వాళ్లు ఎంత బూస్టప్ ఇవ్వాలని అనుకున్నా సాధ్యం కాదు
వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు
మళ్లీ హైదరాబాద్ బాట పడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: అమరావతి అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు వెళ్తాయేమోననే అభిప్రాయం ఉండేదని, ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందన్నారు. పొంగులేటి సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోందన్నారు.
సెప్టెంబర్‌తో పోలిస్తే నవంబర్‌లో, నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో కొంత పురోగతి కనిపిస్తోందని, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పారు. పెట్టుబడులు ఆంధ్రకు వెళ్లే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా... పెట్టుబడిదారులంతా తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారని, కొందరు బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. ‘అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మారిపోయింది.
వాళ్లు ఎంత బూస్టప్ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల్లో హైడ్రా పట్ల భయం పోయిందని, మొదట్లో తప్పుడు ప్రచారం వల్ల కొంత వేరే అభిప్రాయం ఉన్నా.. ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిపోయిందన్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి రావాలి..
సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా ఇస్తామని చెప్పిన పొంగులేటి.. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు రూ.12వేలను రెండు దఫాల్లో ఇస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని, ఇందుకోసం విడతకు రూ.1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పు వాస్తవమని, ఈ విషయంలో చర్చ నుంచి తప్పించుకునేందుకు బీఆర్‌ఎస్ గొడవ చేయాలని చూస్తోందన్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు లెక్కలోకి రావా అని ప్రశ్నించారు. అసలు కార్పొరేషన్ల నుంచి ఒక్క రూపాయి అయినా ఆదాయం వచ్చే పరిస్థితి ఉందా అని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలందరూ తమకు సమానమేనని అన్నారు.
శాసనసభలో ఎవరి పాత్ర వారు పోషించాల్సిందేనని, భట్టిపై ప్రివిలేజ్ తీర్మానం ఇవ్వడం బీఆర్‌ఎస్ హక్కు అని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో చర్చలో మాట్లాడాలని తనకు కూడా కోరికగా ఉందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఆదానీ విషయంలో ఏఐసీసీ విధానమే తమ విధానమని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment