British Airways flight
-
దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పైలట్..
ఎడిన్బర్గ్ : బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఓ పైలట్ ప్రయాణికులకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చాడు. జర్మనీలో ల్యాండ్ కావాల్సిన ఫ్లైట్‌ను స్కాట్లాండ్లో ల్యాండ్ చేశాడు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ‘బీఏ 146’ విమానం 100 మంది ప్రయాణికులతో లండన్ నుంచి జర్మనీలోని డ్యూసెల్డార్ఫ్కు బయలుదేరింది. కానీ, అది దారితప్పి 500 మైళ్లు అదనంగా ప్రయాణించింది. నేరుగా తూర్పు దిశగా వెళ్లకుండా ఉత్తరం వైపుకు దూసుకెళ్లింది. చివరకు స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. ఫ్లైట్‌లో ఉన్నవారంతా అది డ్యూసెల్డార్ఫ్ అనే అనుకున్నారు. అయితే,‘వెల్కమ్ టు ఎడిన్బర్గ్’ అని విమానం కాక్‌పిట్ నుంచి అనౌన్స్మెంట్ వినగానే ఆశ్చర్యంలో మునిగారు. పైలట్ జోక్ చేస్తున్నాడేమోనని భావించారు. అది ఎడిన్బర్గ్ అని తెలిసి నోరెళ్లబెట్టారు. డ్యూసెల్డార్ఫ్కు తరచుగా ప్రయాణించే సోఫీ కూక్ అనే మహిళ బీబీసీతో మట్లాడుతూ.. ఎడిన్‌బర్గ్‌కు చేరుకున్నామని పైలట్ చెప్పగానే ఆశ్చర్యపోయాను. అతను చెప్పిందే నిజమేనని గ్రహించాను. చేసిన ఘటనకార్యం చాలదా అన్నట్టు విమాన సిబ్బంది.. ‘మీరంతా డ్యూసెల్డార్ఫ్కు వెళ్లాలనుకుంటున్నారు కదా’ అని అడిగారని ఆమె మండిపడ్డారు. ‘అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. ఫ్లైట్ మ్యాప్ ప్రకారమే విమానం ప్రయాణం చేసింది. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు’ అని పైలట్ చెప్పుకొచ్చాడు. కాగా, రెండున్నర గంటల అనంతరం విమానం మళ్లీ జర్మనీ బయలుదేరింది. కాగా, అనుకోకుండా ఇలా కలిసొచ్చిందని.. ఇదొక బోనస్ ట్రిప్ అని మరి కొందరు వ్యాఖ్యానించారు. విమానం రూట్ ప్లాన్ ఇదిలాఉండగా.. ప్రయాణికుల విలువైన సమయాన్ని రాంగ్ ల్యాండింగ్ ద్వారా వృథా చేసినందుకు బ్రిటీష్ ఎయిర్వేస్ క్షమాపణలు కోరింది. ఫ్లైట్‌మ్యాప్‌లో డబ్ల్యూడీఎల్ సంస్థ చేసిన తప్పిదం వల్లనే ఈ ఘటన జరిగిందని బ్రిటీష్ ఎయిర్వేస్ ఆరోపించింది. నిబంధనల ప్రకారం ఒక్కో ప్రయాణికుడికి రూ.20 వేల నష్టపరిహారం చెల్లించింది. ఘటనపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఫ్లైట్‌ప్లాన్‌లు తారుమారైన వ్యవహారాన్ని కనుగొంటామని తెలిపింది. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఈ విమానాన్ని జర్మనీ కంపెనీ డబ్ల్యూడీఎల్ ఏవీయేషన్ సంస్థ లీజ్ ప్రాతిపదికన నిర్వహిస్తోంది. -
బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం నిలిపివేత
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన బ్రిటీ ష్ఎయిర్లైన్స్ విమానంను నిలిపివేశారు. సోమవారం ఉదయం 7గంటలకు బయలుదేరాల్సిన విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో విమానం నిలిచి పోయింది. విమానంలోని 285 మంది ప్రయాణికులను వివిధ హోటళ్లకు తరలించినప్పటికీ ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నిన్నటి నుంచి హోటళ్లలో ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నా, బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ అధికారులు స్పందించడం లేదని ప్రయాణికులు ఆరోపించారు. -
ముంబై–లండన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
లండన్: ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం సాంకేతిక కారణాలతో అత్యవసరంగా అజర్‌బైజాన్‌లోని బాకూలో ల్యాండైంది. సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ముంబైనుంచి బీఏ198 విమానం బయలుదేరాల్సి ఉండగా.. ఫస్ట్‌క్లాస్ కేబిన్‌లో పొగరావటంతో మూడున్నర గంటలు ఆలస్యంగా బయలుదేరింది. అనంతరం అజర్బైజాన్ సమీపంలో ఉన్నప్పుడు ఇదే సమస్య తలెత్తటంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ‘సాంకేతిక కారణాలతో బాకూలో ఆగాం’ అంటూ ఓ ప్రయాణికుడు ట్వీట్ చేయటంతో ఈ విషయం తెలిసింది. ఆ బోయింగ్ 777 విమానంలో ఎందరు ప్రయాణీకులున్నారనే విషయాన్ని విమానయాన సంస్థ వెల్లడించలేదు. -
సచిన్ ఎవరు?
బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రశ్న న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎవరికీ తెలియనది కాదు. అందునా ఈ ఆటకు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌లోనూ మాస్టర్ ఖ్యాతి తక్కువేమీ కాదు. అయితే అనుకోకుండా జరిగిందో... కావాలని చేసిందో కానీ బ్రిటిష్ ఎయిర్వేస్ సిబ్బంది మాత్రం సచిన్ విషయంలో అవమానకరంగా ప్రవర్తించారు. ‘మీరు ఎవరు? మీ పూర్తి పేరేమిటి? అని అనుచితంగా సిబ్బంది ప్రశ్నించడంతో ఎయిర్వేస్ వివాదాల్లో ఇరుక్కుంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తను కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో వెళ్లాలని భావించారు. అయితే కుటుంబసభ్యుల టికెట్‌ను సీట్లు ఉన్నా ఎయిర్‌లైన్స్ ఖరారు చేయలేదు. దీంతోపాటు ఆయన లగేజి కూడా మిస్ అయ్యింది. వీటన్నింటితో చిర్రెత్తుకొచ్చిన సచిన్ ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. ‘సీట్లు ఉన్నా కుటుంబసభ్యుల వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్‌ను కన్ఫర్మ్ చేయలేదు. నిజంగా తీవ్ర నిరుత్సాహంగా ఉన్నాను. లగేజిని కూడా తప్పుడు అడ్రస్‌కు చేర్చారు. పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించారు’ అని ట్వీట్స్ చేశారు. అయితే దీనికి బ్రిటిష్ ఎయిర్వేస్ మరింత దారుణంగా స్పందించింది. ‘ఈ విషయంలో క్షమాపణలు కోరుతున్నాం. ముందుగా మీ పూర్తి పేరు, అడ్రస్, లగేజి వివరాలు మాకు పంపండి. మేం విచారణ చేస్తాం’ అని తాపీగా బదులిచ్చింది. అంతే.. ఒక్కసారిగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎయిర్వేస్పై అభిమానులు దాడి చేశారు. ‘బ్రిటిష్ ఎయిర్వేస్.. నీవు తాగి ఉన్నావా.. మరోసారి ఆ పేరు చెక్ చేసుకో.. ఆయన క్రికెట్‌కు దేవుడు’... ‘స్వర్గం నుంచి బాల్ థాకరే బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాలపై సిరా చల్లాలని ప్రార్థిస్తున్నాను’ అని అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం ‘సచిన్ టెండూల్కర్, భారత్.. ఈ అడ్రస్‌తో పోస్ట్ చేస్తే లేఖ ఎవరికి అందుతుందో తెలుసుకోండి..’ అని ఎయిర్వేస్పై విమర్శలు గుప్పించారు. -
అమూల్యమైన ఉస్తాద్ సరోద్ వాయిద్యం గల్లంతు!
న్యూఢిల్లీ: గత 45 సంవత్సరాలు ప్రాణంలా చూసుకుంటున్న సరోద్ వాయిద్యం విమాన ప్రయాణంలో గల్లంతు కావడంపై ప్రముఖ సంగీత వాద్యకారుడు ఉస్తాద్ అమ్జద్ ఆలీ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో లండన నుంచి ఢిల్లీ ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విశ్వకవి రవీంద్రనాధ్ టాగోర్ స్మారకార్ధం జూన్ 21 తేదిన లండన్ లోని డార్టింగ్ టన్ కాలేజి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గోనేందుకు తన భార్య సుభాలక్ష్మితో కలిసి పాల్గోన్నారు. జూన్ 28 తేదిన బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానంలో లండన్ నుంచి ఢిల్లీకి తిరుగు ఉస్తాద్ అమ్జద్ ఆలీ ఖాన్ ప్రయాణమయ్యారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత తన తనకు ఎంతో ఇష్టమైన, అమూల్యమైన సరోద్ వాయిద్యం కనిపించకుండా పోయిందని, విమాన సిబ్బంది సోదాలు నిర్వహిస్తుండగా సుమారు ఐదు గంటలపాటు వేచి ఉన్నాం. అయితే మరో విమానంలో రావొచ్చని అధికారులు తెలిపారు అని ఉస్తాద్ అమ్జద్ ఆలీ ఖాన్ తెలిపారు. ఇప్పటికి 48 గంటలు దాటినా ఎలాంటి సమాచారం లేదన్నారు. లండన్ లో సరోద్ వాయిద్యాన్ని అప్పగించటప్పుడే ..'ఇది నా జీవితం. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి' అని మరీ చెప్పానని, ఎంతో పేరున్న బ్రిటీష్ ఎయిర్ వేస్ బాధ్యతారాహిత్యంపై ఉస్తాద్ ఆలీ ఖాన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను ఫిర్యాదు చేశానని.. అయితే తనకు ఎలాంటి పరిహారం అక్కర్లేదని, వాయిద్యాన్ని అప్పగిస్తే చాలని ఉస్తాద్ అన్నారు.