మహిళ ప్రాణాలు నిలబెట్టిన బాలుడు
కొచ్చి: తాను చనిపోతూ ఓ మహిళ ప్రాణాలు నిలబెట్టాడో కేరళ టీనేజర్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన 15 ఏళ్ల విశాల్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతడి అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. అతడి గుండెను 27 ఏళ్ల మహిళకు దానం చేశారు. విశాల్ దేహం నుంచి వేరు చేసిన గుండెను తిరువనంతపురం నుంచి నావికాదళానికి చెందిన ఎయిర్ అంబులెన్స్ లో బుధవారం కొచ్చిలోని లీసీ ఆస్పత్రికి తరలించారు. అరుదైన గుండె జబ్బుతో బాధ పడుతున్న త్రిశూర్ కు చెందిన సంధ్య అనే మహిళకు వైద్యులు 5 గంటల పాటు ఆపరేషన్ చేసి దీన్ని అమర్చారు. ఆపరేషన్ విజయవంతం అయిందని వైద్యులు తెలిపారు.
తిరువనంతపురంలోని ముక్కోల ప్రాంతానికి చెందిన విశాల్ స్కూల్ కు వెళుతుండగా జూలై 16న ప్రమాదానికి గురైయ్యాడు. వేగంగా వెళుతున్న కారు ఢీకొనడంతో అతడి తలకు బలమైన గాయమైంది. అతడు బెయిన్ డెడ్ అయినట్టు తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్యులు ధ్రువీకరించారు. 'మృతసంజీవని' అధికారుల చొరవతో విశాల్ అవయవాలు దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. అతడి గుండెను కొచ్చికి తరలించగా, మూత్రపిండాలను ఇద్దరు రోగులకు దానం చేశారు.