brahma god
-
సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక ఆలయం ఇదే..!
సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఆలయాలు లేవెందుకు? త్రిమూర్తుల్లోకెల్లా చిన్నవాడయిన బ్రహ్మ ఎప్పుడూ వృద్ధుడుగానే ఉంటాడెందుకు? ఈ సందేహాలకు సమాధానమిస్తుంది పుష్కర్ పుణ్యక్షేత్రం, ఆ క్షేత్ర స్థలపురాణం. రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్‌కు 11 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న సరస్సు పుష్కర్. క్రమంగా ఆ ప్రాంతం ఈ సరస్సు పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సు చెంతనే ఉంది సృష్టికర్త బ్రహ్మ ఆలయం. ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక ఆలయం ఇది. మన దేశంలోని అతి ముఖ్యమైన తీర్ధాల్లో ఒకటైన పుష్కర్‌ను దర్శించుకోకుంటే పుణ్యక్షేత్ర సందర్శన పూర్తి కానట్టేనని పెద్ద లంటారు. అందుకే దీన్ని తీర్థరాజ్ అంటారు. పౌరాణికంగా ఎంతో ప్రాశస్త్యం చెందిన మహాభారత, రామాయణాల్లోనూ ఆదితీర్థంగా ప్రస్తావించబడింది ఈ తీర్థం. కార్తీక పౌర్ణమి రోజున ఇందులో ఓసారి మునిగితే వందల సంవత్సరాల పాటు యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుందట. స్థలపురాణంపద్మపురాణం ప్రకారం పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోనే తామరపూవునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడు బ్రహ్మదేవుడు. ఆ సమయంలో ఆ తామరపూపు నుంచి రేకులు మూడు చోట్ల రాలి, మూడు సరస్సులు ఏర్పడ్డాయి. వాటిని జ్యేష్ట పుష్కర్, మధ్యపుష్కర్, కనిష్టపుష్కర్ అని పిలుస్తున్నారు. పైగా సృష్టికర్త తాను భూలోకంలో అడుగిడినప్పుడు తన చేతి (కరం)నుంచి పుష్పం రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్ అని పేరు పెట్టినట్లు మరో కథనం కూడా వినిపిస్తుంది.సరస్వతీదేవి శాపం.. ఏకైక ఆలయంవజ్రనాభ సంహారం అనంతరం లోకకల్యాణం కోసం ఇక్కడ యజ్ఞం చేయాలని సంకల్పించాడట సృష్టికర్త. సుముహూర్తం ఆసన్నమవుతుండటంతో సరస్వతీదేవిని తీసుకుని రమ్మని తన కుమారుడైన నారదుడిని పంపిస్తాడు బ్రహ్మ. కానీ నారదుడి కలహప్రియత్వం కారణంగా బయలుదేరేందుకు తాత్సారం చేస్తుంది సావిత్రీ దేవి. (ఈమెనే సరస్వతీ దేవి అని కూడా పిలుస్తారు) ఇవతల ముహూర్తం మించిపోతుండటంతో, అనుకున్న సమయానికే యజ్ఞం పూర్తి కావాలన్న తలంపుతో ఇంద్రుడి సహకారంతో గాయత్రిని పెళ్లాడి నిర్ణీత సమయానికి యజ్ఞాన్ని ప్రారంభిస్తారు.యజ్ఞం సమాప్తం అవుతుండగా అక్కడికి చేరుకున్న సరస్వతీదేవి బ్రహ్మ దేవుడి పక్కన మరో స్త్రీని చూసి ఉగ్రరూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితో సహా అక్కడున్న దేవతలందరినీ శపిస్తుంది. భర్తను వృద్ధుడై పొమ్మని, ఆయనకు ఒక్క పుష్కర్‌లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవనీ శపిస్తుంది. అనంతరం బ్రహ్మదేవుడి అభ్యర్థనను మన్నించి శాప తీవ్రతను తగ్గిస్తుందట. బ్రహ్మదేవాలయం పుష్కర్‌లో మాత్రమే ఉండటానికి కారణం ఇదేనట. పుష్కర్‌లో సావిత్రీమాత ఆలయంతో పాటు ఓ చిన్న నీటి ప్రవాహం ఉంది. దీన్ని సావిత్రీనది అని పిలుస్తారు స్థానికులు. ఆమెను పూజించిన స్త్రీలకు నిత్య సుమంగళి వరాన్నిస్తుందన్న నమ్మకంతో పుష్కర్‌ను సందర్శించిన భక్తులంతా ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తారు.