brailey
-
రాహుల్‌తో మన మాట
న్యూఢిల్లీ: ‘అప్నీ బాత్ రాహుల్ కే సాథ్’ (రాహుల్‌తో మన మాట) పేరుతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిని కలుసుకుని మాట్లాడి, దేశ భవిష్యత్తు, ప్రభుత్వాల పని, సమాజంలో రావాల్సిన మార్పులు తదితర విషయాలపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. తొలిదశలో భాగంగా ఢిల్లీ, అస్సాం, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వచ్చిన ఏడుగురు విద్యార్థులు శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఓ చైనీస్ రెస్టారెంట్లో రాహుల్‌ను కలిశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను బ్రెయిలీ లిపిలోనూ విడుదల చేయడం, ఎల్జీబీటీక్యూలపై వివక్షను రూపుమాపేందుకు లింగ–తటస్థ మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం, విద్యావ్యవస్థలో అసమానతలను దూరం చేయడం, సమాజంలో కుల వివక్షను నిర్మూలించడం తదితర విషయాలపై విద్యార్థులు సలహాలిచ్చారు. కాంగ్రెస్ పార్టీతో సమావేశమని చెప్పి తమను తీసుకొచ్చారనీ, పార్టీ అధ్యక్షుడే రావడంతో తామంతా అవాక్కయ్యామని ఈ భేటీలో పాల్గొన్న ఓ విద్యార్థి చెప్పాడు. రాహుల్ సామాన్యులతో బాగా కలిసిపోయే వ్యక్తి అనీ, తాము చెప్పినవన్నీ ఆయన సావధానంగా వినడమేగాక, మేనిఫెస్టోలో చేర్చేందుకు కూడా ప్రయత్నిస్తామన్నారని విద్యార్థులు వెల్లడించారు. -
దివ్యాంగ ఓటర్లు 10,047
సాక్షి, మంచిర్యాల అగ్రికల్చర్: మంచిర్యాల జిల్లాలో దివ్యాంగ ఓటర్లు 10,047 మంది ఉన్నారని, పోలింగ్ కేంద్రాల్లో వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళికేరి తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఎన్నికల్లో దివ్యాంగుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు గాను టోల్‌ఫ్రీ నంబర్ హెల్ప్‌లైన్‌ను సోమవారం కలెక్టరేట్లో ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే 18004250504 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేయవచ్చన్నారు. దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు ప్రత్యేక వాహన సదుపాయం కల్పిస్తున్నామని, పోలింగ్ కేంద్రంలో వీల్చైర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ర్యాంపు, రెయిలింగ్ సౌకర్యంతో పాటు వీల్‌చైర్‌లోనే ఉండి ఓటు వేసేలా తగిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 10,047 మంది దివ్యాంగులను గుర్తించామన్నారు. సదరం సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్ పొందుతున్న వారి వివరాలు తీసుకొని వారు ఓటుహక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. అంధులకు బ్రెయిలీ లిపిలో.. అంధులకు బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ పేపర్‌పై బ్రెయిలీ లిపిలో అంకెలు ఉంటాయని, అవసరమై చోట వారి వెంట వచ్చిన సహాయకుల సహకారంతో ఓటుహక్కు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. పోలింగ్‌కు ఐదు రోజులు ముందు బూత్‌స్థాయి అధికారుల ద్వారా ఓటరు స్లిప్, బ్రెయిలీ స్లిప్‌లు, బ్రెయిలీ ఎపిక్ కార్డులను అందజేస్తామన్నారు. బ్రెయిలీ ఎపిక్ దివ్యాంగులకు, గర్భిణులు, బాలింతలకు క్యూ ఉండదని, పోలింగ్ కేంద్రాల్లో వారు కూర్చోడానికి అన్ని ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ఎన్ఎస్ఎస్ వాలంటరీర్లు, ఎన్సీసీ కెడెట్ల సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్‌ఖాన్, ఇన్చార్జి డీఆర్డీవో శంకర్, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. -
బ్రెయిలీలో స్వైన్‌ఫ్లూ అలర్ట్
అందర్నీ వణికిస్తున్న పేరు... స్వైన్ ఫ్లూ! దీనిపై అవగాహన లేక కొంతమంది... సమయానికి వైద్యం అందక మరికొంత మంది... ఏదైతేనేం... రోజూ ఎక్కడో అక్కడ దీనిబారినపడి ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. దీనిపై ప్రజలను చైతన్యం చేసేందుకు సాధ్యమైనన్ని మాధ్యమాలనూ ఉపయోగిస్తున్నారు. కళ్లున్నవారు సరే... మరి చూపులేని వారి పరిస్థితి ఏమిటి? దీని గురించి వారు లోతుగా తెలుసుకొనే మార్గం ఏది? ఈ ఆలోచనే వచ్చింది ‘నైటింగేల్స్ హోమ్ హెల్త్ కేర్’ సంస్థకు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టింది. స్వైన్‌ఫ్లూ సంబంధించిన సమాచారం, అవగాహన కల్పించేందుకు తొలిసారిగా బ్రెయిలీ లిపిని ఎంచుకుంది. ఈ లిపిలో కరపత్రాలు విడుదల చేసింది. బేగంపేట్ దేవనార్ అంధుల పాఠశాలలోని విద్యార్థులకు శుక్రవారం వీటిని పంచింది. ‘దేశవ్యాప్తంగా ఉన్న అంధులకు రోజు రోజుకూ విస్తరిస్తున్న స్వైన్‌ఫ్లూపై బ్రెయిలీలో అవగాహన కల్పించడం తక్షణ కర్తవ్యంగా భావించాం. బెంగళూరులో 1996 నుంచి సేవలందిస్తున్నాం. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో బ్రాంచ్ ప్రారంభించాం. ప్రస్తుతం మా సంస్థలో ఆరుగురు డాక్టర్లు, 30 మంది నర్సులు ఉన్నారు. ఏ వ్యాధితో బాధపడుతున్న రోగులైనా సరే... ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకోలేని పరిస్థితిలో ఉంటే వారికి సేవలందిస్తాం’ అన్నారు నైటింగేల్స్ తెలంగాణ, ఏపీ ప్రాంతీయాధికారి సుధాకర్. మంచి ప్రయత్నం... ‘ఈ మధ్య స్వైన్‌ఫ్లూ బారిన పడి ఎంతో మంది మరణించారు. దీని తీవ్రత ఇంకా తగ్గలేదు. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ఇలా బ్రెయిలీలో కరపత్రాలు అందించడం అభినందనీయం’ అన్నారు దేవనార్ స్కూల్ వ్యవస్థాపకుడు ఆలంపూర్సాయిబాబాగౌడ్. చాలా తెలుసుకున్నాం... బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ వేసుకోవాలని, ఎప్పుడూ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని... జ్వరం, వాంతులు, దగ్గు వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని కరపత్రంలో పేర్కొనడం వల్ల స్వైన్‌ఫ్లూపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోగలిగాం. ఈ సూచనలు పాటిస్తే ఈ వ్యాధి దరి చేరదని మాస్టార్లూ చెప్పారు. మా లిపిలో కరపత్రాలు విడుదల చేయడంవల్ల ఎన్నో విషయాలు మా అంతట మేము తెలుసుకోగలిగాం... అంటూ సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు శివారెడ్డి, గేయని, అశ్విని. నిఖితా నెల్లుట్ల ఫొటో:జి.రాజేష్