షాకింగ్.. బ్రిటన్లో 23వేలమంది ఉగ్రవాదులు!
లండన్: బ్రిటన్లో వేలమంది అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు అక్కడి నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేదో ఒక వెయ్యో.. రెండువేలమందో కాదు. ఏకంగా 23వేల మంది అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల మాంచెస్టర్ దాడుల తర్వాత ఉలిక్కిపడిన బ్రిటన్.. ఉగ్రవాదం తమకు సవాలు మారిందని భావించి సమీక్షలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిఘా అధికారులను, ఈ తరహా కేసులను విచారించిన అధికారుల నుంచి దేశ అత్యున్నత నిఘా విభాగం ఉగ్రవాదులు జాడలు తెలుసుకునే ప్రయత్నం చేయగా దాదాపు 23వేలమంది వివిధ రూపాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చారు.
ఇటీవల పాప్ సింగర్ అరియానా గ్రాండే మాంచెస్టర్లో సంగీత విభావరి నిర్వహిస్తుండగా సల్మాన్ అబేదీ అనే 22 ఏళ్ల ఉగ్రవాది అమర్చిన బాంబులు పేలి 22 మంది మరణించడం తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన వారి సంఖ్య 59 నుంచి 119కి పెరిగింది. ఈ ఘటనకు సంబంధించి దక్షిణ మాంచెస్టర్లో ముగ్గురినీ, అక్కడికి దగ్గర్లోనే మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. లిబియన్ సంతతికి చెందిన సల్మాన్ అబేది ముందు నుంచే నిఘా పరిశీలనలో ముందు వరుసలో ఉన్నాడు. మాతృదేశం లిబియా అయ్యి ఉండి బ్రిటన్లో జన్మించిన అతడు ఇటీవల లిబియా, సిరియా పలుమార్లు వెళ్లొచ్చాడు. ఆ తర్వాతే అతడు ఉగ్రవాదిగా మారి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిఘా వర్గాలు అంచనా వేస్తున్న 23వేలమంది అనుమానిత ఉగ్రవాదుల్లో మూడు వేల మంది మాత్రం వివిధ విచారణల్లో చాలా ప్రమాదకరమైన వ్యక్తులుగా తేలడంతోపాటు ఇప్పటి వరకు పోలీసులు నిర్వహించిన 500 అపరేషన్లలో దొరికిన వారిలో ఉన్నారట. మిగి 20వేల మంది మాత్రం గతంలో విచారించి వివిధ కేటగిరీల్లో చేర్చిన వ్యక్తులుగా ఉన్నట్లు వెల్లడించారు.