ఇతర విశేషాలుపుష్కర్లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సుమారు 400 పురాతన ఆలయాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఆప్తేశ్వర్, రంగ్జీ, ఏకలింగజీ దేవాలయాలు. వీటిలో రంగ్జీ ఆలయం దక్షిణాది శైలిలో కట్టబడి ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి రంగ్‌జీగా పూజలందుకుంటున్నాడు. రాజస్తాన్‌లోని సుప్రసిద్ధ శివక్షేత్రం ఏకలింగజీ దేవాలయం. ఇక్కడ శివలింగం కేవలం లింగాకారంగా కాక నలుపక్కలా నాలుగు ముఖాలను కలిగి ఉండటం విశేషం. ఇవి కాక గోవిందాజీ ఆలయం, నక్షత్రశాల, హవామహల్, చట్రిస్, గాలోటా, ఖవాసాహిబ్ దర్గా, అధాన్ దిన్ కా జూన్ ప్రా, అనాసాగర్, జగ్‌నివాస్ భవనం, జగదీష్ ఆలయం, అహర్, నక్కి సరస్సు, జోథ్‌పూర్ పట్టణం, అజ్మీరు, ఉదయ్‌పూర్, అబూశిఖరం, పింక్‌సిటీగా పేరుగాంచిన జైపూర్లు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు.ఎలా వెళ్లాలంటే..?పుష్కర్‌కు వెళ్లడానికి దగ్గరలోని అజ్మీర్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ఢిల్లీ, జోద్పూర్, జైపూర్, ఆగ్రా, ముంబాయ్. అహ్మదాబాద్‌ల నుంచి రైళ్లున్నాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ బెస్ట్. అజ్మీర్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని పుష్కర్‌కు చేరుకోవాలంటే లోకల్ బస్సులు, ఆటోలు ఉన్నాయి. విమాన మార్గం సంగనీర్ ఏర్పోర్ట్. అయితే అక్కడినుంచి పుష్కర్ వెళ్లాలంటే 127 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అన్ని ప్రధాన నగరాలనుంచి పుష్కర్‌కు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
దుర్గమాసుర సంహారం
పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. హిరణ్యాక్షుడి వంశానికి చెందిన రురుడి కొడుకు అతడు. దుర్గముడు పరమనీచుడు, దుర్మార్గుడు, అతిక్రూరుడు, పరపీడనా పరాయణుడు. దేవతల బలమంతా వేదాలలోనే ఉన్నందున వేదాలను నాశనం చేస్తే చాలు, దేవతలందరినీ ఇట్టే నాశనం చేయవచ్చని తలచాడు. అదంత తేలికగా అయ్యే పనికాదు. అందువల్ల ముందుగా బ్రహ్మను ప్రసన్నుడిని చేసుకుని, అనుకున్న పని సాధించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా హిమాలయాలకు వెళ్లి, అక్కడ బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. దుర్గముడి తపస్సు తీవ్రతకు ముల్లోకాలు గడగడలాడాయి. నక్షత్రాలు గతులు తప్పాయి. సూర్యచంద్రులు తేజోవిహీనులయ్యారు. దేవతలంతా హాహాకారాలు చేయడంతో బ్రహ్మదేవుడు హంసవాహనంపై బయలుదేరి, దుర్గముడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.‘దుర్గమా! నీ తపస్సుకు ప్రసన్నుడనయ్యాను. వరం కోరుకో’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘బ్రహ్మదేవా! వేదాలలోను, ఈ ముల్లోకాలలోను బ్రాహ్మణులకు తెలిసిన మంత్రాలన్నింటినీ నాకు స్వాధీనం చేయి. దేవతలను జయించే బలం ఇవ్వు’ అని కోరాడు దుర్గముడు.‘తథాస్తు’ అని పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. దుర్గముడికి బ్రహ్మదేవుడు ఈ వరమిచ్చిన తక్షణమే వేదమంత్రాలు విప్రులకు దూరమయ్యాయి. ఎవరికీ ఏ మంత్రమూ స్ఫురించని పరిస్థితి వాటిల్లింది. సంధ్యావందనాదుల వంటి నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానాలు, యజ్ఞ యాగాదులు నిలిచిపోయాయి. ఇలా ఎందుకు జరిగిందో అర్థంకాక వేదపండితులు పరస్పరం ప్రశ్నించుకోసాగారు. ఎవరికీ సమాధానం దొరకదాయె! ముల్లోకాల్లోనూ హాహాకారాలే తప్ప ఎక్కడా స్వాహాకారాలు వినిపించని పరిస్థితి దాపురించింది. హవిర్భాగాలు అందక దేవతలందరూ శక్తిహీనులుగా మారారు. దుర్గముడు ఇదే అదనుగా తలచి స్వర్గాన్ని ముట్టడించాడు.