
కోహ్లికి క్షమాపణ చెప్పాడు..
సిడ్నీ:ఇటీవల ధర్మశాలలో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ నుంచి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోవడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కారణమన్న ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాడ్జ్ తన వ్యాఖ్యలపై దిగి వచ్చాడు. తాను చేసిన వ్యాఖ్యలు విరాట్ ను కించపరచడానికి కాదని తాజాగా స్పష్టం చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్ లో కీలకమైన మ్యాచ్ నుంచి విరాట్ వైదొలగడాన్ని తాను అలానే అర్ధం చేసుకున్నట్లు తెలిపాడు. గాయం తీవ్రత పెద్దగా లేనప్పుడు ఎవరైనా అలానే అనుకుంటారని తన వ్యాఖ్యలను సమర్ధించుకునే యత్నం చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవర్నైనా గాయపరిచి ఉంటే క్షమించమని విజ్ఞప్తి చేశాడు.
' నా ఉద్దేశం ఏ ఒక్క ఆటగాడ్ని గాయపరచాలని కాదు. చాలా మంది ఆటగాళ్లు క్యాష్ రిచ్ టోర్నమెంట్కు ముందు నుంచే సిద్ధమవుతున్నారు. ఆ లీగ్ కు ఉన్న క్రేజ్ అటువంటిది. అంతకుముందు కూడా ఐపీఎల్ కారణంగా పలువురు ఆటగాళ్లు దేశం తరపున ఆడే మ్యాచ్లను సైతం వదులుకున్నారు. ఆ క్రమంలోనే విరాట్ చివరి టెస్టు నుంచి తప్పుకోవడాన్ని తప్పుబట్టా. అంతేకానీ విరాట్ ను కించపరచాలని కాదు. నా వ్యాఖ్యలు విరాట్ తో పాటు భారత దేశ క్రికెట్ అభిమానుల్ని నిరాశపరిచినట్లు ఉన్నాయి. వాటిని వెనక్కి తీసుకుంటున్నా. ఈ సందర్భంగా విరాట్ కు క్షమాపణలు తెలియజేస్తున్నా'అని హాడ్జ్ అన్నాడు.
గాయం కారణంగా ఫిట్‌నెస్ లేకపోవడంతో భారత్-ఆస్ట్రేలియా ధర్మశాల టెస్టుకు కోహ్లి దూరమైన విషయాన్ని ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ కోచ్ గా వ్యవహరిస్తున్న హాడ్జ్ తప్పుబట్టాడు. ఏప్రిల్ 5న జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్- రాయల్ చాలేంజర్స్ బెంగళూరు మ్యాచ్ కోసమే కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడిని హడ్జ్ వ్యాఖ్యానించాడు.