ఆదర్శనీయుడు బ్రదర్ ఫిలిప్
చిక్కడపల్లి, న్యూస్‌లైన్: గత ఏడు దశాబ్దాలకు పైగా హెబ్రోన్ చర్చి వ్యవస్థాపకులు బ్రదర్ భక్త్ సింగ్‌తో కలిసి బ్రదర్ ఫిలిప్ దైవసేవకులుగా పని చేసి మార్గదర్శకులుగా నిలిచారని, ఆయన అందరికి ఆదర్శమని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ కొనియాడారు. బుధవారం గోల్కొండ క్రాస్‌రోడ్స్‌లోని హెబ్రోన్ చర్చిలో బ్రదర్ ఫిలిప్(96) భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఫిలిప్ క్రైస్తవ సంఘాలకు నమ్మకంగా పనిచేసి దేవుని మహిమను చాటారన్నారు. బ్రదర్ ఫిలిప్ చనిపోలేదని, మన మనసులో నిలిచి ఉంటారని విజయమ్మ అన్నారు. ఫిలిప్ పులివెందులకు వచ్చినప్పుడు తమ అత్తగారి ఇంటికి వచ్చేవారని, అనేక ఏళ్లుగా తమకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, సుచరిత, హెబ్రో చర్చి బ్రదర్, దైవ సేవకులు పీటర్, జాన్ సుబ్బారెడ్డి, కె.ఎం. శ్యాంసన్, దీనబాబు, అరవిందం తదితరులు పాల్గొన్నారు. హెబ్రోన్ చర్చి నుంచి రాత్రి 9 గంటలకు చెన్నైలోని యోవోహషమ్మా చర్చికి ఫిలిప్ భౌతికకాయాన్ని తరలించారు. చెన్నైలో శుక్రవారం కిల్పాక్ మిషన్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి.
వేలాదిగా తరలి వచ్చిన క్రైస్తవులు
బ్రదర్ ఫిలిప్ భౌతికకాయాన్ని సందర్శించేందుకు వేలాదిగా క్రైస్తవులు, దేశ, విదేశాల నుంచి తరలి వచ్చారు. నగరంలోని గోల్కొండ క్రాస్ రోడ్డులోని ప్రసిద్ధి చెందిన బ్రదర్ భక్త్ సింగ్ స్థాపించిన హెబ్రోన్ చర్చి ప్రపంచంలోనే లక్షలాది శాఖలుగా విస్తరించి అనేక మంది భక్తులను చూరగొంది. హెబ్రోన్ చర్చి ట్రస్టీ, ఛైర్మన్ బ్రదర్ కె.ఫిలిప్ (96) భార్య సెలస్టియన్, కుమారుడు జాన్ఫిలిప్, కుమార్తె హన్నా, అల్లుడు కెనేత్లు దైవ సేవకులుగా ఉన్నారు.
ఫిలిప్ బాంబేలో షిప్ ఇంజినీర్‌గా పని చేస్తున్నప్పుడు చర్చికి వెళ్లినప్పుడు దైవజనులు భక్త్‌సింగ్ సువార్త ద్వారా రక్షణ పొంది హెబ్రోన్ చర్చి సేవకుడిగా మారి ట్రస్టీ ఛైర్మన్‌గా పేరు ప్రఖ్యాతులు పొందారు. గత గురువారం బెంగళూరులో దైవ సేవలో పాల్గొనడటం విశేషం. దేశ, విదేశాల్లో దైవ సేవకులుగా మంచి పేరు గడించారు. హెబ్రోన్ చర్చి నుంచి రాత్రి 9 గంటలకు చెన్నైలోని యోవోహషమ్మా చర్చికి భౌతికకాయాన్ని తరలించారు. చెన్నైలో శుక్రవారం కిల్పాక్ మిషన్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.