రాహుల్ చెప్పారు.. జైట్లీ పాటించారు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన సూచనకు కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో చోటు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా లోక్ సభలో వెల్లడించారు. దివ్యాంగులు(వికలాంగులు) ఉపయోగించే బ్రైలీ పేపర్ ను సుంకం నుంచి మినహాయింపు ఇచ్చామని జైట్లీ ప్రకటించారు. రాహుల్ గాంధీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. బ్రైలీ పేపర్ ను సుంకం నుంచి మినహాయించడంతో దివ్యాంగులకు ఊరట లభించనుంది.
వృద్ధులపైనా విత్త మంత్రి కరుణ చూపారు. డయాలసిస్ పరికరాలకు బేసిక్ కస్టమ్స్, ఎక్సైజ్ పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కొత్త పథకం ప్రారంభించనున్నట్టు జైట్లీ ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు అదనంగా రూ. 30 వేలు ప్రయోజనం అందజేస్తామని హామీయిచ్చారు. ఔషధాలను చౌకగా అందించేందుకు అదనంగా 3000 జనరిక్ దుకాణాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. నామమాత్రపు ప్రీమియంతో ప్రధాని పంటల బీమా అమలు చేస్తున్నట్టు కూడా జైట్లీ తెలిపారు.