
మన ఇంట్లో మనం ఎలా ఉన్న పర్వాలేదు.. కానీ వేరే వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడో.. లేదా వేరే ప్రాంతానికో, దేశానికో వెళ్లినప్పుడు మర్యాదగా ప్రవర్తించడం చాలా అవసరం. అలా కాకుండా చిల్లర వేషాలు వేస్తే ఎలా ఉంటుందో ఈ బ్రిటన్ ఫ్యామిలీని చూస్తే అర్థం అవుతుంది. ఈ సంఘటన న్యూజిలాండ్‌లో జరిగింది. బ్రిటన్‌కు చెందిన ఓ ఫ్యామిలీ పర్యటన నిమిత్తం న్యూజిలాండ్ వెళ్లారు. ఆక్లాండ్, హామిల్టన్ చుట్టుపక్కల ప్రాంతాలలో పర్యటించిన వీరు తినడం, తాగడం మాత్రమే కాక దొంగతనాలకు పాల్పడటం, అడిగిన వారి మీద దాడులు చేయడం వంటి చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేశారు.
ఈ విషయం గురించి తెలిసిన ఆక్లాండ్ మేయర్ ఈ కుటుంబం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. వీరి విపరీత చేష్టల గురించి ఓ రెస్టారెంట్ సిబ్బంది మాట్లాడుతూ.. ఆహారంలో వెంట్రుకలు, చీమలు వచ్చాయంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడమే కాక.. బిల్లు కట్టకుండా గలాట చేశారని తెలిపారు. వీరి కుటుంబ సభ్యుల్లో కొందరు పెట్రోల్ బంక్‌లో దొంగతనం కూడా చేశారని తెలిపారు. అంతేకాక తాగేసిన బీర్ బాటిళ్లను బీచ్‌లో పడేశారు. ఈ విషయం గురించి ఓ జర్నలిస్ట్ అడగ్గా అతని మీద చెప్పుతో దాడి చేశారు.
ఈ విషయాల గురించి న్యూజిలాండ్ అధికారులు మాట్లాడుతూ.. ‘వీరు పందుల కన్నా అధ్వాన్నంగా ప్రవర్తించారు. ఇలాంటి వారిని ఎక్కువ రోజులు మా దేశంలో ఉంచుకోలేం. సాధ్యమైనంత త్వరగా వీరిని ఇక్కడి నుంచి పంపించాలని ప్రయత్నిస్తున్నామ’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment