brihan mumbai municipal corporation
-
మేయర్ అభ్యర్థిగా సోనూసూద్.. క్లారిటీ ఇచ్చిన ‘రియల్ హీరో’!
రియల్ హీరో సోనూ సూద్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2022 లో జరిగే బృహత్ ముంబై ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా సోనూ సూద్ దిగబోతున్నారని, ఈ విషయం లో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి రేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కొడుకు, నటుడు రితేష్ దేశ్‌ముఖ్, మోడల్, ఫిట్నెస్ పర్సనాల్టీ మిలింద్ సోమన్ తో పాటు సోనూ సూద్ ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ ముగ్గురిలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించబోతున్నట్లు, దాని కోసం చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ ఎంట్రీపై సోనూ సూద్ స్పందించాడు. ‘ఇది నిజం కాదు. నేను సాధారణ వ్యక్తిగా చాలా సంతోషంగా ఉన్నాను’అని ట్వీట్ చేశాడు. అయితే అత్యధిక మంది నెటిజన్స్ మాత్రం సోనూ భాయ్ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. మరికొంత మంది మాత్రం ఈ బురదలోకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?) -
సగానికి పైగా పిల్లల్లో కోవిడ్ యాంటీబాడీలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదాపు 51.8 శాతం మంది పిల్లల్లో(1–18 సంవత్సరాల వయసు) కోవిడ్‌వైరస్‌కు వ్యతిరేక యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు సీరో సర్వేలో తేలిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపింది. ధర్డ్ వేవ్ వస్తుందన్న భయాల నేపథ్యంలో బీఎంసీ ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో భాగంగా ఏప్రిల్– జూన్ కాలంలో 2,176 బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించారని తెలిపింది. యాంటీబాడీలున్న పిల్లల సంఖ్య గత సర్వేతో పోలిస్తే పెరిగినట్లు బీఎంసీ తెలిపింది. బీవైఎల్ నాయర్ హాస్పిటల్, కేఎండీఎల్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. సీరో సర్వేలో ప్రజల బ్లడ్ సీరమ్‌ను పరీక్షించి ట్రెండ్‌ను అధ్యయనం చేస్తారు. కరోనా ఆరంభం నుంచి ఇది మూడో సీరో సర్వే అని బీఎంసీ వెల్లడించింది. 10–14 సంవత్సరాల వయసు పిల్లల్లో సీరో పాజిటివిటీ అత్యధికంగా 53.43 శాతం ఉందని, 1–4 సంవత్సరాల పిల్లల్లో 51.04 శాతం, 5–9 సంవత్సరాల పిల్లల్లో 47.33 శాతం, 15–18 సంవత్సరాల పిల్లల్లో 51.39 శాతం సీరో పాజిటివిటీ ఉందని తెలిపింది. -
గుడ్‌న్యూస్: 50 శాతం మంది చిన్నారుల్లో యాంటీ బాడీలు!
ముంబై: మహారాష్ట్రలో డెల్లా ప్లస్ వేరియంట్ కేసుల పెరుగుదల, థర్డ్‌వేవ్‌తో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందన్న భయాల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఊరట కలిగించే వార్త చెప్పింది. దేశ ఆర్థిక రాజధానిలో నిర్వహించిన సేరో సర్వేలో 51 శాతానికిపైగా బాలబాలికల్లో కోవిడ్ యాంటీ బాడీలు ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 వరకు సుమారు 2176 రక్త నమూనాలు పరీక్షించగా.. ఒకటి నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లల్లో 51.04 శాతం, 5-9 వయస్కుల్లో 47.55 శాతం, 10 నుంచి 14 ఏళ్ల చిన్నారుల్లో అత్యధికంగా 53.43 శాతం మంది, 15-18 ఏజ్ గ్రూప్‌లో 51.39 శాతం మందిలో వైరస్ ప్రతిరక్షకాలు కనుగొన్నట్లు తెలిపింది. మొత్తంగా 1- 18 ఏళ్ల వయసు గల పిల్లల్లో సెరో పాజిటివిటీ రేటు 51.18 శాతం ఉన్నట్లు బీఎంసీ నివేదిక పేర్కొంది. ఇక ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే... సేరో పాజిటివిటీ రేటులో భారీ పెరుగుదల నమోదైనట్లు వెల్లడించింది. ‘‘18 కంటే తక్కువ వయస్సున్న పిల్లల్లో సెరో పాజిటివిటీ 39.4 శాతం ఉన్నట్లు గత సర్వేలో తేలింది. సెకండ్ వేవ్‌లో పిల్లలు ఎక్కువగా కోవిడ్ బారిన పడ్డారు. వారిలో ప్రతిరక్షకాలు పెరిగాయి’’ అని బీఎంసీ పేర్కొంది. కాగా డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయంటూ భయాలు నెలకొన్న విషయ తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా.. తొలి, రెండో దశలో పిల్లలకు కరోనా సోకినా పెద్దగా ప్రమాదం జరుగలేదని, చిన్నపాటి ఇన్ఫెక్షన్ మాత్రమే సోకిందని, కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం తప్పుతుందని పేర్కొన్నారు. ఇక అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ సైతం.. ‘‘థర్డ్‌వేవ్‌లో పిల్లలు తీవ్ర లక్షణాలతో బాధపడతారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. 90 శాతం మంది స్వల్ప లక్షణాలతో బయటపడతారు’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. చదవండి: థర్డ్‌వేవ్ హెచ్చరికలు: జూలై 15 వరకు లాక్డౌన్ పొడిగింపు Delta Variant: మళ్లీ కఠిన ఆంక్షలు పిల్లలపై... థర్డ్‌వేవ్ ప్రభావానికి ఆధారాల్లేవ్! -
నన్నే ముట్టుకుంటావా.. నీకెంత ధైర్యం అంటూ
ముంబై: మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్కు పెట్టుకొమ్మని సూచించిన పారిశుధ్య కార్మికురాలిపై ఓ మహిళ అనుచితంగా ప్రవర్తించింది. ‘‘నన్నే ఆపుతావా? నీకెంత ధైర్యం ఉంటే నన్ము ముట్టుకుంటావు’’అంటూ విచక్షణా రహితంగా ఆమెను కొట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలు... ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ మాస్కు ధరించలేదు. ఈ విషయాన్ని గమనించిన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) కార్మికురాలు ఆటోను ఆపింది. మాస్కు ధరించాల్సిందిగా ఆమెకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తురాలైన సదరు మహిళ, కార్మికురాలిపై చేయిచేసుకోగా ఆమె ప్రతిఘటించింది. అంతేగాక ఆమెను వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో మరింతగా రెచ్చిపోయిన సదరు మహిళ.. ఆటో దిగి వచ్చి ఇష్టం వచ్చినట్లు ఆమెను కొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఎందుకంత కోపం. మంచి చెబితే కూడా ఇలా ఎవరైనా కొడతారా’’ అంటూ సదరు మహిళను విమర్శిస్తున్నారు. కాగా రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం నాటికి అక్కడ కొత్తగా 25,833 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టింది. లాక్డౌన్ విధించే యోచనలో ఉంది. ఇక ముంబైలో మాస్కు ధరించకుండా బయటకు వస్తే రూ. 200 జరిమానా విధిస్తున్నారు. చదవండి: కొవిడ్ నివారణకు లాక్డౌన్ ఒక్కటే మార్గం: ఉద్దవ్ -
మాస్క్ ఎఫెక్ట్: రూ.30 కోట్ల ఆదాయం
ముంబై: తగ్గిందనుకున్న కరోనా మరోసారి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రంగంలోకి దిగిన ప్రభుత్వం మరోసారి కఠినమైన ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించని వారికి జరిమానా విధిస్తోంది. ఈ క్రమంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిన్న ఒక్క రోజులోనే ముంబైలో జరిమానాల రూపంలో 29లక్షల రూపాయలు వసూలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని 14,600 మంది నుంచి ఈ మొత్తం వసూలు చేసినట్లు బీఎంసీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మొత్తం మీద 22,976 మంది నుంచి 45.95 లక్షల రూపాయల జరిమానా వసూలు చేసినట్లు బీఎంసీ ప్రకటించింది. ముంబైలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి బీఎంసీ కమిషనర్ ఐఎస్ చాహల్ కఠినమైన చర్యలు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ మొత్తం వసూలు చేయడం గమనార్హం. బీఎంసీ తాజా మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి. ఈ నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి 200 రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఇక 2020 ఏడాది మొత్తం మీద మాస్క్ ధరించని వారి నుంచి ఏకంగా 30,50,00,000 రూపాయలు వసూలు చేసినట్లు బీఎంసీ తెలిపింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ముంబై పోలీస్,సెంట్రల్, వెస్ట్రన్ రైల్వే వంటి వివిధ ఏజెన్సీలు మాస్క్ ధరించని వారి నుంచి వసూలు చేసిన జరిమానాల మొత్తానికి సంబంధించిన డాటాను బీఎంసీ విడుదల చేయడం ప్రారంభించింది. సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌న్‌ను నడుపుతున్న సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేలు ఇప్పటివరకు రూ. 91,800 రూపాయలు జరిమానాగా వసూలు చేశాయి. బీఎంసీ గణాంకాల ప్రకారం సంస్థ ప్రతి రోజు మాస్క్ ధరించని సుమారు 13,000 మంది నుంచి రోజుకు సగటున 25 లక్షల రూపాయలకు పైగా వసూలు చేస్తోంది. జరిమానా కట్టలేని వారితో వీధులు ఊడ్చడం వంటి పనులు చేపిస్తోంది.పెరుగుతున్న కోవిడ్-19 కేసులను దృష్టిలో ఉంచుకుని గత వారం, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తాజా ఆంక్షలను ప్రకటించారు. లాక్డౌన్ విధించాలా వద్దా అని నిర్ణయించడానికి వచ్చే ఎనిమిది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తుందని ఠాక్రే చెప్పారు. చదవండి: ఇలానే ఉంటే మరో 15 రోజుల్లో లాక్డౌన్: సీఎం పొంచి ఉన్న ‘మహా’ ముప్పు! -
సోనూసూద్‌పై బీఎంసీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: ‘రియల్ హీరో’గా నీరాజనాలు అందుకుంటున్న నటుడు సోనూసూద్‌పై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) సంచలన వ్యాఖ్యలు చేసింది. నేరాలకు పాల్పడటం ఆయనకు ఓ అలవాటుగా మారిందని పేర్కొంది. ఎన్నిసార్లు చెప్పినా సోనూసూద్ వైఖరి మార్చుకోవడం లేదని, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించింది. నివాససముదాయాన్ని హోటల్‌గా మార్చి చట్టవిరుద్ధ పద్ధతిలో కమర్షియల్ లాభాలు పొందాలని భావిస్తున్నారని తెలిపింది. ఇప్పటికే కొంతమేర నిర్మాణాలు కూల్చివేసినప్పటికీ, లైసెన్స్ డిపార్టుమెంట్ అనుమతులు తీసుకోకుండానే మళ్లీ పునర్నిర్మాణం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు బాంబే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో బీఎంసీ సోనూసూద్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నేరాలకు అలవాటు పడ్డ వ్యక్తి’’గా ఆయనను అభివర్ణించింది. కాగా ముంబైలోని జుహు ప్రాంతంలో సోనూసూద్‌కు శక్తి సాగర్ అనే పేరుతో ఆరంతస్తుల భవనం ఉంది. అనుమతులు తీసుకోకుండానే ఈ నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చారంటూ బీఎంసీ అధికారులు.. నోటీసులు పంపించారు. అయితే సోనూ ఇందుకు స్పందించలేదని పేర్కొంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.(చదవండి: సోనూసూద్‌పై ఫిర్యాదు చేసిన ముంబై అధికారులు) అయితే తాను అన్ని అనుమతులు తీసుకున్నానన్న సోనూ.. బీఎంసీ అభ్యంతరాలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కానీ దిగువ కోర్టు ఆయన అభ్యర్థనను నిరాకరించడంతో హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇందుకు సమాధానం ఇవ్వాలంటూ బాంబే హైకోర్టు, బీఎంసీని ఆదేశించగా.. అఫిడవిట్లో ఈ మేరకు ఆరోపణలు చేసింది. కాగా లాక్డౌన్ కాలంలో ఎంతో మంది అభాగ్యులను ఆదుకుని రియల్ హీరోగా నిలిచారు సోనూసూద్. కరోనా పేషెంట్ల కోసం తన హోటల్లో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు పీపీఈ కిట్లు విరాళంగా ఇవ్వడం, వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. -
ఫైర్ స్టేషన్లు కావాలి
