british couple
-
పడవలను ఫోటో తీసినందుకు జైలు శిక్ష
ఎథెన్స్ : ఆర్మీకి చెందిన రెండు పడవలను ఫోటో తీసిన దంపతులకు పోలీసులు జైలు శిక్ష విధించారు. తాము ఏ తప్పు చేయలేదని, పర్యటన నిమిత్తం ఆ దేశానికి వచ్చామని చెప్పినా వినిపించుకోకుండా ఇబ్బందుల పాలుచేశారు. ఈ సంఘటన గ్రీసు దేశంలోని ఎథెన్స్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన దంపతులు పమెలా, మైకేల్ క్లియరీ పర్యటన నిమిత్తం గ్రీసు దేశానికి వెళ్లారు. కొద్దిరోజుల క్రితం ఐలాండ్ ఆఫ్ కాస్‌లోని ఓ ఓడరేవుకు చేరుకున్నారు. భార్యాభర్తలిద్దరూ సెల్ఫోన్లో ఫోటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. మైకేల్ ఓడరేవులో నిలిపి ఉన్న రెండు ఆర్మీ పడవలను ఫోటో తీశాడు. ఇది గమనించిన ఓ ఆర్మీ సైనికుడు మైకేల్ ఫోన్లో తీసిన ఫోటోలను తొలగించాలని, పాస్‌పోర్ట్‌లు చూపించాలని ఆదేశించాడు. దీంతో భయపడ్డ దంపతులు అక్కడి నుంచి తప్పించుకుని బ్రిటన్‌కు బయలుదేరారు. మార్గం మధ్యలో వారిని అడ్డగించిన పోలీసులు వారి చేతులకు బేడీలు వేసి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తాము గూఢాచారులం కాదని ఆ దంపతులు ఎంతమొత్తుకున్నా వారు విడిచి పెట్టలేదు. మరుసటి రోజు కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ముందు వారు తమ గోడును వెళ్లబోసుకోగా ఆయన వారిని ఊరికి పంపటానికి అంగీకరించాడు. అయితే వారి ఫోన్లను గ్రీసు పోలీసులకు అప్పగించి, బ్రిటన్‌లోని ఓ లాయర్‌తో వాదనలు వినిపించాలని షరతు విధించాడు. స్వదేశానికి చేరుకునన్న ఆ దంపతులు లాయర్‌ను ఏర్పాటు చేసుకుని వాదనలు వినిపించారు. కొన్ని వారాల తర్వాత కేసు నిలబడలేకపోయింది. దీంతో గ్రీసు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లను సైతం వెనక్కు పంపించారు. -
కుక్క క్లోనింగ్‌కు రూ. 1.32 కోట్లు!
తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క కాస్తా చచ్చిపోవడంతో ఆ బ్రిటిష్ దంపతులకు దుఃఖం ఆగలేదు. దాన్ని క్లోనింగ్ చేయించి, అచ్చం అలాంటి కుక్క పిల్లనే సృష్టించమని శాస్త్రవేత్తలను ఆశ్రయించారు. వాళ్లూ దానికి సరేనన్నారు. అంతా బాగానే ఉంది గానీ, అలా చేసినందుకు ఆ బ్రిటిష్ దంపతులకు అయ్యిన ఖర్చెంతో తెలుసా.. అక్షరాలా కోటీ 32 లక్షలు!! ఇంత డబ్బు పెట్టి కుక్క పిల్లను క్లోనింగ్ చేయించుకున్న తొలి బ్రిటిష్ జంటగా వాళ్లు రికార్డులకు ఎక్కారు. లారా జాక్వెస్, రిచర్డ్ రెమ్డె అనే ఈ ఇద్దరూ అల్లారుముద్దుగా పెంచుకుంటున్న 8 ఏళ్ల బాక్సర్ కుక్క 'డైలన్' జూన్ నెలలో గుండెపోటుతో మరణించింది. దాంతో వాళ్లు చనిపోయిన కుక్కలను క్లోనింగ్ చేసే సోవమ్ అనే దక్షిణ కొరియా బయోటెక్ కంపెనీ వర్గాలను ఆశ్రయించారు. డైలన్ మరణంతో తాము తల్లడిల్లిపోయామని లారా చెప్పింది. తమ చర్యను జనం ఆమోదించకపోవచ్చని, కానీ తమకు మాత్రం అది ప్రాణంతో సమానమని ఆమె తెలిపింది. డైలన్ డీఎన్ఏను సేకరించి, దాత అండంలో దాన్ని ప్రవేశపెట్టి, దాన్ని ఓ ఆడ కుక్కకు ఇంప్లాంట్ చేశారు. ఆ కుక్క పెట్టిన పిల్లలనే ఇప్పుడు లారా, రిచర్డ్ జంట పెంచుకుంటోంది. -
ప్రభుత్వ భృతితో లావవుతున్నారు
ప్రభుత్వ భృతి మీద ఆధారపడి బతికేందుకు పిల్లలను కనడమే పనిగా పెట్టుకున్నవారు లండన్‌లో ఎక్కువ మందే ఉంటారు. పనిచేయడానికి ఒళ్లు వంగనంత లావు (టూ ఫ్యాట్ టు వర్క్) ఉన్నారన్న కారణంగా కూడా ప్రభుత్వ భృతి మీద ఆధారపడి బతుకుతున్న జంటలు కూడా ఉండడం కాస్త ఆశ్చర్యమే! 45 ఏళ్ల స్టీవ్ బీర్, 43 ఏళ్ల మిషెల్లీ కూడా అదే కోవకు చెందిన జంట. 5.5 అడుగులున్న స్టీవ్ బీర్ 349 కిలోలుండగా, 4.4 అడుగులున్న మిషెల్లీ 147 కిలోల బరువున్నారు. వారు డేవన్ కౌంటీలోని ప్లైమౌత్ పట్టణంలో సింగిల్ బెడ్రూమ్ ఇంటిలో నివసిస్తున్నారు. గతంలో విండో క్లీనింగ్ బాయ్‌గా పనిచేసిన బీర్‌కు 2011లో అధిక బరువు వల్ల స్వల్పంగా హార్ట్ అటాక్ వచ్చిందట. పని చేయడం వల్లనే ఆర్ట్ అటాక్ వచ్చిందని భావించిన బీర్ ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్లో 'టూ ఫ్యాట్ టు వర్క్' అనే సర్టిఫికెట్ తీసుకొని వికలాంగుల కేటగిరీ కింద ప్రభుత్వం నుంచి నిరుద్యోగ భృతి పొందుతున్నాడు. అంతకుముందే నాలుగు పెళ్లిళ్లు చేసుకొని వారిని వదిలేసిన బీర్, తనలాగే లావున్న మిషెల్లీని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరికీ కలిపి నెలకు రూ. 2 లక్షల నిరుద్యోగ భృతి వస్తోంది. దాంతో ఎంచక్కా వారు తమకిష్టమైన కిచెన్ కబాబ్‌లు తెగతింటూ రొప్పుతున్నారు. ఇటీవల కేఎఫ్‌సీకి వెళ్లి తమ పెళ్లి రోజును కూడా ఘనంగా జరుపుకున్నారు. రాత్రికి కావాల్సిన తిండి పదార్థాలను వెంట తెచ్చుకున్నారు. ఆ మధ్య వీరిద్దరిని 'ఛానెల్-5' ఇంటర్వ్యూ చేసింది. దీన్ని చూసిన టాక్స్ పేయర్స్ వారిపై మండిపడ్డారు. 'మోస్ట్ హేటెడ్ కపుల్'గా ముద్ర కూడా వేశారు. టాక్స్ పేయర్స్ గగ్గోలుతో మున్సిపల్ కౌన్సిల్ వారిని హెచ్చరించింది. బరువు తగ్గేందుకు కసరత్తు చేయాలని, అందుకు అవసరమైన వైద్య చికిత్స కోసం తాము ఇస్తున్న నెలవారీ భృతిని ఉపయోగించాలని సూచించింది. ప్రస్తుతం తాము చేతనైన కాడికి వ్యాయామం చేస్తున్నామని, కొంత బరువు తగ్గామని ఆ జంట తెలిపింది. ప్రభుత్వ భృతి మీద ఆధారపడి జీవితాంతం బతకాలనే ఆలోచన తమకేమీ లేదని, అందుకే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నానని స్టీవ్ బీర్ మీడియాకు తెలిపారు.