రక్షణ రంగంలో ‘బ్రహ్మోస్’ ఫార్ములా
మాస్కో: రష్యా సహకారంతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణుల విజయసూత్రాన్ని భారత రక్షణ రంగంలో మరిన్ని వేదికలకు విస్తరింపజేస్తామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఇరు దేశాల ఉమ్మడి భాగస్వామ్యంతో రక్షణ పరికరాలు తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రష్యాలో ఐదు రోజుల పర్యటన నిమిత్తం గురువారం రాష్ట్రపతి ప్రణబ్ మాస్కో చేరుకున్నారు.
ఈ సందర్భంగా రష్యా వార్తాసంస్థ ‘ఇటార్ టాస్’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం ఎంతో ముందుకు వెళ్లిందని ప్రణబ్ వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజయానికి సూచికగా రష్యా నిర్వహించనున్న 70వ ‘విక్టరీ డే’ ఉత్సవాల్లో ప్రణబ్ పాల్గొంటారు. శనివారం మాస్కోలో జరగనున్న ఈ వేడుకల్లో 75 మందితో కూడిన భారత సైనిక దళం కూడా పాల్గొననుంది.