భారత క్రికెటర్ కరుణ్ నాయర్(Karun Nair)పై టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) ప్రశంసల వర్షం కురిపించాడు. ఏడు ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు శతకాలు బాదడం గాలివాటం కాదని.. కఠోర శ్రమ, అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నాడు. కరుణ్ వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింత ముందుకు వెళ్లాలని సచిన్ ఆకాంక్షించాడు.
ఐదు సెంచరీల సాయంతో
కాగా రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించిన కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్‌లో చాలా కాలం పాటు కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, 2023-24 సీజన్ నుంచి అతడు విదర్భకు ఆడుతున్నాడు. ఈ క్రమంలో దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25(Vijay Hazare Trophy) సీజన్‌లో 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
యాభై ఓవర్ల ఫార్మాట్లో కరుణ్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏకంగా 752 పరుగులు రాబట్టాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. ఏడు ఇన్నింగ్స్‌లోనూ అజేయంగా నిలవడం మరో విశేషం. ఇక కెప్టెన్‌గానూ కరుణ్ నాయర్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. బ్యాటర్‌గా ఆకట్టుకుంటూనే సారథిగానూ సరైన వ్యూహాలతో విదర్భను తొలిసారి ఈ వన్డే టోర్నీలో ఫైనల్‌కు చేర్చాడు.
ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్‌కు టీమిండియా సెలక్టర్లు పిలుపునివ్వాలని.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి అతడిని ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ సైతం కరుణ్ నాయర్ ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో
‘‘కేవలం ఏడు ఇన్నింగ్స్‌లో ఐదు శతకాల సాయంతో 752 పరుగులు.. ఇది అసాధారణ విషయం కరుణ్ నాయర్!.. ఇలాంటి ప్రదర్శనలు కేవలం ఒక్కరోజులోనే సాధ్యం కావు. ఇందుకు ఆట పట్ల అంకిత భావం, దృష్టి ఉండాలి. కఠిన శ్రమతోనే ఇలాంటివి సాధ్యమవుతాయి. ఇదే తీరుగా ధైర్యంగా ముందుకు వెళ్లు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో’’ అని సచిన్ టెండ్కులర్ ‘ఎక్స్’ వేదికగా కరుణ్ నాయర్‌ను అభినందించాడు.
కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శనివారం జట్టును ప్రకటించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జట్టు వివరాలను వెల్లడించనున్నాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ టోర్నీ ఆడతాడా? లేదా? అన్నది ఈ సందర్భంగా తేలనుంది.
నా అంతిమ లక్ష్యం అదే
ఇక చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు కరుణ్ నాయర్‌కు అవకాశం ఇవ్వాలంటూ టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బలంగా తన గొంతును వినిపించాడు. అయితే, మరో భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ మాత్రం కరుణ్‌ను మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం లేదంటూ కొట్టిపారేశాడు. ఇదిలా ఉంటే.. పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్ మాత్రం తనకు మరోసారి భారత్ తరఫున ఆడాలని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టాడు.
‘‘దేశం తరఫున ఆడాలని ప్రతి ఆటగాడికి ఉంటుంది. నా కల కూడా ఇంకా సజీవంగానే ఉంది. అందుకే నేను ఇంకా క్రికెట్‌లో కొనసాగుతున్నాను. ఏదో ఒకరోజు మళ్లీ టీమిండియాలో అడుగుపెడతా. నా ఏకైక, అంతిమ లక్ష్యం అదే’’ అని కరుణ్ నాయర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఎనిమిదేళ్ల క్రితం
కాగా 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్ చివరగా 2017లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. భారత్ తరఫున ఆరు టెస్టులు ఆడిన కరుణ్ నాయర్ ఖాతాలో 374 పరుగులు ఉన్నాయి, ఇందులో త్రిబుల్ సెంచరీ(303) ఉంది. ఇక రెండు వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ కేవలం 46 పరుగులకే పరిమితమయ్యాడు.
చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్
Comments
Please login to add a commentAdd a comment