సచిన్ ఎవరు?
బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రశ్న
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎవరికీ తెలియనది కాదు. అందునా ఈ ఆటకు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌లోనూ మాస్టర్ ఖ్యాతి తక్కువేమీ కాదు. అయితే అనుకోకుండా జరిగిందో... కావాలని చేసిందో కానీ బ్రిటిష్ ఎయిర్‌వేస్ సిబ్బంది మాత్రం సచిన్ విషయంలో అవమానకరంగా ప్రవర్తించారు. ‘మీరు ఎవరు? మీ పూర్తి పేరేమిటి? అని అనుచితంగా సిబ్బంది ప్రశ్నించడంతో ఎయిర్‌వేస్ వివాదాల్లో ఇరుక్కుంది.
వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తను కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో వెళ్లాలని భావించారు. అయితే కుటుంబసభ్యుల టికెట్‌ను సీట్లు ఉన్నా ఎయిర్‌లైన్స్ ఖరారు చేయలేదు. దీంతోపాటు ఆయన లగేజి కూడా మిస్ అయ్యింది. వీటన్నింటితో చిర్రెత్తుకొచ్చిన సచిన్ ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. ‘సీట్లు ఉన్నా కుటుంబసభ్యుల వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్‌ను కన్‌ఫర్మ్ చేయలేదు. నిజంగా తీవ్ర నిరుత్సాహంగా ఉన్నాను. లగేజిని కూడా తప్పుడు అడ్రస్‌కు చేర్చారు.
పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించారు’ అని ట్వీట్స్ చేశారు. అయితే దీనికి బ్రిటిష్ ఎయిర్‌వేస్ మరింత దారుణంగా స్పందించింది. ‘ఈ విషయంలో క్షమాపణలు కోరుతున్నాం. ముందుగా మీ పూర్తి పేరు, అడ్రస్, లగేజి వివరాలు మాకు పంపండి. మేం విచారణ చేస్తాం’ అని తాపీగా బదులిచ్చింది. అంతే.. ఒక్కసారిగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఎయిర్‌వేస్‌పై అభిమానులు దాడి చేశారు.
‘బ్రిటిష్ ఎయిర్‌వేస్.. నీవు తాగి ఉన్నావా.. మరోసారి ఆ పేరు చెక్ చేసుకో.. ఆయన క్రికెట్‌కు దేవుడు’... ‘స్వర్గం నుంచి బాల్ థాకరే బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానాలపై సిరా చల్లాలని ప్రార్థిస్తున్నాను’ అని అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం ‘సచిన్ టెండూల్కర్, భారత్.. ఈ అడ్రస్‌తో పోస్ట్ చేస్తే లేఖ ఎవరికి అందుతుందో తెలుసుకోండి..’ అని ఎయిర్‌వేస్‌పై విమర్శలు గుప్పించారు.