ఎన్పీఏలకు ఎస్బీఐ చికిత్స!
♦ స్ట్రెస్డ్ అసెట్స్ కొనుగోళ్లకు ఫండ్
♦ బ్రూక్‌ఫీల్డ్ ఏఎంసీతో కలిసి రూ. 7,350 కోట్ల జాయింట్ వెంచర్
♦ ఎస్బీఐ వాటా 5 శాతం...
♦ ఇప్పటికే ఇలాంటి నిధిని ఏర్పాటు చేసిన కోటక్ మహీంద్రా బ్యాంకు
ముంబై: బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాల్ని ఉద్దేశపూర్వకంగా ఎగవేసినవారు కొందరైతే... నిజంగానే ఆస్తులున్నా వాటిని విక్రయించలేక, అప్పులు తీర్చలేక సతమతమవుతున్నవారు కొందరు!!. ఇలాంటి ఆస్తుల్నే స్ట్రెస్డ్ అసెట్స్ (మొండిబకాయిలు-ఎన్పీఏ)గా పిలుస్తున్నారు. ఇదంతా ఎందుకంటే... దేశీ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇపుడు ఈ స్ట్రెస్డ్ అసెట్స్‌పైనే దృష్టి పెట్టింది. తన బ్యాంకు పరిధిలోను, ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల పరిధిలోను ఉన్న ఇలాంటి ఆస్తుల్ని కొనుగోలు చేయటానికి న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఫండ్ హౌస్ ‘బ్రూక్ ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్’తో జతకట్టింది. ఇలాంటి ఆస్తుల కొనుగోళ్లకు ఈ రెండూ కలిసి ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నాయి.
ఫండ్ విలువ రూ.7,350 కోట్లుకాగా, అమెరికా సంస్థ వాటా 7,000 కోట్లు. ఫండ్‌లో ఐదు శాతం అంటే దాదాపు రూ.350 కోట్లను ఎస్బీఐ పెట్టుబడిగా పెడుతుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారీగా పేరుకుపోయిన ఎస్బీఐ మొండి బకాయిల సమస్యల పరిష్కారానికి కూడా తాజా చొరవ దోహదపడుతుందని చెప్పారాయన. బ్రూక్‌ఫీల్డ్ దాదాపు రూ.240 బిలియన్ విలువైన ఆస్తుల్ని నిర్వహిస్తోంది. కొత్త ఫండ్ ఎప్పటి నుంచీ కార్యకలాపాలు నిర్వహిస్తుందని అడిగిన ప్రశ్నకు సీనియర్ అధికారి ఒకరు సమాధానమిస్తూ... ‘‘త్వరలో ఫండ్ ఏర్పాటవుతుంది. దీనిని బ్రూక్‌ఫీల్డ్, ఎస్బీఐ టాప్ మేనేజ్మెంట్ నిర్వహిస్తాయి’’ అని చెప్పారు. తొలుత ఒత్తిడిలో ఉన్న ఎస్బీఐ ఆస్తులపై ఫండ్ దృష్టి పెడుతుందా? అన్న ప్రశ్నకు ‘అవును’ అని ఆయన సమాధానమివ్వటం గమనార్హం. ‘‘అయితే ఇతర ఆస్తుల కొనుగోళ్లకూ అవకాశముంది. భారీ రుణ అకౌంట్లలో అధికం ఎస్బీఐకి చెందినవే ఉన్నాయి కాబట్టి ఆ అకౌంట్లపైనా ఫండ్ దృష్టి సారిస్తుంది’’ అని ఆయన వివరించారు.
ఎస్బీఐ ఎన్పీఏల స్థితి ఇదీ...
ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న పలు రంగాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో- ఎస్బీఐ నికర మొండి బకాయిల సమస్య గత కొన్నేళ్లుగా తీవ్ర రూపం దాలుస్తోంది. 2015 మార్చి నాటికి మొత్తం రుణాల్లో 2.12 శాతంగా (రూ.27,591 కోట్లు) ఉన్న బ్యాంక్ ఎన్పీఏల పరిమాణం 2016 మార్చి నాటికి 3.81 శాతానికి (రూ.55,807 కోట్లు) ఎగసింది. స్థూలంగా చూస్తే ఈ మొత్తం ఇదే ఏడాది కాలంలో 2.5 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన అసెట్ క్వాలిటీ రివ్యూ ప్రకారం 36 బ్యాంకుల నికర ఎన్పీఏలు మార్చి 2016లో 7.6 శాతానికి చేరాయి. 2015 సెప్టెంబర్‌లో ఇది 5.1 శాతం. ఇక పునర్వవస్థీకరించిన అకౌంట్లు సహా మొత్తం ఒత్తిడిలో ఉన్న రుణాల విలువ మార్చి 2016 నాటికి 13 శాతంగా ఉంది. అంటే రూ.8 లక్షల కోట్లకు పైమాటే.
