17 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్:అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని విజిలెన్స్, సివిల్ సప్లయిస్ ఆధికారులు గురువారం సీజ్‌చేశారు. రూ. 3.40లక్షల విలువ చేసే 17 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఐదుగురు వ్యక్తులపై 6ఏ, క్రిమినల్ కే సులు నమోదుచేశారు. వివరాలిలా వున్నాయి.. ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన తోట ప్రభాకర్‌రెడ్డి, బ్రహ్మారెడ్డి, శివారెడ్డిలు బుధవారం రాత్రి మార్టూరు సమీప గ్రామాల్లో రేషన్ డీలర్లు, కార్డుదారుల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా మండపేటకు అక్రమంగా తరలించేందుకు లారీలో లోడు చేశారు. గురువారం తెల్లవారుజామున మార్టూరు నుంచి బయలుదేరిన లారీ గుంటూరు మిర్చి యార్డుకు వచ్చే సమయానికి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందడంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
లారీతోపాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని జిల్లా విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. సుమారు రూ.3.40 లక్షల విలువచేసే 17టన్నుల రేషన్ బియ్యం 340 బ్యాగుల్లో ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ళకు చెందిన లారీ డ్రైవర్ షేక్ మహబూబ్‌బాషాను విచారించగా బుధవారం మార్టూరు నుంచి సమీప గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని లారీలో లోడుచేసినట్లు అంగీకరించాడు. డ్రైవర్‌తోపాటు, యజమాని షేక్ హుస్సేన్, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన తోట ప్రభాకర్‌రెడ్డి, బ్రహ్మారెడ్డి, శివారెడ్డిలపై 6ఏ, క్రిమినల్ కేసులు నమోదుచేసి జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ ఎదుట హాజరు పరుస్తున్నట్లు విజిలెన్స్ తహశీల్దార్ టి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఖాళీ లారీని అప్పగించారు. దాడులో సీటీడీటీ కుటుంబరావు, సిబ్బంది పాల్గొన్నారు.