British tourists
-
ఆగ్రా రైల్వేస్టేషన్లో టాయ్‌లెట్ చార్జీ రూ.112
ఆగ్రా: రైల్వేస్టేషన్లో టాయ్‌లెట్ వాడుకుంటే ఎంత చెల్లిస్తాం? ఉచితం కాకుంటే గనక ఏ ఐదు రూపాయలో, 10 రూపాయలో. కానీ ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులు మాత్రం ఏకంగా రూ.112 చొప్పున చెల్లించుకోవాల్సి వచ్చింది! వారిద్దరూ ఢిల్లీలోని బ్రిటిష్ ఎంబసీ నుంచి ఆగ్రా వెళ్లారు. రైల్వేస్టేషన్లో శ్రీవాత్సవ అనే గైడ్ వారిని రిసీవ్ చేసుకున్నాడు. టాయ్‌లెట్‌కు వెళ్లాలని చెప్పడంతో ఐఆర్సీటీసీ ఎగ్జిక్యూటివ్ లాంజ్‌కు తీసుకెళ్లాడు. బయటికి రాగానే 12 శాతం జీఎస్టీతో కలిపి చెరో రూ.112 రూపాయలు చెల్లించాలని వారిని సిబ్బంది డిమాండ్ చేశారట. ఇదేమిటని ప్రశ్నించినా లాభం లేకపోయిందని, దాంతో ఆ మొత్తాన్ని తానే చెల్లించానని గైడ్ చెప్పుకొచ్చాడు. దీనిపై ఆయన ఐఆర్సీటీసీకి ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది లాంజ్ సేవల చార్జే తప్ప టాయ్‌లెట్‌కు వెళ్లినందుకు వసూలు చేసింది కాదని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. ‘‘లాంజ్ సేవలు వాడుకుంటే కనీస చార్జీ రూ.200. రెండు గంటల పాటు ఏసీ లాంజ్ రూము, కాంప్లిమెంటరీ కాఫీ, ఉచిత వైఫై వంటి సదుపాయాలకు కలిపి ఈ చార్జీ. 50 శాతం డిస్కౌంట్ పోను 12 శాతం జీఎస్టీతో కలిపి రూ.112 చెల్లించాల్సి ఉంటుంది’’ అని వివరించింది. -
‘పందుల కన్నా అధ్వాన్నంగా ఉన్నారు’
మన ఇంట్లో మనం ఎలా ఉన్న పర్వాలేదు.. కానీ వేరే వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడో.. లేదా వేరే ప్రాంతానికో, దేశానికో వెళ్లినప్పుడు మర్యాదగా ప్రవర్తించడం చాలా అవసరం. అలా కాకుండా చిల్లర వేషాలు వేస్తే ఎలా ఉంటుందో ఈ బ్రిటన్ ఫ్యామిలీని చూస్తే అర్థం అవుతుంది. ఈ సంఘటన న్యూజిలాండ్‌లో జరిగింది. బ్రిటన్‌కు చెందిన ఓ ఫ్యామిలీ పర్యటన నిమిత్తం న్యూజిలాండ్ వెళ్లారు. ఆక్లాండ్, హామిల్టన్ చుట్టుపక్కల ప్రాంతాలలో పర్యటించిన వీరు తినడం, తాగడం మాత్రమే కాక దొంగతనాలకు పాల్పడటం, అడిగిన వారి మీద దాడులు చేయడం వంటి చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేశారు. ఈ విషయం గురించి తెలిసిన ఆక్లాండ్ మేయర్ ఈ కుటుంబం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. వీరి విపరీత చేష్టల గురించి ఓ రెస్టారెంట్ సిబ్బంది మాట్లాడుతూ.. ఆహారంలో వెంట్రుకలు, చీమలు వచ్చాయంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడమే కాక.. బిల్లు కట్టకుండా గలాట చేశారని తెలిపారు. వీరి కుటుంబ సభ్యుల్లో కొందరు పెట్రోల్ బంక్‌లో దొంగతనం కూడా చేశారని తెలిపారు. అంతేకాక తాగేసిన బీర్ బాటిళ్లను బీచ్‌లో పడేశారు. ఈ విషయం గురించి ఓ జర్నలిస్ట్ అడగ్గా అతని మీద చెప్పుతో దాడి చేశారు. ఈ విషయాల గురించి న్యూజిలాండ్ అధికారులు మాట్లాడుతూ.. ‘వీరు పందుల కన్నా అధ్వాన్నంగా ప్రవర్తించారు. ఇలాంటి వారిని ఎక్కువ రోజులు మా దేశంలో ఉంచుకోలేం. సాధ్యమైనంత త్వరగా వీరిని ఇక్కడి నుంచి పంపించాలని ప్రయత్నిస్తున్నామ’ని తెలిపారు. -
టూరిస్టుల స్వర్గంలో ఇంత దారుణమా!
బ్యాంకాక్: సందర్శకుల స్వర్గధామంగా పిలిచే థాయ్ లాండ్ లో ఇటీవల కాలంలో విదేశీ టూరిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా జరిగిన అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అక్కడ హాట్ టాపిక్ గా మారిపోయింది. వీడియో ఆధారంగా పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా శ్రమించి ఇప్పటికే ముగ్గుర్ని అరెస్ట్ చేయగా, గురువారం నాడు నాలుగో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పీకలదాకా తాగడం వల్ల తాము అలా ప్రవర్తించామని, బాధితుల కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. పోలీస్ ఉన్నతాధికారి చైయాకోర్న్ కథనం ప్రకారం... స్కాట్లాండ్ కు చెందిన ఓ వ్యక్తి (68), తన భార్య (65), కుమారుడు (43) తో కలిసి టారిస్టుల ప్యారడైజ్ గా పేరుగాంచిన థాయ్ లాండ్ కు వచ్చారు. అయితే వారికి ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. స్థానికులు కొందరు వారిపై విచక్షణారహితంగా దాడిచేశారు. థాయ్ లాండ్ లోని హువా హిన్ పట్టణంలో ఏప్రిల్ 13న ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. దీంతో అధికారులలో చలనం వచ్చింది. ఉరుకులు పరుగుల మీద విచారణ ప్రారంభించారు. థాయ్ లాండ్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కొందరు యువకులు పీకలదాకా తాకి నానా బీభత్సం సృష్టించగా, వీరి ఆగడాలకు స్లాట్లాండ్ కు చెందిన ఓ టూరిస్టు కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పారు. టూరిస్ట్ దంపతుల కుమారుడు క్యాజువల్ గా ఓ థాయ్ యువకుడిని టచ్ చేశాడని, దీంతో ఆగ్రహించిన యువకుడు ఆ కుటుంబాన్ని చితకబాదినట్లు వీడియోలో కనిపిస్తోంది. కుమారుడిని ఎందుకు కొట్టావని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో గొడవ పెద్దదైంది. మద్యం తాగిఉన్న నిందితుడి మిత్రబృందం ఈ ముగ్గురు స్కాట్లాండ్ కుటుంభసభ్యులపై ఓ రేంజ్ లో రెచ్చిపోయి దాడిచేశారు. చివరికి వారు రోడ్డుపై సృహతప్పి పడిపోయినా వారిని కాళ్లతో తన్నినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ వెంటనే అక్కడి నుంచి ఆ గ్యాంగ్ పరారైంది. మార్కెట్ ఏరియాలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. గత మార్చి నెలలో కోకుత్ ఐలాండ్ లో దారుణం జరిగింది. నలుగురు ఫ్రెంచి సందర్శకులపై విచక్షణా రహితంగా దాడిచేయడంతో పాటు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు.