బ్రెగ్జిట్‌పై బ్రెసెల్స్‌లో రచ్చరచ్చ
- 'నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్?' అని బ్రెగ్జిట్ ఉద్యమ నేత నెగెల్కు ఈసీ అధ్యక్షుడి ప్రశ్న
- పార్లమెంట్‌లోనే ఈయూపై విమర్శలు కురిపించిన నెగెల్
- విడిపోయినా కలిసే సాగుదామంటూ ప్రధాని కామెరూన్ వేడుకోలు
- ఈయూలో బ్రిటన్ జాతీయ జెండా తొలిగింపు.. ప్రధాని బృందం రాకకు ముందే మళ్లీ ఏర్పాటు
బ్రెసెల్స్: పరస్పర దూషణలు, విమర్శలతో బ్రెగ్జిట్ పై యురోపియన్ పార్లమెంట్ లో జరిగిన చర్చ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. రెఫరెండం ద్వారా యురోపియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో 751 మంది సభ్యుల యురోపియన్ పార్లమెంట్ అత్యవసరంగా సమావేశమైంది. మంగళవారం ప్రారంభమైన ఈ సమావేశాలకు బ్రిటన్ ప్రతినిధులుగా(మొత్తం 73 మంది ప్రతినిధులుంటారు) ప్రధాని డేవిడ్ కామెరూన్, యూకే ఇండిపెండెంట్ పార్టీ(యూకేఐపీ) నేత నెగెల్ ఫరాగ్, మరి కొందరు నేతలు హాజరయ్యారు. ఈయూ సభ్యదేశంగా బ్రెసెల్స్ లోని ఈయూ పార్లమెంట్ భవనంలో బ్రిటన్ జాతీయ జెండా తప్పక ఉండాలి. కానీ బ్రెగ్జిట్ నిర్ణయం దృష్ట్యా అధికారులు ఆ జెండాను తొలిగించారు. అయితే బ్రిటన్ నేతలు రావడానికి కొద్ది నిమిషాల ముందే మళ్లీ బ్రిటన్ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ చర్య ద్వారా ఈయూ నేతలు బ్రిటన్ పట్ల వ్యతిరేక భావనతో ఉన్నామని చెప్పకనే చెప్పారు.
సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు యురోపియన్ కమిషన్ అధ్యక్షుడు జేన్ క్లాడ్ జంకర్, యూకేఐపీ నేత నెగెల్ ను తిట్టిపోశారు. బ్రెగ్జిట్ ఉద్యమనేతగా పేరు తెచ్చుకున్న నెగెల్ ను.. 'విడిపోవాలనుకున్నవాడివి నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్?'అని జేన్ క్లాడ్ ప్రశ్నించారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జేన్ ను ఆయన సహచరులు లోపలికి తీసుకెళ్లడంతో వివాదం తాత్కాలికంగా సర్దుమణిగింది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే నెగెల్ కు మాట్లాడే అవకాశం కల్పించారు స్పీకర్ మార్టిన్ షుల్ట్జ్. ప్రసంగం మొదట్లో ఈయూకు ధన్యవాదాలు తెలిపిన నెగెల్.. తర్వాత విమర్శలు గుప్పించారు. జేన్ క్లాడ్ తనను అవమానించిన తీరును సభలో వివరించారు. దానికి స్పీకర్.. జేన్ ను గట్టిగా మందలించారు. కాగా, సెషన్ పూర్తయిన తర్వాత నెగెల్, జేన్ లు ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడం విశేషం.
అడకత్తెరలో కామెరూన్
రెఫరెండం నిర్వహించి బ్రెగ్జిట్, ఊహించని ఫలితాన్ని చవిచూసిన ప్రధాని డేవిడ్ కామెరూన్ బ్రెసెల్స్ లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఒవైపు ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయే ప్రక్రియను కొనసాగిస్తూనే భవిష్యత్ అవసరాల దృష్యా ఈయూ నేతల మెప్పుకోసం పాకులాడినట్లు కనిపించారు. పలువురు ఈయూ కీలక నేతలు కామెరూన్ రెఫరెండం నిర్వహించడంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. సభ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈయూ నుంచి బయటికి వచ్చినప్పటికీ సత్పంబంధాలు కొనసాగేలా కృషిచేస్తానని చెప్పారు.