సార్థక నామధేయుడు
తెరపై కామెడీ జరగనవసరంలేదు. జోకులు పేలనవసరం లేదు.. మనిషి కూడా కనిపించనవసరం లేదు. చందమామ లాంటి గుండ్రటి బట్టతల కనిపిస్తే చాలు. థియేటర్ మొత్తం నవ్వులే నవ్వులు. బ్రహ్మానందమా మజాకా. కేవలం ఆయన నవ్వుల వల్లే విజయాలు సాధించిన సినిమాలు కోకొల్లలు. రేలంగి వెంకట్రామయ్య, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్యల్లాగా దశాబ్దాల తరబడి సినీ హాస్యసామ్రాజ్యాన్ని ఏలిన ఘనత బ్రహ్మానందంది. ప్రస్తుతం ఆయన శకమే నడుస్తోంది.
రేలంగి, అల్లు రామలింగయ్య తర్వాత హాస్యనటుల్లో ‘పద్మశ్రీ’ అందుకున్నది బ్రహ్మానందమే. విజయవంతమైన సినిమాల్నే ఎవరూ గుర్తుంచుకోవడం లేదు. కానీ బ్రహ్మానందం పాత్రలు మాత్రం అందరికీ గుర్తుంటాయి. అరగుండు, ఖాన్దాదా, నెల్లూరు పెద్దారెడ్డి, శాస్త్రి, చారి, హల్వారాజ్, ప్రణవ్, బాబీ, మెక్డోనాల్డ్ మూర్తి, పద్మశ్రీ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. నవ్వుల జ్ఞాపకాలు ఎన్నో ఎన్నెన్నో..
‘బ్రహ్మానందం’ అని ఏ ముహూర్తాన తల్లితండ్రులు నామకరణం చేశారో కానీ.. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులకు బ్రహ్మానందాన్ని అందిస్తున్న సార్థకనామధేయుడు బ్రహ్మానందం. చిన్నవయసులోనే కష్టాలన్నీ అనుభవించేశారాయన. చెప్పులు లేకుండా బడికెళ్లిన రోజులు, అవి కొనమని నాన్నను అడిగితే, ఆయన కొట్టిన దెబ్బలు ఇంకా బ్రహ్మానందంకి గుర్తే. అందుకే విషాదం నుంచి కూడా కామెడీ పుడుతుందంటారాయన.
అన్ని రసాల్లోనూ కష్టతరమైనది హాస్యరసం. దాన్ని సమర్థవంతంగా పోషించిన వాడు ఏ రసాన్నయినా సునాయాసంగా పండించగలడు. అందుకే.. బ్రహ్మానందంకి ఎలాంటి రసమైనా.. తృణప్రాయం. ఆయన కామెడీ కింగ్ మాత్రమే కాదు. ట్రాజెడీ కింగ్ కూడా. ‘అమ్మ’, ‘బాబాయ్ హోటల్’, ‘ఆయనకి ఇద్దరు’ చిత్రాల్లో బ్రహ్మానందం పండించిన విషాదాన్ని తెలిగ్గా మరిచిపోలేం. రవిరాజా పినిశెట్టి డెరైక్ట్ చేసిన ‘ముత్యమంత ముద్దు’ సినిమాలో బ్రహ్మానందంలో ఓ భయంకరమైన విలన్ కనిపిస్తాడు. ముత్యాల సుబ్బయ్య ‘అన్న’లో అయితే... ఆయనలో ఓ విప్లవకారుడు కనిపిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలోని కోణాలు చాలా ఉన్నాయి.
జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని నవ్వులతోనే అధిగమించిన హ్యూమరిస్ట్ బ్రహ్మానందం. పెద్ద హీరోల సినిమా వేడుకలైనా సరే... బ్రహ్మానందం స్టేజ్ మీదకు రాగానే.. సదరు హీరోలతో సమానంగా జనాల్లో స్పందన. దీన్ని బట్టి ప్రేక్షకుల హృదయాల్లో ఆయనకున్న స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే ఆయనలో గొప్ప లక్షణం. మూలాల్ని మరిచిపోకుండా, సంప్రదాయానికి దూరం కాకుండా, సంస్కృతిని గౌరవిస్తూ, కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ చాలా ప్రశాంతమైన జీవనశైలిలో ముందుకు వెళ్తుంటారాయన. తెరపై కనపడే బ్రహ్మానందం వేరు. ఇంటా బయటా కనిపించే బ్రహ్మానందం వేరు. ఆయన మాటల్లో, వ్యక్తిత్వంలో ఓ గొప్ప ఫిలాసఫీ కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మానందంతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్. సినిమానే కాకుండా ఏ టాపిక్ గురించి అడిగినా పుంఖాను పుంఖాలుగా మాట్లాడగల జ్ఞానం ఆయనలో ఉంది. సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి చేరిన బ్రహ్మానందం జీవితం నేటి తరానికి నిజంగా స్ఫూర్తి దాయకమే.
సందర్భం బ్రహ్మానందం పుట్టినరోజు