ఉత్కంఠ పోరులో లంకపై గెలుపు.. భారత్‌తో ఫైనల్లో వెస్టిండీస్‌ | IML 2025 2nd Semis: West Indies Beat Sri Lanka Set To Final With India, Check Match Highlights Inside | Sakshi
Sakshi News home page

IML 2nd Semi Final: రామ్‌దిన్‌ ధనాధన్‌.. ఉత్కంఠ పోరులో లంకపై గెలుపు.. భారత్‌తో ఫైనల్లో వెస్టిండీస్‌

Published Sat, Mar 15 2025 12:01 PM | Last Updated on Sat, Mar 15 2025 1:12 PM

IML 2025 2nd Semis: West Indies Beat Sri Lanka Set To Final With India

అంతర్జాతీయ మాస్టర్స్‌ లీగ్‌-2025 (International Masters League)లో వెస్టిండీస్‌ ఫైనల్‌కు దూసుకువచ్చింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో సెమీ ఫైనల్లో శ్రీలంక మాస్టర్స్‌ (Sri Lanka Masters)ను చిత్తు చేసి.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. రాయ్‌పూర్‌ వేదికగా వెస్టిండీస్‌ (West Indies Masters)- శ్రీలంక మధ్య శుక్రవారం రాత్రి మ్యాచ్‌ జరిగింది.

టాస్‌ గెలిచిన శ్రీలంక మాస్టర్స్‌
షాహిద్‌ వీర్‌ నారాయణన్‌ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియంలో టాస్‌ గెలిచిన శ్రీలంక మాస్టర్స్‌.. వెస్టిండీస్‌ మాస్టర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో విండీస్‌ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లలో డ్వేన్‌ స్మిత్‌(0) విఫలం కాగా.. విలియం పెర్కిన్స్‌(24) ఫర్వాలేదనిపించాడు.

రామ్‌దిన్‌ ధనాధన్‌
వన్‌డౌన్‌ బ్యాటర్‌ లెండిల్‌ సిమ్మన్స్‌(12 బంతుల్లో 17) వేగంగా ఆడగా.. కెప్టెన్‌ బ్రియన్‌ లారా దంచికొట్టాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 41 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో చాడ్విక్‌ వాల్టన్‌తో కలిసి దినేశ్‌ రామ్‌దిన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

వాల్టన్‌ 20 బంతుల్లో 31 పరుగులు చేసి నిష్క్రమించగా.. రామ్‌దిన్‌ మాత్రం 22 బంతుల్లోనే 50 రన్స్‌ సాధించి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.  శ్రీలంక బౌలర్లలో నువాన్‌ ప్రదీప్‌, జీవన్‌ మెండిస్‌, అసేల గుణరత్నె ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

గుణరత్నె ఒంటరిపోరాటం వృథా
ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆఖరి వరకు అద్భుత పోరాటం చేసింది. ఓపెనర్లలో ఉపుల్‌ తరంగ(30) రాణించగా.. కెప్టెన్‌ కుమార్‌ సంగక్కర(17), వన్‌డౌన్‌లో వచ్చిన లాహిరు తిరిమన్నె(9) పూర్తిగా నిరాశపరిచారు.

ఇలాంటి తరుణంలో అసేల గుణరత్నె ఒంటరిపోరాటం చేశాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 66 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా ఇసురు ఉడానా(10 బంతుల్లో 21), దిల్‌రువాన్‌ పెరీరా(6 బంతుల్లో 11) రాణించారు. కానీ విండీస్‌ బౌలర్ల విజృంభణ కారణంగా శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 173 పరుగుల వద్ద నిలిచింది.

ఫలితంగా ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది వెస్టిండీస్‌ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. విండీస్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ టినో బెస్ట్‌ (4/27) అత్యుత్తమంగా రాణించగా.. డ్వేన్‌ స్మిత్‌ రెండు, ఆష్లే నర్స్‌, జెరోమ్‌ టేలర్‌, లెండిల్‌ సిమ్మన్స్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

ఇండియాతో ఫైనల్‌
కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో మాస్టర్స్‌ లీగ్‌కు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు. ఇండియా మాస్టర్స్‌, శ్రీలంక మాస్టర్స్‌, ఇంగ్లండ్‌ మాస్టర్స్‌, సౌతాఫ్రికా మాస్టర్స్‌, ఆస్ట్రేలియా మాస్టర్స్‌, వెస్టిండీస్‌ మాస్టర్స్‌ జట్లు ఇందులో భాగమయ్యాయి. నవీ ముంబై, వడోదర, రాయ్‌పూర్‌లో మ్యాచ్‌లను షెడ్యూల్‌ చేశారు.

ఇక తొలి సెమీస్‌లో ఇండియా ఆసీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకోగా.. రెండో సెమీ ఫైనల్లో విండీస్‌ లంకపై గెలుపొందింది. ఇండియా మాస్టర్స్‌- వెస్టిండీస్‌ మాస్టర్స్‌ మధ్య ఆదివారం(మార్చి 16) నాటి ఫైనల్‌కు రాయ్‌పూర్‌ వేదిక. 

చదవండి: ఉన్నదే ఒక్కడు.. మీరు కాస్త నోళ్లు మూయండి: పాక్‌ మాజీ స్పిన్నర్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement