బీఎంసీ ఎన్నికలపై బీజేపీ దృష్టి 227 స్థానాల్లో 150కి పైగా గెలవాలని లక్ష్యం
అసెంబ్లీ ఎన్నికల విజయ పరంపరను కొనసాగించాలని నిర్ణయం
దాదర్: ఇటీవల జరిగిన అసెంబీ ఎన్నికల్లో బీజేపీకి ఊహించని విధంగా ఎక్కువ స్థానాలు రావడంతో త్వరలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించింది. అందుకు దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ), ఏక్‌నాథ్ శిందే (శివసేన), అజిత్ పవార్ (ఎన్సీపీ) నేతృత్వంలోని మహాయుతి కూటమి మొత్తం 227 స్థానాల్లో 150కి పైగా గెలుచుకోవాలనే ఉద్దేశంతో ‘మిషన్–150’ పేరుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 25 ఏళ్లుగా బీఎంసీలో ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే–శివసేనను ఈసారి ఎలాగైనా గద్దె దింపాలని మహాయుతి కూటమి లక్ష్యంగా పెట్టుకుంది.
నెల, రెండు నెలల్లో ఎన్నికలు!
బీఎంసీ ఎన్నికలు 2025, జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మహాయుతి కూటమి వర్గాలు కొంత దూకుడుగా ప్రవర్తిస్తున్నాయి. వాస్తవంగా బీఎంసీ కార్యనిర్వాహక పాలన గడువు 2022 మార్చిలో ముగిసింది. ఫలితంగా ఇదివరకే ఎన్నికలు జరగాలి. కానీ అనేక సార్లు వివిధ కారణాలవల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. దీంతో 2022 మార్చి నుంచి ఇప్పటి వరకు బీఎంసీలో కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లు లేకపోవడంతో అనేక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. ఆనేక శాఖల్లో కార్యకలాపాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, ఇతర పనులు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో బీఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? అని కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల పర్వం ఇటీవల పూర్తికావడంతో ఇక అన్ని పార్టీల దృష్టి బీఎంసీ ఎన్నికలపై పడింది. భారీ మెజార్టీ సాధించిన మహాయుతి కూటమి ఇంతవరకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనేలేదు. అప్పుడే బీఎంసీ ఎన్నికల్లో భారీ సీట్లు రాబట్టుకోవాలని మిషన్–150 పేరుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 2017లో 227 స్థానాలకు జరిగిన బీఎంసీ ఎన్నికల్లో అప్పట్లో శివసేన–బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ సమయంలో శివసేన–84, బీజేపీ–82, కాంగ్రెస్–31, ఎన్సీపీ–9 మంది కార్పొరేటర్లు గెలిచారు. కానీ ఇప్పుడు జరిగే బీఎంసీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీ రెండుగా చీలిపోయి నాలుగు పార్టీలుగా అవతరించాయి. శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ శిందే వర్గంగా, ఎన్సీపీ శరద్ పవార్, అజిత్ పవార్ వర్గంగా ఏర్పడ్డాయి. దీంతో బీఎంసీ ఎన్నికల్లో ఎవరి వర్గం కార్పొరేటర్లు ఆ వర్గం నుంచి పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండున్నరేళ్ల కిందట శిందే శివసేనతో తెగతెంపులు చేసుకుని బయటపడ్డారు. ఆ సమయంలో శిందే వెంట పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు కూడా బయట పడ్డారు. దీంతో ఈ సారి జరిగే బీఎంసీ ఎన్నికల్లో శివసేన కొంత బలహీన పడినట్లు తెలుస్తోంది. యూబీటీకి మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ)లు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడిపోయాయి. దీని ప్రభావం బీఎంసీ ఎన్నికల్లో కచి్చతంగా చూపే ప్రమాదం లేకపోలేదు. దీంతో బీజేపీ చేపట్టిన మిషన్–150 కచ్చితంగా సఫలీకృతమవుతుందని తెలుస్తోంది.
మరోపక్క మహా వికాస్ అఘాడీ కూడా ఏదో ఒక కొత్త వ్యూహం లేదా కొత్త పంథాతో ఎన్నికలకు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయనుంది. దీంతో ఈ ఎన్నికలు కూడా అసెంబ్లీ లాగే మహాయుతి, మహా వికాస్ అఘాడీ మధ్య హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు మాజీ, సిట్టింగ్ కార్పొరేటర్లతో మంతనాలు జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఎలాంటి ప్రచార అస్త్రాలతో ప్రజల ముందుకు వెళ్లాలని వ్యూహం రచిస్తున్నాయి. బీఎంసీ ఎన్నికల్లో కులాలవారీగా, మహిళలకు ఇలా వేర్వేరుగా రిజర్వేషన్లు ఉంటాయి. దీంతో ఏ వార్డు ఏ కులానికి, మహిళకు లేదా పురుషుడికి రిజర్వేషన్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆ తరువాతే గెలిచే సత్తా ఉన్న అర్హులైన అభ్యర్థులను బరిలోకి దింపాల్సి ఉంటుంది. దీంతో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొగెస్ రిపోర్టు పరిశీలించాలి.
Comments
Please login to add a commentAdd a comment