వజ్రదేహుడైన దుర్గముడిని ఎదిరించడం దేవతలకు శక్తికి మించిన పని అయింది. అతడి చేతిలో చావు దెబ్బలు తిని తలో దిక్కూ పారిపోయారు. దుర్గముడు అమరావతిలోని దేవేంద్ర భవనానికి చేరుకున్నాడు. అతడు అక్కడకు రాకముందే, సమాచారం తెలుసుకున్న దేవేంద్రుడు పలాయనం చిత్తగించాడు. స్వర్గాన్ని విడిచి పారిపోయిన దేవతలందరూ దేవేంద్రుడితో పాటు కొండల్లోను, కోనల్లోను ఎవరికీ కనిపించకుండా తలదాచుకోసాగారు. దిక్కుతోచక అడవులు పట్టిన దేవతలంతా ఆపద నుంచి బయటపడటానికి ఆదిపరాశక్తిని పూజించడం ప్రారంభించారు.మరోవైపు, హోమాలు లేక వర్షాలు కురవడం మానేశాయి. నేలంతా ఎండి బీటలు పడింది. చెరువులు, నూతులు ఎండిపోయాయి. నదీ నదాలలో కూడా నీటిజాడ కనుమరుగైంది. ఈ అనావృష్టి వందేళ్లు కొనసాగింది. కరవు కరాళ నృత్యానికి పశుపక్ష్యాదులు చాలా వరకు అంతరించాయి. మనుషులు అసంఖ్యాకంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంటింటా శవాలు, ఏ ఊళ్లో చూసినా కళేబరాల గుట్టలు పడి ఉన్న దృశ్యాలే కనిపించసాగాయి. ఈ దారుణ పరిస్థితికి విప్రులందరూ కలత చెందారు. ఏం చేయాలో దిక్కుతోచక వారందరూ హిమాలయాలకు చేరి, నిరాహారులై ఆదిపరాశక్తిని స్తుతించసాగారు. విప్రుల ప్రార్థనలకు ప్రసన్నురాలైన ఆదిపరాశక్తి వారి ఎదుట ప్రత్యక్షమైంది. మెడలో ఫలపుష్ప వనమూలికాదుల మాలలను, అనంత హస్తాలలో అశేష ఆయుధాలను ధరించి కరుణారస సాగరంలా వారి ముందు నిలిచింది. దుఃఖిస్తున్న ప్రజలను చూసి, జగజ్జనని అనంత నయనాలు ఏకధారగా వర్షించాయి. ఆ వర్షధారలకు భూమిపైనున్న వాపీ కూప తటాకాదులు నీటితో నిండాయి. ఓషధులు పులకించాయి. ఫలపుష్పాది వృక్షాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. అప్పటి వరకు కొండ కోనల్లో దాక్కున్న దేవతలందరూ బయటకు తరలి వచ్చి, విప్రులతో కలసి గొంతు కలిపి దేవిని స్తుతించడం ప్రారంభించారు. జగన్మాత పరవశురాలైంది. తన చేతుల్లోని పండ్లు, కాయలు అందరికీ అందించింది. పశుపక్ష్యాదులకు కావలసిన ఆహారాన్ని వాటికి అందించింది. ఫల శాకాదులు అందించడంతో విప్రులు, దేవతలు జగజ్జననిని ‘శాకంబరి’ అంటూ శ్లాఘించారు. సురనరాది ప్రాణికోటి ఆహారాన్ని అందుకుంటున్న కోలాహలం దుర్గముడికి వినిపించింది. ఏం జరుగుతోందో తెలుసుకుని రమ్మని దూతలను పంపించాడు. వారు తిరిగి వచ్చి, తాము చూసినదంతా చెప్పారు. దుర్గముడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆయుధాలు ధరించి, రథారూఢుడై సైన్య సమేతంగా హుటాహుటిన జగజ్జనని చుట్టూ ఉన్న దేవతల వద్దకు చేరుకున్నాడు. వస్తూనే శరపరంపర కురిపించాడు. దేవతలందరూ ఎదిరించి పోరాడు. విప్రులు కూడా శక్తి మేరకు యుద్ధం చేశారు. రాక్షస సేనల ధాటికి దేవ సేనలు, విప్రసమూహం తట్టుకోలేకపోవడంతో హాహాకారాలు మిన్నుముట్టాయి. ‘త్రాహి! త్రాహి!’ అంటూ వారంతా జగజ్జననిని శరణు కోరారు.జగజ్జనని దేవ మానవుల చుట్టూ తేజోమయ రక్షణవలయాన్ని ఏర్పరచింది. రాక్షసుల ఆయుధాలు ఆ వలయం అంచులను తాకి, గోడను తాకిన గులకరాళ్లలా రాలిపోతున్నాయి. జగన్మాత స్వయంగా యుద్ధరంగానికి వచ్చింది. దేవి శరీరం నుంచి అనంతంగా శక్తి స్వరూపిణులు ఆవిర్భవించారు. వారంతా చిత్ర విచిత్రమైన ఆయుధాలతో రాక్షస సేనలను ముట్టడించి, క్షణాల్లోనే తుదముట్టించారు.