సాక్షి, ముంబై: నగరంలో విపరీతంగా పెరిగిపోయిన జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనంగా 67 అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)కి నగర అగ్నిమాపక శాఖ ప్రతిపాదించింది. దీంతో అత్యవసర సమయంలో వెంటనే ఘటనాస్థలికి చేరుకుని భారీ నష్టం జరగకుండా నివారించవచ్చని తెలిపింది. ప్రస్తుతం నగరంలో కేవలం 33 అగ్నిమాపక కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న నగరం విస్తరిస్తోంది. దీనికి తోడు వలసలు జోరందుకున్నాయి. దీంతో నగరం, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాలలో జనాభా కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 33 అగ్నిమాపక కేంద్రాలు ఎటూ సరిపోవడం లేదు. ప్రమాదం జరిగిన చోటికి పగలు (ట్రాఫిక్ జాం లేని పక్షంలో) 15 నిమిషాల్లో, రాత్రులు ఐదు నుంచి పది నిమిషాల్లో చేరుకుంటాయి. అదే ట్రాఫిక్ జాంలో ఘటనాస్థలికి చేరుకోవాలంటే కనీసం అర గంటకుపైనే సమయం పడుతుంది. అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతోంది. అగ్నిమాపక కేంద్రాలు దూరంగా ఉండడంవల్ల ఘటనాస్థలికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. పైగా నగరంలో ఇరుకు రోడ్లు, సందులు ఎక్కువ శాతం ఉన్నాయి. ప్రమాదం జరిగిన చోటికి ఫైరింజన్లు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మొదటి విడతలో 26 కేంద్రాలను నిర్మించాలి. ఆ తర్వాత మిగతా కేంద్రాలను ఏర్పాటుచేస్తే సకాలంలో ఘటన స్థలానికి చేరుకునేందుకు వీలుంటుందని ముంబై అగ్నిమాపక శాఖ బీఎంసీకి సమర్పించిన ప్రతిపాదనలో పేర్కొంది. నగరంలో ఏడు నుంచి 10 కి.మీ. దూరంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఉంది. ఒకవైపు నగరంలో పెరిగిపోయిన ఆకాశహార్శ్యాలు, టవర్లు వారికి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. మరోవైపు విదేశాల మాదిరిగా భవనాలకు అద్దాలు అమర్చడంవల్ల మంటల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో మంటలను అదుపుచేయడం వారికి పెను సవాలుగా మారనుంది. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిమాపక పరికరాలు స్వయంగా యాజమాన్యాలే అమర్చుకోవాలని బీఎంసీ ఆంక్షలు విధించింది. ఈ ప్రకారం ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లో వాటిని అందుబాటులో ఉంచుతున్నారు. చిన్నాచితక ప్రమాదాలైతే వారే మంటలను ఆర్పివేసుకుంటారు. అయితే భారీ ప్రమాదాలైతే అగ్నిమాపక వాహనాలు రావాల్సిందే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాం కనబడుతోంది. ఇలాంటి సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగితే ట్రాఫిక్ జామ్‌లో దారి వెతుక్కుంటూ ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకునే సరికి నష్టం జరిగిపోతుంది. దీన్ని నివారించేందుకే ప్రతి రెండు, మూడు కి.మీ. దూరంలో ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను నగర అగ్నిమాపక శాఖ తెరమీదకు తీసుకొచ్చింది. 6,630 పక్షులను కాపాడిన సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది గత సంవత్సర కాలంలో ఏకంగా 6,630 పక్షులను కాపాడారు. నగరంలో 2,230 పక్షులు, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 4,400 పక్షులను రక్షించగలిగారు. ఒక్కోసారి వాటిని కాపాడే ప్రయత్నంలో తమ ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నారు. మాండ్వీ అగ్నిమాపక కేంద్రానికి చెందిన ఉమేష్ పర్వతే పావురాన్ని కాపాడబోయి చనిపోయాడు. ‘సంక్రాంతి పండుగ సమయంలో అత్యధిక శాతం పక్షులు పతంగుల దారం (మాంజ)లో చిక్కుకుని గాయపడతాయి. ఆ తర్వాత వేసవి కాలంలో తాగు నీరు లభించకపోవడంతో నేల రాలుతుంటాయి. కొన్ని చెట్ల కొమ్మల్లో, కేబుల్ వైర్లలో, తీగల్లో చిక్కుకుని విలవిలలాడుతుంటాయి. ఎవరైన ఫోన్‌తో సమాచారం అందిస్తే అక్కడికి చేరుకొని వాటిని రక్షిస్తామ’ని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ‘రికార్డులు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి’ ముంబై: గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల రికార్డులు 2012లో జరిగిన మంత్రాలయ ఆగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. సామాజిక కార్యకర్త అనిల్ గల్గాలి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంత మంది ఎంపీలు కోడ్లు ఉల్లంఘించారనే వివరాలు కావాలని ఈ ఏడాది ఏప్రిల్ ఏడున ఆర్టీఐ ద్వారా ఆయన సమాచారాన్ని కోరిన సంగతి తెలిసిందే.