాట్ ను కించపరచాలని కాదు. నా వ్యాఖ్యలు విరాట్ తో పాటు భారత దేశ క్రికెట్ అభిమానుల్ని నిరాశపరిచినట్లు ఉన్నాయి. వాటిని వెనక్కి తీసుకుంటున్నా. ఈ సందర్భంగా విరాట్ కు క్షమాపణలు తెలియజేస్తున్నా'అని హాడ్జ్ అన్నాడు. గాయం కారణంగా ఫిట్నెస్ లేకపోవడంతో భారత్-ఆస్ట్రేలియా ధర్మశాల టెస్టుకు కోహ్లి దూరమైన విషయాన్ని ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ కోచ్ గా వ్యవహరిస్తున్న హాడ్జ్ తప్పుబట్టాడు. ఏప్రిల్ 5న జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్- రాయల్ చాలేంజర్స్ బెంగళూరు మ్యాచ్ కోసమే కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడిని హడ్జ్ వ్యాఖ్యానించాడు. -
ఐపీఎల్ కోసమే కోహ్లీ మ్యాచ్‌కు దూరం
మెల్బోర్న్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కోసమే నాల్గో టెస్టు మ్యాచ్ దూరమయ్యాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడ్జ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం హాడ్జ్ గుజరత్ లయన్స్ ఐపీఎల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గాయం కారణంగా ఫిట్నెస్ లేకపోవడంతో భారత్-ఆస్ట్రేలియా ధర్మశాల టెస్టుకు కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. ఈ విషయంపై హాడ్జ్ తన అభిప్రాయాన్ని ఆసీస్ మీడియాతో పంచుకున్నాడు. సీరీస్‌లో కీలకమైన మ్యాచ్‌లో కోహ్లి ఆడకపోవడాన్ని బ్రాడ్ హాడ్జ్ తప్పుబట్టాడు. ఎప్రిల్ 5న జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్- రాయల్ చాలేంజర్స్ బెంగళూరు మ్యాచ్ కోసమే కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడిని హడ్జ్ వ్యాఖ్యానించాడు. రాయల్ చాలేంజర్స్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ గాయంతో గుజరాత్ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో ఆడడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రతి ఒక క్రికెటర్‌కు ముఖ్యమన్నాడు. ఐపీఎల్ అందరి క్రికెటర్లకు డబ్బులు సంపాదించిపెడ్తుందని, కోహ్లికి కూడా బెంగళూరు చాలేంజర్స్ చాల డబ్బులు ఇచ్చిందని తెలిపాడు. అయితే కోహ్లీ తిరిగి ఐపీఎల్లో ఆడటం తమకు బాధ కల్గించే విషయమేనని పేర్కొన్నాడు. అయితే కోహ్లి మాత్రం ధర్మశాల టెస్టుకు ఒక రోజు ముందే 100 శాతం ఫిట్‌అని తేలితే మాత్రమే ఆడుతానని చెప్పిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్ కావడంతో కోహ్లీ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కోహ్లీ ఐపీఎల్‌కు తిరిగిరాకపోవడం ఎంతో మంది క్రికెటర్లకు మేలు చేస్తుందని హాడ్జ్ తెలిపాడు. అయితే గాయపడ్డ కోహ్లీ డ్రింక్స్ బాటిళ్లు అందించడం తనని అయోమయానికి గురిచేసిందన్నాడు. తను అలా చేయడం అనవసరమని పేర్కొన్నాడు. గాయంతో మ్యాచ్‌కు దూరమైనపుడు డ్రెస్సింగ్ రూమ్‌లో విశ్రాంతి తీసుకోవాలని, కానీ రహానేకు సలహాలు ఇవ్వడం మంచిది కాదన్నాడు. బ్రాడ్ హాడ్జ్ ఆసీస్ తరపున 5 టెస్టులు 25 వన్డేలు ఆడాడు. -
బీసీసీఐపై మురళీధరన్ మండిపాటు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తనకు రెండున్నర కోట్ల రూపాయలు(4 లక్షల డాలర్లు) చెల్లించాల్సి ఉందని శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తెలిపాడు. తమ దేశానికి చెందిన మహేల జయవర్ధనేకు రూ. 3 కోట్లు ఇవాల్సి ఉందని వెల్లడించాడు. గతేడాది గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ మొత్తానికి దూరమైన టీమిండియా ప్రధాన పేసర్ మొహ్మద్ షమీకి రూ.2 కోట్ల, 23 లక్షల పరిహారాన్ని బీసీసీఐ అంజేసింది. ఈ నేపథ్యంలో తమకు కూడా పరిహారం ఇవ్వాలని కొచ్చి టస్కర్స్ టీమ్ సభ్యులు కోరుతున్నారు. 'షమీకి బీసీసీఐ పరిహారం ఇచ్చింది. అవకాశముంటే కొచ్చి టస్కర్స్ ఆటగాళ్లకు కూడా పరిహారం ఇవ్వాల'ని ఈ జట్టు తరపున ఆడిన ఆస్ట్రేలియ క్రికెటర్ బ్రాడ్ హొడ్జ్ ట్విట్టర్ ద్వారా కోరాడు. దీని గురించి పలుమార్లు బీసీసీఐ అడిగినా ఫలితం లేకపోయిందని మురళీధరన్ చెప్పాడు. తాను చాలా లీగ్‌లు ఆడానని, బీసీసీఐ మాదిరిగా ఏ బోర్డు వ్యవహరించలేదని విమర్శించాడు. ఆటగాళ్లతో పాటు బోర్డు కూడా కాంట్రాక్టును గౌరవించాల్సిన అవసరముందన్నాడు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని, సమస్య పరిష్కారమైన తర్వాతే ఆటగాళ్లు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. వీవీఎస్ లక్ష్మణ్, రవీంద్ర జడేజా కూడా కొచ్చి టస్కర్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. -
గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా రైనా
చీఫ్ కోచ్‌గా బ్రాడ్ హాడ్జ్ న్యూఢిల్లీ: ఐపీఎల్లో రాజ్‌కోట్ ఫ్రాంచైజీకి చెందిన జట్టును మంగళవారం ఆవిష్కరించారు. ‘గుజరాత్ లయన్స్’ పేరుతో ఈ టీమ్ బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా, చీఫ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ బ్రాడ్ హాడ్జ్‌లను నియమించారు. ఎనిమిదేళ్లు కలిసి ఆడినందున ధోనిని ఎలా కట్టడి చేయాలో తనకు తెలుసని రైనా అన్నాడు. ‘నేను, మహీ కలిసి కొన్ని ఫైనల్స్ ఆడాం. కాబట్టి అతన్ని అడ్డుకోవడం ఎలాగో తెలుసు. ఈసారి ధోనిని జడేజా అవుట్ చేస్తే బ్రేవో డాన్స్ చేస్తాడు. చెన్నై తరఫున నేను, జడేజా, మెకల్లమ్, బ్రేవో కలిసి ఆడాం. ఇప్పుడు ఫాల్క్‌నర్ రావడంతో జట్టులో సమతుల్యత పెరిగింది. వేలంలో కూడా మంచి ఆటగాళ్లు వస్తారని ఆశిస్తున్నా. వేలంలో ఉన్న దేశవాళీ, విదేశీ ఆటగాళ్లలో నైపుణ్యానికి కొదువలేదు’ అని రైనా పేర్కొన్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీ తనను మెరుగైన క్రికెటర్‌గా తీర్చిదిద్దిందన్నాడు.