కుక్క క్లోనింగ్‌కు రూ. 1.32 కోట్లు!
తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క కాస్తా చచ్చిపోవడంతో ఆ బ్రిటిష్ దంపతులకు దుఃఖం ఆగలేదు. దాన్ని క్లోనింగ్ చేయించి, అచ్చం అలాంటి కుక్క పిల్లనే సృష్టించమని శాస్త్రవేత్తలను ఆశ్రయించారు. వాళ్లూ దానికి సరేనన్నారు. అంతా బాగానే ఉంది గానీ, అలా చేసినందుకు ఆ బ్రిటిష్ దంపతులకు అయ్యిన ఖర్చెంతో తెలుసా.. అక్షరాలా కోటీ 32 లక్షలు!! ఇంత డబ్బు పెట్టి కుక్క పిల్లను క్లోనింగ్ చేయించుకున్న తొలి బ్రిటిష్ జంటగా వాళ్లు రికార్డులకు ఎక్కారు.
లారా జాక్వెస్, రిచర్డ్ రెమ్డె అనే ఈ ఇద్దరూ అల్లారుముద్దుగా పెంచుకుంటున్న 8 ఏళ్ల బాక్సర్ కుక్క 'డైలన్' జూన్ నెలలో గుండెపోటుతో మరణించింది. దాంతో వాళ్లు చనిపోయిన కుక్కలను క్లోనింగ్ చేసే సోవమ్ అనే దక్షిణ కొరియా బయోటెక్ కంపెనీ వర్గాలను ఆశ్రయించారు. డైలన్ మరణంతో తాము తల్లడిల్లిపోయామని లారా చెప్పింది. తమ చర్యను జనం ఆమోదించకపోవచ్చని, కానీ తమకు మాత్రం అది ప్రాణంతో సమానమని ఆమె తెలిపింది. డైలన్ డీఎన్‌ఏను సేకరించి, దాత అండంలో దాన్ని ప్రవేశపెట్టి, దాన్ని ఓ ఆడ కుక్కకు ఇంప్లాంట్ చేశారు. ఆ కుక్క పెట్టిన పిల్లలనే ఇప్పుడు లారా, రిచర్డ్ జంట పెంచుకుంటోంది.