మహానందికి చేరిన బ్రహ్మనందీశ్వరుడు
నంద్యాల: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే కల్యాణోత్సవంలో పాల్గొనడానికి మహానందీశ్వరస్వామి ఆహ్వానం మేరకు బ్రహ్మనందీశ్వరస్వామి మంగళవారం మహానంది క్షేత్రానికి చేరుకున్నారు. కల్యాణం, రథోత్సవం పూర్తయ్యాక ఆయన 27న నంద్యాల చేరుకుంటారు. కోటవీధిలో కొలువుదీరిన బ్రహ్మనందీశ్వరస్వామికి, కల్యాణానికి ఆహ్వానించడానికి విచ్చేసిన మహానందీశ్వరస్వామి విగ్రహాలకు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మనందీశ్వరస్వామి, మహానందీశ్వరస్వామి పల్లకీలో గ్రామోత్సవానికి బయలుదేరాయి. సుంకులమ్మ వీధిలోని పెద్దమ్మ ఆలయం వద్ద పల్లకీలను ఆపి, సంప్రదాయబద్ధంగా అమ్మవారికి సేవలు చేశారు. స్థానికులు మహానందీశ్వరస్వామి, బ్రహ్మనందీశ్వరస్వామి వార్లకు పూజలు చేశారు. అనంతరం పల్లకీలు పట్టణ వీధుల గుండా, సాయంత్రం మహానంది క్షేత్రానికి చేరాయి. 24న అర్ధరాత్రి జరిగే కామేశ్వరిదేవి, మహానందీశ్వరస్వామి వార్ల కల్యాణానికి పార్వతీదేవి, బ్రహ్మనందీశ్వరస్వామి పెళ్లిపెద్దలుగా వ్యవహరిస్తారు.
27న నంద్యాలకు రాక
మహానంది క్షేత్రంలో రథోత్సవం, తెప్పోత్సవం పూర్తయ్యాక బ్రహ్మనందీశ్వరస్వామి, మహానందీశ్వరస్వామి విగ్రహాలు నంద్యాలకు చేరుతాయి. తన కల్యాణానికి పెళ్లి పెద్దగా వ్యవహరించినందుకు బ్రహ్మనందీశ్వరస్వామికి, పార్వతీదేవికి మహానందీశ్వరస్వామి ధన్యవాదాలు తెలిపి, మహానంది చేరడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.