రాక్‌ఫోర్స్.. రాకీ!
న్యూఢిల్లీ: ఉగ్రదాడిలో సహచరుల ప్రాణాలు కాపాడి, తాను ప్రాణాలొదిలిన కానిస్టేబుల్ రాకీ(27) బీఎస్ఎఫ్లో ఇటీవలే చేరాడు. ఉగ్రవాదుల దాడిలో తనకు బుల్లెట్ గాయాలైనా తట్టుకుని.. తన తుపాకీలోని 40 బుల్లెట్లు ఖాళీ అయేంతవరకు వారిపై తూటాలవర్షం కురిపించాడు. వారికి జవాన్లతో నిండి ఉన్న బస్‌పై గ్రెనేడ్లు విసిరే సమయం, అవకాశం ఇవ్వకుండా దాడి కొనసాగించాడు. అదనపు బలగాలు వచ్చేవరకు వారిని నిలువరించాడు. టైస్ట్లపై సహచరులు పొజిషన్స్ తీసుకుని, దాడి చేసేందుకు వీలు కల్పించాడు.
రాకీ అంత వీరోచితంగా పోరాడి ఉండకపోతే.. మరి కొంతమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయేవారని బీఎస్ఎఫ్ డీజీ డీకే పాఠక్ స్వయంగా చెప్పడం రాకీ చూపిన సాహసానికి అద్దం పడుతోంది. తన యూనిట్లో రాకీని అంతా ‘రాక్‌ఫోర్స్’గా పేర్కొనేవారని, పేరుకు తగ్గట్లే వీరోచితంగా, హీరోలా పోరాడాడని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు కొనియాడారు.
హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్ జిల్లా రామ్ గర్ మజ్రా గ్రామానికి చెందిన రాకీ మరణంపై అతని తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. గత రెండు వారాల క్రితమే తమ కుటుంబంతో కలిసి గడిపిన కొడుకు జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. కొడుకు ఆకస్మికంగా మృతిచెందడం.. తిరిగి మమ్ముల్ని కలవకుండా లోకాన్ని విడిచి వెళ్లిపోవడం విధి ఆడిన వింత నాటకమన్నాడు. దేశ సేవలో కొడుకు ప్రాణాలు కోల్పోవడం గ్రామానికే కాకుండా.. యావత్ భారతావనికే గర్వంగా నిలిచిపోయిందని బాధాతప్త హృదయంతో తండ్రి తెలిపాడు.