Brown Dwarf
-
సౌర కుటుంబానికి ఆవల నీటి మేఘాలు
మన సౌర కుటుంబానికి ఆవల 7.2 కాంతి సంవత్సరాల దూరంలో నీటి మేఘాలు ఉన్నట్లు పెన్సల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జూపిటర్ గ్రహం కన్నా ఐదు రెట్లు పెద్దగాను, మన సూర్యుడికన్నా చిన్నగాను ఉన్న ఈ నీటి మేఘాలను ఖగోళ శాస్త్రంలో విఫలమైన నక్షత్రాంగాను లేదా బ్రౌన్ డ్వార్ఫ్గాను పిలుస్తారు. ధూళి, గ్యాస్‌తో కూడిన మేఘాలే గురుత్వాకర్షణ శక్తితో కేంద్రీకృతమై అణు విస్ఫోటనం సంభవించడం వల్ల నక్షత్రాలుగా పరిణామం చెందుతాయన్న విషయం తెల్సిందే. అణు విస్ఫోటనం సంభవించేంత ద్రవ్యరాశి లేకుండా శీతలీకరణం చెందిన పదార్థాన్ని విఫలమైన నక్షత్రం లేదా బ్రౌన్ డ్వార్ఫ్ అంటారు. మన భూమికి 7.2 కాంతి సంవత్సరాల దూరంలో బ్రౌన్ డ్వార్ఫ్ ఉన్నట్లు రెండేళ్ల క్రితమే గుర్తించిన పెన్సల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు దీనికి ‘వైస్ 0855’గా నామకరణం చేశారు. పెన్సల్వేనియా యూనివర్శిటీలోని ‘సెంటర్ ఫర్ ఎక్సోప్లానెట్స్ అండ్ హబిటెబుల్ వరల్డ్స్’కు చెందిన శాస్త్రవేత్తలు హవాయిలోని జెమినీ నార్త్ టెలిస్కోప్‌ను ఉపయోగించి ఇన్ఫ్రారెడ్ మెజర్మెంట్స్ పద్ధతిలో వైస్ 0855ను అధ్యయనం చేయడం ద్వారా అందులో నీటి ఆవిరులు ఉన్నట్లు కనుగొన్నారు. అందులో మైనస్ పది ఫారన్‌హీట్ డిగ్రీల శీతల వాతావరణం కూడా ఉన్నట్లు అంచనా వేశారు. సౌర కుటుంబానికి ఆవల మనకు సమీపంలోనే నీటి మేఘాలు ఉండడం అమితాశ్చర్యకరమైన విషయమని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఆస్ట్రానమర్ కెవిన్ లుహ్మాన్ వ్యాఖ్యానించారు. ఈ అధ్యయనానికి సంబంధించి పూర్తి వివరాలను ‘ఆస్ట్రోఫిజికల్ జనరల్ లెటర్స్’ మేగజైన్లో ప్రచురిస్తామని ఆయన చెప్పారు. -
సూర్యుడికి పొరుగున హిమ నక్షత్రం!
మన సౌర కుటుంబానికి పొరుగున.. కేవలం 7.2 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉన్న అతి చల్లని నక్షత్రం ఇది. పేరు ‘వైజ్ జే085510.83071442.5’. ఇప్పటిదాకా కనుగొన్న బ్రౌన్ డ్వార్ఫ్ నక్షత్రాల్లో ఇదే అత్యంత చల్లనిదట. ఇదెంత చల్లగా ఉంటుందంటే.. మైనస్ 48-13 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతతోనే ఉంటుందట. అంటే.. ఇదో మంచు నక్షత్రం అన్నమాట. మన సూర్యుడిలాంటి నక్షత్రాలు కేంద్రక సంలీనం చర్య వల్ల హైడ్రోజన్‌ను హీలియం వాయువులుగా మారుస్తూ నిరంతరం అంతులేని వేడి, వెలుగులు, రేడియేషన్ విరజిమ్ముతుంటాయి. కానీ బ్రౌన్ డ్వార్ఫ్ వంటి మరుగుజ్జు నక్షత్రాలలో చాలా తక్కువ ద్రవ్యరాశి ఉంటుంది కాబట్టి.. వాటిలో కేంద్రక సంలీనం చర్యలు జరగవు. అందువల్ల అవి చల్లగానే ఉంటాయి. తాజా మరుగుజ్జు నక్షత్రం ద్రవ్యరాశి గురుగ్రహం కన్నా 10 రెట్లు మాత్రమే ఎక్కువ కావడంతో ఇది పూర్తిస్థాయి నక్షత్రంగా మారలేకపోయిందట. దీనిని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన వైజ్, స్పిట్జర్ స్పేస్ టెలిస్కోపుల ద్వారా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కెవిన్ లూమన్ కనుగొన్నారు. ఇలాంటి నక్షత్రాలపై అధ్యయనం ద్వారా అతిచల్లని గ్రహాలపై వాతావరణాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.