
ఆ వ్యాఖ్యలు అందరి గురించి కావు: విరాట్ కోహ్లి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఆటగాళ్లతో సిరీస్ ఆరంభానికి ముందు ఉన్న స్నేహభావం ఇప్పుడు లేదన్న వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వివరణ ఇచ్చుకున్నాడు. అవి అందరిని ఉద్దేశించి చేసినవి కావని, కొంతమందితో తన స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని అన్నాడు. 2–1తో సిరీస్ గెలుచుకున్న అనంతరం మీడియా సమావేశంలో కోహ్లి ఆసీస్ జట్టుపై తన అసంతృప్తి వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ‘మ్యాచ్ ముగిశాక మీడియా సమావేశంలో నేను చెప్పిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనేమీ మొత్తం ఆస్ట్రేలియా జట్టు గురించి మాట్లాడలేదు.
ఆ జట్టులోని ఇద్దరు ముగ్గురి గురించే చెప్పాను. నాకు బాగా తెలిసిన వారితో.. బెంగళూరు జట్టులోని ఆసీస్ ఆటగాళ్లతో ఎప్పటిలాగే స్నేహంగా ఉంటాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు’ అని వరుస ట్వీట్లతో కోహ్లి పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ హోరాహోరీ ఆటతో పాటు మాటల తూటాలతో వివాదాస్పదంగా ముగిసిన విషయం తెలిసిందే.
అలా మాట్లాడినందుకు సారీ: బ్రాడ్ హాడ్జ్
మెల్‌బోర్న్: విరాట్ కోహ్లి భుజం నొప్పితో ధర్మశాల టెస్టులో ఆడకపోవడంతో.. ఐపీఎల్‌లో పాల్గొనేందుకే ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడ్జ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌తో గుజరాత్ లయన్స్ కోచ్‌గా తన హోదా ప్రమాదంలో పడే అవకాశం ఉండడంతో వెంటనే దిగివచ్చాడు. ‘ఎవరి మనసు నొప్పించాలనో నేనా వ్యాఖ్యలు చేయలేదు. ఐపీఎల్‌ను అవమానపరిచే ఉద్దేశం కూడా నాకు లేదు. చాలా ఏళ్లుగా ఆ లీగ్‌లో పాలుపంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. నా వ్యాఖ్యలపై భారత అభిమానులు బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నాను. గతంలో చాలామంది క్రికెటర్లు తమ జాతీయ జట్లుకు దూరంగా ఉండి ఐపీఎల్‌కు సిద్ధమయ్యారు’ అని హాడ్జ్ ట్విట్టర్‌లో తెలిపాడు.
క్షమాపణ దినోత్సవంగా నిర్వహించుకుందాం: అశ్విన్
న్యూఢిల్లీ: బ్రాడ్ హాడ్జ్ క్షమాపణపై భారత ఆఫ్ స్పిన్నర్ ఆర్.అశ్విన్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘ఈ ఏడాది నుంచి మార్చి 30ని అంతర్జాతీయ క్షమాపణ దినోత్సవంగా గుర్తుంచుకుందాం’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు అభిమానుల నుంచి విశేషంగా స్పందన కనిపించింది. వేల సంఖ్యలో రిట్వీట్స్, లైక్స్ వచ్చాయి.