న్యూఢిల్లీ: దేశీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీ డీల్స్ నమోదవుతున్నాయి. తాజాగా ముంబైలోని ఖరీదైన కమర్షియల్ ప్రాపర్టీ.. ఈక్వినాక్స్ బిజినెస్ పార్క్స్‌ని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ కొనుగోలు చేసింది. రూ.2,400 కోట్లకు దీన్ని విక్రయించినట్లు ఎస్సార్ గ్రూప్ వెల్లడించింది. 10 ఎకరాల విస్తీర్ణంలోని ఈ బిజినెస్ పార్క్‌లో నాలుగు టవర్లున్నాయి.
లీజుకిచ్చేందుకు అనువైన 12.5 లక్షల చదరపుటడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది. ఇందులో టాటా కమ్యూనికేషన్స్, ఎక్స్‌పీరియన్, క్రాంప్టన్ గ్రీవ్స్, లఫార్జ్ తదితర దిగ్గజాల కార్యాలయాలున్నాయి. దేశీ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత భారీ డీల్స్‌లో ఇది ఒకటని ఎస్సార్ పేర్కొంది. ఎస్సార్ గ్రూప్ గతంలో దీన్ని బెంగళూరుకు చెందిన రియల్టీ సంస్థ ఆర్‌ఎంజెడ్ కార్పొరేషన్‌కి విక్రయించాలని అనుకున్నప్పటికీ.. డీల్ సాకారం కాలేదు.
దాదాపు 285 బిలియన్ డాలర్ల అసెట్స్‌ని నిర్వహిస్తున్న బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థకి దేశీ రియల్టీ మార్కెట్లో గణనీయంగా కార్యకలాపాలు ఉన్నాయి. 2014లో యూనిటెక్ గ్రూప్ నుంచి ఆరు ఐటీ–సెజ్ ప్రాజెక్టులను రూ. 2,000 కోట్లకు కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment