యోగాతో మతిమరపు మాయం
బ్రెసిల్లా: మానవులకు వృద్ధాప్యం వచ్చిందంటే జ్ఞాపకశక్తి మందగించడం అంటే, మతిమరపు పెరిగిపోవడం, ఏ పని మీదనైనా ఏకాక్రగత తగ్గిపోవడం మనకందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ రెండు విధులను ప్రధానంగా మెదడులో ఎడమ వైపు నుండే కార్టెక్స్ నిర్వహిస్తోంది. మందంగా ఉండే ఈ కార్టెక్స్ పలుచపడుతున్నాకొద్దీ వృద్ధుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు తగ్గిపోతాయి. ఈ పరిస్థితిని మెరగుపర్చుకోవాలంటే మందులు వాడడం తప్పనిసరి. అయితే ఇక ముందు ఆ అవసరమే లేదు. ఈ విషయంలో మందులకన్నా యోగా బాగా పనిచేస్తోందని బ్రెజిల్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ ప్రయోగం నిర్వహించడం కోసం వారు గత ఎనిమిదేళ్లుగా వారానికి కనీసం రెండు సార్లు చొప్పున యోగా చేస్తున్న 60 ఏళ్లు దాటిన 21 మంది వృద్ధ మహిళలను ఎంపిక చేశారు. ఏకాగ్రత దెబ్బతినని, మతిమరపులేని అంతే వయస్సుగల ఆరోగ్యవంతమైన మహిళలను ఎంపిక చేశారు. ముందుగా రెండు జట్ల కార్టెక్స్ మందం స్థాయిని ఎమ్మారై ద్వారా రికార్డు చేశారు. సాధారణ ఆరోగ్యవంతమైన వృద్ధ మహిళ్లల్లోకెల్లా ఎనిమిదేళ్లుగా యోగా చేస్తున్న మహిళల్లో కార్టెక్స్ మందం స్థాయి ఎక్కువగా ఉంది. అదే గ్రూపులో ఎనిమిదికన్నా ఎక్కువ ఏళ్లుగా యోగా చేస్తున్న వారి కార్టెక్స్ స్థాయిని పోల్చి చూశారు. యోగా చేయనివారికన్నా చేస్తున్న వారిలో, కొన్నేళ్లుగా చేస్తున్నవారికన్నా ఎక్కువ ఏళ్లుగా చేస్తున్న వారిలో కార్టెక్స్ పొరల మందం ఎక్కువున్నట్లు తేలింది. తద్వారా వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత ఎక్కువగా ఉంది.
యోగా అలవాటులేని గ్రూపు మహిళల్లో కార్టెక్స్ పొరల మందం తక్కువగా ఉన్నవారిని ఎంపిక చేసి వారితో స్పల్పకాలిక యోగాను చేయించడం వల్ల కూడా సానుకూల ఫలితం వచ్చిందని పరిశోధకులు తెలిపారు. తాము ఈ అధ్యయనం వృద్ధ మహిళలపైనే నిర్వహించామని, వివిధ ఏజ్ గ్రూపుల మధ్య, మగవారిపై కూడా ప్రయోగాలు నిర్వహించి వ్యత్యాసాలను పరిశీలించాల్సి ఉందని వారన్నారు. వారు తమ అధ్యయన వివరాలను ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్’ మాగజైన్లో ప్రచురించారు.