దుర్గముడు విచిత్రరథంపై రణరంగానికి వచ్చాడు. చండప్రచండంగా యుద్ధం చేశాడు. భూమ్యాకాశాలను కమ్మేసినట్లుగా శరపరంపరను కురిపించి, అనంతశక్తులను జయించాడు. జగన్మాత ఎదుట తన రథాన్ని నిలిపాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. చివరకు జగజ్జనని ప్రయోగించిన బాణాలకు దుర్గముడు నెత్తురు కక్కుకుంటూ రథం మీద నుంచి నేలమీద దొర్లిపడి మరణించాడు. దుర్గముడి చావుతో దేవతలు ఆనంద తాండవం చేశారు. ముల్లోకాలూ తిరిగి శాంతిని పొందాయి. -
‘బ్రహ్మ కన్ను’ గురించి తెలుసా.. ఆ శాపం గురించి ఎప్పుడైనా విన్నారా?
కోహినూర్.. ప్రపంచంలోనే ఫేమస్ వజ్రం. బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న ఈ వజ్రం మనకు తిరిగిచ్చేయాలన్న డిమాండ్లు ఎప్పటికప్పుడు వస్తునే ఉంటాయి. ఆ మధ్య రాణి చనిపోయినప్పుడు కూడా ఇవి వెల్లువెత్తాయి. ఇదే తరహాలో మన దేశం నుంచి తరలిపోయిన మరో పెద్ద వజ్రం ‘బ్రహ్మ కన్ను (ఐ ఆఫ్ బ్రహ్మ)’ గురించి మీకు తెలుసా? అది ఇచ్చిన ‘శాపం’ గురించి మీరెప్పుడైనా విన్నారా? లేదా.. అయితే.. ఈ వివరాలు మీ కోసమే.. అది అరుదైన నలుపు రంగు వజ్రం. ‘ది బ్లాక్ ఓర్లోవ్ డైమండ్’గా పిలుస్తున్న దీని బరువు 67.69 క్యారెట్లు. ప్రపంచంలోని నలుపు రంగులోని అతిపెద్ద వజ్రాల్లో దీనిది ఏడో స్థానం. పాండిచ్చేరి (ప్రస్తుతం పుదుచ్చేరి)లోని ఉన్న ఓ ఆలయంలో ఉన్న బ్రహ్మ దేవుడి విగ్రహం నుదుటిపై ఈ వజ్రం ఉండేదట. అందుకే దీనిని ‘బ్రహ్మ కన్ను’గా పిలిచేవారు. ఆ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఓ సన్యాసి బ్రహ్మ దేవుడి విగ్రహం నుంచి ఈ వజ్రాన్ని పెకలించి, దొంగిలించుకెళ్లాడు. దీనితో ఈ వజ్రం ఎవరివద్ద ఉంటే వారికి కీడు జరిగేలా బ్రహ్మ దేవుడు శపించాడన్నది అప్పటి కథనం. ఈ క్రమంలోనే వజ్రాన్ని దొంగిలించిన సన్యాసి కొంతకాలానికే హత్యకు గురయ్యాడని.. క్రమంగా ఇది రష్యాకు చేరిందని చెబుతారు. ముగ్గురి ఆత్మహత్యలతో.. భారతదేశం నుంచి రష్యాకు చేరిన ‘బ్రహ్మ కన్ను’ వజ్రం చేతులు మారుతూ యూరప్‌కు చేరుకుంది. 1932లో యూరోపియన్ వజ్రాల డీలర్ జేడబ్ల్యూ పారిస్ ఈ వజ్రాన్ని కొని అమెరికాకు తీసుకెళ్లాడు. కొద్దిరోజులకే ఓ పెద్ద భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత రష్యా నుంచి ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌కు వచ్చి తలదాచుకుంటున్న రష్యా రాజకుమార్తెలు లియోనిలా బరియటిన్స్కీ, నదియా వ్యేగిన్ ఓర్లోవ్ల చేతికి ఈ వజ్రం చేరింది. ఈ ఇద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వజ్రాన్ని చివరిగా ధరించిన రాజకుమార్తె పేరిటే దీనికి ‘బ్లాక్ ఓర్లోవ్’ అని పేరువచ్చింది. అది శాపగ్రస్తమైనదిగా ప్రచారమైంది. శాపం పోతుందని ముక్కలు చేసి 1950వ దశకంలో చార్లెస్ విల్సన్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని కొనుగోలు చేశాడు. అసలైన ‘బ్రహ్మ కన్ను’ వజ్రం బరువు ఏకంగా 195 క్యారెట్లు. అయితే దీనికి ఉన్న శాపం పోతుందన్న ఉద్దేశంతో.. మూడు ముక్కలు చేయించాడు. అందులో పెద్ద ముక్క ఇప్పుడు ‘బ్లాక్ ఓర్లోవ్’ (67.69 క్యారెట్లు)గా చలామణీ అవుతోంది. మిగతా రెండు ముక్కలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. భయంతో ‘రేటు’ మారుతూ.. ‘బ్లాక్ ఓర్లోవ్’ వజ్రం శాపగ్రస్తమైన దన్న ప్రచారంతో దాని విలువ పెరు గుతూ తగ్గుతూ వచ్చింది. విల్సన్ 1969లో ‘బ్లాక్ ఓర్లోవ్’ వజ్రాన్ని గుర్తు తెలియని వ్యక్తికి రూ.2.45 కోట్లకు అమ్మాడు. తర్వాత చాలాకాలం ఎవరి కంటా పడ లేదు. 