'బాంబులు బ్యాగులో పెట్టుకుని వచ్చారు'
బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్ ఎయిర్ పోర్టులో జంట పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు లగేజీలో బాంబులు పెట్టుకుని వచ్చారని స్థానిక మేయర్ తెలిపారు. ఉగ్రవాదులు తమ లగేజీతో కారులో విమానాశ్రయానికి వచ్చారని జావెంటమ్ మేయర్ ఫ్రాన్సిస్ వెర్మీరిన్ వెల్లడించారు. సూటుకేసు బ్యాగుల్లో బాంబులు పెట్టుకుని ఎయిర్ పోర్టులోకి వచ్చారని చెప్పారు. వీటిని ట్రాలీల మీద పెట్టుకుని లోపలికి వచ్చారని, మొదటి రెండు బాంబు పేలాయని తెలిపారు. మరో ట్రాలీపై పెట్టిన మూడో బాంబు పేలలేదని, దీన్ని భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. బాంబు నిర్వీర్య బృందం తర్వాత దీన్ని పేల్చివేసిందని వెల్లడించారు. బాంబు పేలుళ్లతో ఎయిర్ పోర్టు రణరంగంగా మారిందని వ్యాఖ్యానించారు. ముష్కరుల హింసాకాండను ఆయన తీవ్రంగా ఖండించారు.
కాగా, ఎయిర్ పోర్టు సహా మెట్రో స్టేషన్ వద్ద బాంబులు అమర్చినట్లుగా అనుమానిస్తున్న ముగ్గురి ఫొటోలను బెల్జియం పోలీసులు మంగళవారం రాత్రి విడుదల చేశారు. నల్ల చొక్కాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు, వారి పక్కనే నడుస్తున్న మరో టోపీవాలా కదిలికలను సీసీటీవీ ఫుటేజీల నుంచి సేకరించిన పోలీసులు.. ఆ ముగ్గురే బాంబులు అమర్చినవారై ఉంటారని అనుమానిస్తున్నారు.
నల్లచొక్కాలతో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ ఎడమ చేతులకు నల్లరంగు గ్లౌజులు ధరించారు. టోపీవాలా తెల్లనికోటు ధరించి, తలకు నల్లటి టోపీ పెట్టుకున్నాడు. ముగ్గురు దగ్గర ఒకే రకమైన బ్యాగులు ఉండడంతో అనుమానాలు బలపడుతున్నాయి. విమానాశ్రయంలో జరిగిన జంట పేలుళ్లలో 14 మంది చనిపోగా, 96 మంది గాయాల పాలయ్యారు. మాల్బీక్ సబ్వే మెట్రో స్టేషన్లో ఉదయం రద్దీ సమయంలో చోటు చేసుకున్న భారీ పేలుడులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 106 మంది గాయపడ్డారు.