జెట్‌లైట్ విమానానికి తప్పిన ముప్పు
శంషాబాద్: కోల్‌కతా నుంచి బెంగళూరు వెళుతున్న జెట్‌లైట్ విమానానికి ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శనివారం సాయంత్రం 134 మంది ప్రయాణికులతో కోల్‌కతా నుంచి బయలుదేరిన ఎస్24364 విమానం హైడ్రాలిక్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్.. వెంటనే శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారమిచ్చారు.
ఏటీసీ అనుమతితో రాత్రి 8.30 గంటలకు శంషాబాద్ విమానాశ్ర యంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ల్యాండింగ్ సమయంలో విమానం టైరు పేలడంతో అప్రమత్తమైన ఏటీసీ అధికారులు 20 నిమిషాలపాటు రన్‌వేను బ్లాక్ చేశారు. రాత్రి 9.30 గంటలకు రన్‌వేను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు విమానాశ్రయవర్గాలు వెల్లడించాయి.