1990లో ఈ వజ్రం సదబీజ్ సంస్థలో వేలానికి వచ్చినప్పుడు రూ.80 లక్షలే పలికింది. కానీ 1995లో జరిగిన వేలంలో ఏకంగా రూ.12.25 కోట్లకు అమ్ముడైంది. ఆ వ్యక్తి నుంచి 2004లో అమెరికన్ ధనవంతుడు డెన్నిస్ పెటిమెజాస్ ఈ వజ్రాన్ని కొన్నా ధర ఎంతో బయటికి రాలేదు. 2006లో ఆయన దీనిని రూ.2.9 కోట్లకు అమ్మే శాడు. ఇటీవలే ఈ వజ్రాన్ని న్యూయార్క్, లండన్లలో జరిగిన నేచురల్ హిస్టరీ ఎగ్జిబిషన్లలో ప్రదర్శించారు. అయితే, భారత్‌లో ఇప్పటి వరకూ నల్ల వజ్రాలు దొరకనందున.. ‘బ్లాక్ ఓర్లోవ్’వజ్రం ఇక్కడిది కాదనే వాదనా ఉంది. వజ్రాల వ్యాపారంలో ఉన్న వారు మాత్రం ఇది భారత్ నుంచే వచ్చిందని చెబుతున్నారు. ఆ శాపమూ వాస్తవమే అని అంటున్నారు. -
ఉత్సవాల వేల్పు పూటకోవాహనంపై ఊరేగింపు
జగత్కల్యాణం కోసం వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసునికి బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. బ్రహ్మ నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలైనాయి. దసరా నవరాత్రులు, కన్యామాసం (అశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రానికి ముగిసేలాబ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆచారంగా మారింది. ఇవి అంకురార్పణతో ఆరంభమై ధ్వజావరోహణంతో అయిపోతాయి. ధ్వజారోహణం బహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానించడం ఆనవాయితీ. ఒక కొత్తవస్త్రం మీద స్వామివారి వాహనమైన గరుడుని బొమ్మను చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. కొడితాడు సాయంతో దీన్ని ధ్వజస్తంభం మీద కట్టి, పైకి ఎగుర వేస్తారు. ఎగిరే ఈ గరుడ పతాకమే సకల దేవతలకు ఆహ్వాన పత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ కొండమీదే ఉంటూ ఉత్సవాలను తిలకిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పెద్ద శేషవాహనం ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామి కొలువు తీరింది శేషాద్రి. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి ప్రాధాన్యత నిస్తూ తొలి రోజు ఆ వాహనం మీదే ఊరేగుతాడు స్వామి. చిన్నశేషవాహనం: రెండవరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. శుద్ధ సత్వానికి ప్రతీక అయిన పరమశివుని హస్తాభరణంగా, గళాభరణంగా విరాజిల్లే వాసుకి చిన్న శేషవాహన రూపంలో శ్రీనివాసుని సేవలో తరిస్తున్నాడు. హంసవాహ నం రెండవ రోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయని అయిన శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతాడు. హంస పాలను, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతంగా హంస వాహనాన్ని అధిరోహిస్తాడు. హంసపై ఊరేగడం ద్వారా తుచ్ఛమైన కోర్కెలు వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని భక్తులకు చాటుతారు. సింహవాహనం బ్రహ్మోత్సవాలలో మూడవరోజు ఉదయం సింహ వాహనమెక్కి వేంకటనాథుడు భక్తులకు దర్శనమిస్తాడు. మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. ముత్యపుపందిరి వాహనం మూడవ రోజు రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామివారికి జరిగే సుకుమార సేవగా ముత్యపు పందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామి చెబుతాడు. కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తే, తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే వేల్పు వెంకటాద్రివాసుడు. శాశ్వతమైన కైవల్యం ప్రసాదించే కల్ప తరువునని చాటుకోవడం కోసం నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగుతారు. సర్వభూపాల వాహనం లోకంలో భూపాలురందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ నాలుగోరోజు రాత్రి సర్వ భూపాల వాహనం మీద కొలువుదీరుతారు శ్రీవారు. మోహినీ అవతారం బ్రహ్మోత్సవాలలో ప్రధానమైనది ఐదవ రోజు. అన్ని వాహన సేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే ఆరంభమవుతుంది. క్షీరసాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. గరుడ వాహనం ఐదో రోజు రాత్రి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతాడు శ్రీనివాసుడు. స్వామివారి మూల మూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ మాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తాడు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాల, నూతన గొడుగులు గరుడవాహనంలో అలంకరిస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని ఈ సేవ చాటి చెబుతుంది. హనుమంత వాహ నం ఆరవరోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి వివరిస్తూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని స్వామివారు తెలియజేస్తారు. గజ వాహనం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతాడు. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. సూర్యప్రభ వాహనం ఏడవరోజు ఉదయం ఏడుగుర్రాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగుతాడు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు. చంద్ర ప్రభ వాహనం ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పూమాలలు ధరించి స్వామి చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణతా, చంద్రుని శీతలత్వమూ తన అంశలేనని తెలియజేస్తారు. రథోత్సవం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అశ్వ వాహనం చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడం కోసమే ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద ఊరేగుతారు. చక్రస్నానం ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసి పోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయ ఆవరణలో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం చక్రతాళ్వార్‌ను స్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ధ్వజావరోహణం చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభంపై దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చే యడం ద్వారా వారికి వీడ్కోలు చెబుతారు. వార్షిక బ్రహ్మోత్సవాలు తేది ఉదయం రాత్రి 26.09.2014 ధ్వజారోహణం పెద్ద శేషవాహనం (సా.6గం.) 27.09.2014 చిన్నశేషవాహనం హంసవాహనం 28.09.2014 సింహవాహనం ముత్యపుపందిరి వాహనం 29.09.2014 కల్పవృక్షవాహనం సర్వభూపాల వాహనం 30.09.2014 మోహినీ అవతారం గరుడవాహనం 01.10.2014 హనుమంతవాహనం సాయంత్రం స్వర్ణరథోత్సవం గజవాహనం 02.10.2014 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం 03.10.2014 రథోత్సవం (ఉ.7.50) అశ్వ వాహనం 04.10.2014 చక్రస్నానం ధ్వజావరోహణం