Bruhan Mumbai munpipal Corporation
-
ఉమ్మితే పర్సు ఖాళీ.. రూ.1,200 జరిమానా
ముంబై: ముంబైలోని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే రూ.1200 జరిమానా విధించనున్నట్లు బీఎంసీ హెచ్చరించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఉమ్మితే రూ.200 గా ఉన్న జరిమానా ఇపుడు రూ.1,200కి పెంచారు. ఇటీవలె బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ జరిమానా పెంపు నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఉత్తర్వులు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని బీఎంసీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఆరు నెలల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వ్యక్తుల నుంచి రూ.రూ. 28.67 లక్షల జరిమానా రూపంలో బీఎంసీ వసూలు చేసింది. కేవలం సాకినాకల ప్రాంతంలోని ఎల్ వార్డు నుంచి రూ .4.70 లక్షలు జరిమానా వసూలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే రూ.200 వసూలు చేస్తూ కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి నుంచి రూ.1,200 వసూలు చేయడాన్ని హైకోర్టు బీఎంసీని ప్రశ్నించింది. -
సోనూసూద్‌కు నిరాశ.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
సాక్షి, ముంబై: నటుడు సోనూసూద్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. అనధికారికంగా భవనాలు నిర్మించారనే ఆరోపణతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఇచ్చిన నోటీసులపై సోనూసూద్ వేసిన పిటిషన్‌ను బాంబే కోర్టు కొట్టి వేసింది. ‘‘నిజాయతీ గల వారి వైపు న్యాయం ఉంటుంది. ఇప్పుడు బంతి బీఎంసీ చేతిలోకి వెళ్లింది. వారిని సంప్రదించండి’’ అని జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. మీకున్న అవకాశాన్ని కోల్పోయారు.. మీరు చాలా ఆలస్యమయ్యారు అని తెలిపారు. ముంబైలోని జుహు ప్రాంతంలో సోనూసూద్‌కు శక్తి సాగర్ అనే పేరుతో ఆరంతస్తుల భవనం ఉంది. దీనిపై గతేడాది అక్టోబర్ 20న సోనూసూద్‌కి బీఎంసీ నోటీసులు అందించగా.. వాటిని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. అయితే దాన్ని డిసెంబర్లో దిగువ కోర్టు కొట్టివేయడంతో సోనూ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు గురువారం విచారించి అన్ని వివరాలు పరిశీలించి సోనూసూద్ పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన స్టేను కొనసాగిస్తూ సింగిల్ బెంచ్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. నేరాలకు పాల్పడటం సోనూకు ఓ అలవాటుగా మారిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చి చట్టవిరుద్ధ పద్ధతిలో కమర్షియల్ లాభాలు పొందాలని భావిస్తున్నారని పేర్కొంది. ఇప్పటికే కొంతమేర నిర్మాణాలు కూల్చివేసినప్పటికీ, లైసెన్స్ డిపార్టుమెంట్ అనుమతులు తీసుకోకుండానే మళ్లీ పునర్నిర్మాణం మొదలుపెట్టారని వివరించింది. అయితే ఈ ఆరోపణలను సోనూ ఖండించారు. తన దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేస్తూనే కేవలం ఎంసీజెడ్ఎంఏ (మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ) నుంచి మాత్రమే అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. అది కూడా కోవిడ్-19 వల్ల ఆలస్యమతోందని వివరించినా బీఎంసీ వారు వినలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా నిరాశే ఎదురైంది. ఈ విషయమై సోనూపై కేసు నమోదైన విషయం తెలిసిందే. -
రోడ్లను మాకు వదిలేయండి..ప్లీజ్!
రాష్ట్ర ప్రభుత్వానికి బీఎంసీ లేఖ * అనుమతి కోసం నిరీక్షణ * ప్రస్తుతం ఎమ్మెమ్మార్డీయే, పీడబ్ల్యూడీ, ఎమ్మెస్సార్డీసీలూ భాగస్వాములే * ఒకే గొడుగుకింద అయితే నిర్వహణ బాగుంటుందని బీఎంసీ వాదన * ఆదాయం పోతుందని మిగతా సంస్థల ఆందోళన సాక్షి, ముంబై : నగరంలోని అన్ని రోడ్ల నిర్వహణను తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బృహన్ ముంబై మున్పిపల్ కార్పొరేషన్ కోరుతోంది. ఈ మేరకు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం బీఎంసీ పంపించింది. నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు, బ్రిడ్జీల నిర్వహణను చూసుకుంటామని బీఎంసీ ఓ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. ఒకే గొడుగు కింద వీటన్నింటిని నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చని బీఎంసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ), ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ), మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఈ రోడ్ల నిర్వహణలో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సందర్భంగా అడిషినల్ మున్సిపల్ కమిషనర్ ఎస్వీఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీఎంసీ గొడుగు కింద అన్ని బ్రిడ్జీల నిర్వహణ బాధ్యతను చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఒక్క సంస్థ ఆధ్వర్యంలో బ్రిడ్జిల నిర్వహణ చేపడితే సక్రమంగా నిర్వహించగలుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈస్టర్న్ ఫ్రీవే, శాంతాకృజ్-చెంబూర్ లింక్‌రోడ్డు ప్రస్తుతం ఎమ్మెమ్మార్డీఏ ఆధీనంలో ఉన్నాయి. శాంతాకృజ్‌లో ఉన్న ఫ్లై ఓవర్, వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న అంధేరి ఫ్లై ఓవర్ కాకుండా ఎన్నో నిర్మాణాలను ప్రస్తుతం పీడబ్ల్యూడి, ఎమ్మెస్సార్డీసీ నిర్వహిస్తున్నాయి. కాగా, ఆగస్ట్‌లో అన్ని రోడ్లకు సంబంధించిన నిర్వహణ తామే చూసుకుంటామని బీఎంసీ ఓ ప్రతిపాదనను పంపించింది. మంచి ఫలితాలు ఇచ్చే విధంగా వీటి నిర్వహణ బాధ్యతను చూస్తామని బీఎంసీ పేర్కొంది. ఇదిలా ఉండగా, రోడ్ల నిర్వహణ నేపథ్యంలో ప్రకటనల ద్వారా ఆదాయం ఆర్జించవచ్చని చాలా ఏజెన్సీలు వీటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నాయని, అవి ఏవీ తమ భాగస్వామ్యాలను వదులుకోవడానికి సిద్ధంగా లేవని బీఎంసీ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.