అంతరిక్షంలో 42 కిలోమీటర్ల పరుగు పందెం!
లండన్: బ్రిటన్ వ్యోమగామి టిమ్ పీక్ రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో 42 కిలోమీటర్ల మారథాన్ అతి తక్కువ సమయంలో పూర్తి చేసి ఔరా అనిపించాడు. తాను చేసిన ఈ సాహసాన్ని లండన్లో పలువురు ప్రత్యక్షంగా వీక్షించారు. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఈ రికార్డు నమోదైంది. బ్రిటిష్ యూరోపియన్ ఎజెన్సీకి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక అంతరిక్ష కేంద్రం ఉంది. మొత్తం ఆరు నెలల కార్యక్రమం కోసం ఈ స్టేషన్ కు వెళ్లిన టిమ్ ఆ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఒక ట్రెడ్ మిల్ ను ఏర్పాటుచేసుకొని ఈ మారథాన్ ప్రారంభించాడు.
మొత్తం 3గంటల 35 నిమిషాల్లో ఈ మారథాన్ పూర్తి చేసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. గతంలో ఈ రికార్డు భారతీయ సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునితా విలియమ్స్ పేరిట ఉంది. ఆమె బోస్టన్ మారథాన్ పేరిట 2007లో ఇదే లక్ష్యాన్ని 4 గంటల 24 నిమిషాల్లో పూర్తి చేశారు. కాగా, టిమ్ మాత్రం లండన్ మారథాన్ పేరిట ఈ పరుగును పూర్తి చేసి గిన్నిస్ కు చేరారు. అసలు గ్రావిటీ ఏమాత్రం ఉండని కక్షలో ఉండి ఇంత వేగంగా మారథాన్ పూర్తి చేయడం నిజంగా ఒక ప్రపంచ రికార్డు అని గిన్నిస్ వరల్డ్ తెలిపింది. ఈ 44 ఏళ్ల మారథాన్ వీరుడు.. భూమిపై ఉన్న 39 వేలమంది మారథాన్ పోటీ దారుల్లో ఒకరు కూడా.