భారత జట్టు కెప్టెన్‌గా సచిన్‌ టెండుల్కర్‌.. అభిమానులకు పండుగే! | International Masters League 2025: Sachin Tendulkar To Lead India, Check More Details Inside | Sakshi
Sakshi News home page

IMLT20: భారత జట్టు కెప్టెన్‌గా సచిన్‌ టెండుల్కర్‌.. అభిమానులకు పండుగే!

Jan 16 2025 9:03 PM | Updated on Jan 17 2025 1:36 PM

International Masters League 2025: Sachin Tendulkar To Lead India Check Details

ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌(ఐఎమ్‌ఎల్‌- International Masters League) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాదే ఆరంభం కావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్‌ లీగ్‌ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి అడ్డంకులేవీ లేవంటూ నిర్వాహకులు తాజాగా ఐఎమ్‌ఎల్‌ ఆరంభ, ముగింపు తేదీలను ప్రకటించారు.

ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ ఫిబ్రవరి 22న మొదలై.. మార్చి 16న ఫైనల్‌తో పూర్తవుతుందని తెలిపారు. ఇందుకు మూడు వేదికలను కూడా ఖరారు చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు. కాగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్‌ అయిన క్రికెటర్ల మధ్య ఈ టీ20 లీగ్‌ జరుగనుంది.

భారత జట్టు కెప్టెన్‌గా సచిన్‌
ఇందులో ఆరు జట్లు పాల్గొనున్నాయి. భారత్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ టైటిల్‌ కోసం తలపడనున్నాయి. ఇక ఈ టీ20 లీగ్‌లో దిగ్గజ క్రికెటర్లు కూడా పాల్గొననుండటం విశేషం. భారత జట్టుకు లెజెండరీ బ్యాటర్‌, శతక శతకాల ధీరుడు సచిన్‌ టెండుల్కర్‌(Sachin Tendulkar) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

మరోవైపు.. వెస్టిండీస్‌ జట్టుకు రికార్డుల ధీరుడు బ్రియన్‌ లారా, శ్రీలంక టీమ్‌కు కుమార్‌ సంగక్కర, ఆస్ట్రేలియా బృందానికి షేన్‌ వాట్సన్‌, ఇంగ్లండ్‌ జట్టుకు ఇయాన్‌ మోర్గాన్‌, సౌతాఫ్రికా టీమ్‌​కు జాక్వెస్‌ కలిస్‌ సారథ్యం వహించనున్నారు. 

ఆ ముగ్గురు కీలకం
కాగా ఐఎమ్‌ఎల్‌కు సంబంధించి గతేడాది ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. లీగ్‌ కమిషనర్‌గా ఎంపికైన టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) మాట్లాడుతూ.. ‘‘ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను మరోసారి ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఐఎమ్‌ఎల్‌ కృషి చేస్తోంది. క్రికెట్‌ ప్రేమికులకు వినోదాన్ని అందిస్తామని మాట ఇస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.

ఇక ఐఎమ్‌ఎల్‌ పాలక మండలిలో గావస్కర్‌తో పాటు వెస్టిండీస్‌ లెజెండ్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో పాటు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ షాన్‌ పొలాక్‌ కూడా ఉన్నారు. కాగా గతేడాది నవంబరు 17 నుంచి డిసెంబరు 8 వరకు ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ తొలి ఎడిషన్‌ నిర్వహిస్తామని తొలుత ప్రకటన వచ్చింది. అయితే, అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఈ లీగ్‌ను ఎట్టకేలకు ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్వాహకులు వెల్లడించారు.

వేదికలు అవే?
ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌కు సంబంధించిన వేదికలు ఇంకా ఖరారు కానట్లు సమాచారం. అయితే, నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంతో పాటు.. రాజ్‌కోట్‌లోని నిరంజన్‌ షా స్టేడియం, రాయ్‌పూర్‌లోని షాహిద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

డబుల్‌ ధమాకా
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 మొదలుకానుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌తో పాటు ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్‌ అర్హత సాధించింది. 

ఇక ఈ ఐసీసీ టోర్నీ మొదలైన మూడు రోజులకే ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ కూడా ఆరంభం కానుండటం.. అందులోనూ సచిన్‌ టెండుల్కర్‌ మరోసారి బ్యాట్‌ పట్టి మైదానంలో దిగడం.. క్రికెట్‌ ప్రేమికులకు డబుల్‌ ధమాకా అనడంలో సందేహం లేదు.

చదవండి: Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా అతడు ఫిక్స్‌!.. వారిపై వేటు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement