మాటలను ట్వీట్‌గా మార్చే ల్యాంప్
లండన్: మీ సన్నిహితులతో కలసి డిన్నర్ కోసం ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లారా? అయితే మీ టేబుల్‌కు పక్కనే ఉన్న ల్యాంప్‌ను ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే.. ఆ ల్యాంప్ మీ సంభాషణలను రహస్యంగా విని.. మీ మాటలను యథాతథంగా ట్వీట్ చేసే అవకాశం ఉంది. ల్యాంప్ ఏంటి.. సంభాషణలను ట్వీట్ చేయడం ఏమిటీ? అని ఆశ్చర్యపోకండి.. అమెరికాకు చెందిన పరిశోధకులు కైల్ మెక్‌డోనాల్డ్, బ్రియాన్ హౌస్.. సంభాషణలను వినీ వాటిని ట్వీట్ చేసే సామర్థ్యం ఉన్న ల్యాంప్‌ను అభివృద్ధిపరిచారు.
ఇది తనకు సమీపంలోని శబ్దాలను సంగ్రహించి.. వాటిని తనకు దగ్గరలోని వై-ఫై ఇంటర్నెట్ ద్వారా ఓ ట్విటర్ అకౌంట్‌కు ట్వీట్ల రూపంలో అప్లోడ్ చేస్తుంది. ఒక ప్లాస్టిక్ కుండీలో ఉండే ఈ ల్యాంప్ ధర రూ. 6 వేలు. ఈ ల్యాంప్‌లో మినీ కంప్యూటర్, మైక్రోఫోన్, ఎల్ఈడీ ఉంటాయి. వీటి సహాయంతోనే ఇది సంభాషణలను ట్వీట్ చేయగలుగుతుంది.