british columbia supreme court
-
25 పెళ్లిళ్లు.. 146 మంది పిల్లలు
కెనడాలో ఓ మాజీ మత పెద్ద చేసిన నిర్వాకమిది. గత 25 ఏళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున ఆయన పాతిక పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏడాదికి ఇద్దరు ముగ్గురు సంతానాన్ని పొందాడు. అలా ఆయన సంతానం సంఖ్య 25 ఏళ్లలో 146కు చేరింది. బహుభార్యత్వం కేసులో ప్రస్తుతం ఐదేళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న ఆయన పేరు విన్స్టన్ బ్లాక్మోర్. వయసు 61 ఏళ్లు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులోగల బౌంటిఫుల్ ప్రాంతంలో ప్రత్యేక వర్గ ప్రజలు నివసిస్తుంటారు. వారిలో ఒకరైన విన్స్టన్ 1990 నుంచి ఇప్పటివరకు 25 మంది మహిళలను పెళ్లి చేసుకున్నారు. వారితో కాపురం చేసి 146 మంది పిల్లల్ని కన్నారు. వాస్తవానికి 1990 ల్లోనే విన్స్టన్ బహుభార్యత్వంపై ఆరోపణలు వచ్చాయి. అయితే, బహుభార్యత్వానికి సంబంధించి చట్టా ల్లో ఉన్న లొసుగులతో విచారణ, శిక్షల నుంచి తప్పిం చుకుంటూ వచ్చా రు. అయితే, 2011లో కెనడాలో బహుభార్యత్వాన్ని ఆ దేశ న్యాయస్థానం నిషేధించింది. ఆ తర్వాత కూడా విన్స్టన్ వివాహాలు చేసుకుంటూనే ఉన్నారు. దీంతో ఆయన మాజీ భార్య ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు జస్టిస్ షెరీ ఆన్ డొనెగాన్.. విన్స్టన్కు ఐదేళ్ల కారాగార శిక్ష విధించారు. పాతిక వివాహాలు చేసుకోవడంపై విన్స్టన్ స్పందిస్తూ.. భగవంతుడి ఆదేశాల మేరకే తాను అన్ని పెళ్లిళ్లు చేసుకున్నానని చెప్పడం కొసమెరుపు! -
కెనడా సుప్రీంకోర్టు జడ్జిగా సిక్కు మహిళ
- అరుదైన గౌరవాన్ని పొందిన పర్బీందర్ కౌర్ షెర్గీల్ ఒట్టావా: భారత సంతతికి చెందిన సిక్కు మహిళ పర్బీందర్ కౌర్ షెర్గీల్ కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తలపాగా ధరించే ఓ మహిళకు ఆ దేశంలో ఇంతటి కీలక పదవి దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. కెనడా ఫెడరల్ కేబినెట్ ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బ్రటిష్కొలంబియా సుప్రీం కోర్టు జడ్జిగా జస్టిన్ పర్బీందర్ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. పంజాబ్లో జన్మించిన పర్బీందర్.. నాలుగేళ్ల వయసులోనే కుటుంబంతోకలిసి కెనడా వెళ్లారు. అక్కడి సస్కట్చెవాన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. అనంతరం స్థానిక సిక్కుల హక్కుల కోసం ఎనలేని కృషిచేశారు. విద్యాలయాలకు వెళ్లే సిక్కు విద్యార్థులు తమ సంప్రదాయ ఆయుధమైన కిర్పాన్(ఖడ్గం)ను ధరించే హక్కు కోసం ఆమె సాగించిన న్యాయపోరాటం, సాధించిన విజయం అప్పట్లో విశేష ప్రాచుర్యం పొందింది. పర్బీందర్కు భర్త, ఒక కూతురు, మగ కవలలు ఉన్నారు. కెనడా సుప్రీంకోర్టు జడ్జిగా కౌర్ నియామకం పట్ల ప్రపంచ సిక్కు సంఘం(డబ్ల్యూఎస్వో) హర్షం వ్యక్తం చేసింది. కెనడాలోని భారత సంతతికి చెందిన ప్రముఖులు సైతం ఆమెకు అభినందనలు తెలిపారు.