రోడ్డుమీద ఉమ్మేసినందుకు 30వేల జరిమానా
రోడ్లమీద తుపుక్.. తుపక్.. అంటూ ఉమ్ములేసుకుంటూ వెళ్లేవాళ్లు ఇక మీద జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, బ్రిటిష్ ప్రభుత్వం అమలుచేస్తున్న చట్టాలు, అక్కడి కోర్టులు చెబుతున్న విషయాలను బట్టి చూస్తే రేపో మాపో ఇక్కడ కూడా కఠిన చట్టాలు అమలయ్యే అవకాశం కనిపిస్తోంది.
బ్రిటన్లో ఇలాగే రోడ్డుమీద ఉమ్మేసినందుకు ఇద్దరు వ్యక్తులకు అక్కడి కోర్టు 30 వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. ఖషీమ్ కియా థామస్, జిల్వినస్ విట్కస్ అనే ఇద్దరి మీద వాల్థామ్ ఫారెస్ట్ కౌన్సిల్ ఈ ఆరోపణలు చేయగా, థేమ్స్ మేజిస్ట్రేట్ కోర్టు వారికి భారీ జరిమానా వడ్డించింది.
వాస్తవానికి ఇద్దరికీ కేవలం 8 వేల రూపాయల చొప్పున మాత్రమే జరిమానా విధించినా, వాళ్లు కోర్టుకు హాజరు కాకపోవడంతో భారీ మొట్టికాయలే పడ్డాయి. రోడ్డుమీద ఉమ్మినా, చెత్త వేసినా, మూత్ర విసర్జన చేసినా, కుక్కలతో చిరాకు కలిగించినా, సిగరెట్లు కాల్చి పారేసినా కూడా అక్కడ నేరమే.