ఇప్పటికే కోటక్ ఫండ్...: ఈ తరహా ఫండ్ రెండవది. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల్లో పెట్టుబడులకోసం కోటక్ బ్యాంక్ ఇప్పటికే కెనడియన్ పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్‌తో కలిసి మార్చిలో 525 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో కెనడా సంస్థ వాటా 450 బిలియన్ డాలర్లు. మిగిలిన 75 మిలియన్ డాలర్ల వాటాను కోటక్ మహీంద్రా బ్యాంక్ పెట్టింది.
2019 నాటికి 90 బిలియన్ డాలర్లు అవసరం: ఫిచ్
అంతర్జాతీయ బ్యాంకింగ్ నిబంధనలైన బాసెల్-3 ప్రమాణాలు అనుగుణంగా- 2019 మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు 90 బిలియన్ డాలర్ల (దాదాపు 6 లక్షల కోట్లు) మూలధనం అవసరమవుతుందన్నది రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రభుత్వం మంగళవారం 13 బ్యాంకులకు దాదాపు రూ.22 వేల కోట్ల తాజా మూలధన కేటాయింపుల నేపథ్యంలో ఫిచ్ తాజా అంచనాలను వెలిబుచ్చింది. బ్యాంకుల మూలధన పరిస్థితులు చరిత్రాత్మక బలహీన స్థాయి ల్లో ఉన్నట్లు పేర్కొన్న ఫిచ్, రుణ నాణ్యత సన్నగిల్లడం, ఎన్పీఏలకు సంబంధించి భారీ ప్రొవిజనింగ్ కేటాయింపులు దీనికి కారణంగా పేర్కొంది.
పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవడం ప్రభుత్వ రంగ బ్యాంకులకు కష్టమవుతుందని, ప్రభుత్వమే ఈ దిశలో చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల పునర్వ్యవస్థీకరణ కోసం ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు నాలుగేళ్లలో రూ.70,000 కోట్ల పెట్టుబడులు అందించనున్నారు. ఈ కార్యక్రమం కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ. 25 వేల కోట్లు ఇవ్వగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 25,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. రానున్న రెండు ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఏడాదికి రూ.10,000 కోట్లు చొప్పున నిధులు అందజేస్తారు. అవసరమైతే మరిన్ని నిధులు కూడా అందిస్తామని ఆర్థిక మంత్రి జైట్లీ హామీ ఇస్తున్నారు. కాగా ప్రభుత్వం సమకూర్చనున్న నిధులతో పోల్చితే, ఫిచ్ సూచిస్తున్న నిధుల మొత్తం భారీగా ఉండడం గమనార్హం.
ప్రత్యామ్నాయంలో భాగం...
స్ట్రెస్డ్ అసెట్స్ సమస్య పరిష్కారం దిశగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో చేతులు కలపటమనేది బ్యాంకుల ముందున్న మార్గాల్లో ఒకటి. ఎస్బీఐకి సంబంధించిన స్ట్రెస్డ్ ఆస్తుల సమస్య పరిష్కరించడానికి, లిక్విడిటీ ఇబ్బందుల నుంచి బయటపడటానికి తాజా చర్య సరైనదే.
- అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్
మంచి అవకాశం...
ఎస్బీఐతో ఒప్పందం హర్షణీయం. దీర్ఘకాలంపాటు వృద్ధిబాటలో సాగే భారత్‌లో పెట్టుబడుల కొనసాగింపును గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. మా ప్రైవేట్ ఈక్విటీ ప్లాట్‌ఫామ్‌ను ఇండియాలో మరింత విస్తరిస్తాం. పెట్టుబడుల విస్తరణకు సంస్థ తగిన వ్యూహాల్ని అమలు చేస్తుంది. - అనూజ్ రంజన్, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా హెడ్