ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడి గట్టి, హత్య చేశాడో కామాంధుడు. హోలీ సంబరాల్లో ఉన్న చిన్నారిని నమ్మించి ఎత్తుకెళ్లి ఈ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత అత్యంత క్రూరంగా హత్య చేశాడు. దారుణమైన ఈ ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిన్నారి ప్రవళ్లిక మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 గంటల వ్యవధిలోనే ఛేదించారు. శుక్రవారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ పద్మజారెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. చిన్నారి ఇంటి పక్కనే ఉండే ధర్మేంద్ర, అతని స్నేహితులు రోషన్, రాజేష్‌కుమార్, సురేంద్ర, సుబ్రహ్మణ్యం కలసి హోలీ ఆటలో మునిగారు. అప్పటికే మద్యం సేవించిన వీరితో ఓ బాబు, చిన్నారి ప్రవళ్లిక సైతం ఆడుకున్నారు. చిన్నారి అదృశ్యం కావడంపై ధర్మేంద్రను పోలీసులు వివరాలు అడిగారు. ఈ క్రమంలో రాజేష్‌కుమార్ కూడా కనిపించడంలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్‌కు 20 ఫీట్ల దూరంలో ఓ బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అదృశ్యమైన చిన్నారి తల్లిదండ్రులకు మృతదేహాన్ని చూపించగా అది తమ బిడ్డదే అని గుర్తించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన డీసీపీ పద్మజారెడ్డి నిందితుడు తప్పించుకోకుండా 3 బృందాలను నియమించారు. ఈ క్రమంలో బొల్లారం సమీపంలోని కృష్ణనగర్‌లో ఓ గది ఉన్న రాజేష్‌ను శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నమ్మించి ఎత్తుకెళ్లాడు..
స్నేహితులతో హోలీ సంబరాల్లో ఉన్న రాజేష్‌కుమార్ వారితో ఉన్న బాబును తీసుకెళ్లి రంగులు కొనిచ్చాడు. చిన్నారి ప్రవళ్లికను ఇలాగే నమ్మించి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎత్తుకెళ్లాడు. సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఉన్న నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. భయంతో బోరున విలపిస్తున్న చిన్నారి మెడపై ఇనుప రాడ్డుతో కోశాడు. లైంగిక దాడి, మెడపై గాటుతో తీవ్ర రక్తస్రావం జరిగి చిన్నారి అక్కడే మృతి చెందింది. అనంతరం రాజేష్‌కుమార్ ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు. బిహార్‌కు చెందిన రాజేష్‌కుమార్ 2 నెలల క్రితమే ఇక్కడికి వచ్చాడు. బొల్లారంలోని నందిని టెంట్ హౌస్‌లో పని చేస్తూ వాల్మీకి నగర్లో ఉంటున్నాడు. గురువారం సాయంత్రం గదికి వచ్చిన రాజేష్‌కుమార్ శుక్రవారం బిహార్ పారిపోవాలని అనుకున్నాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఆలోపే చిక్కాడు. మీడియా సమావేశంలో ఏసీపీ నర్సింహరావు, సీఐ మట్టయ్య, డీఐ ఎన్.శంకర్, ఎస్సై వరప్రసాద్ పాల్గొన్నారు.
మరణశిక్ష విధించాలి: అచ్యుతరావు
అల్వాల్ పీఎస్ పరిధిలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి, దారుణహత్య ఘటనపై స్పందించిన బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు దుండగుడికి మరణశిక్ష విధించాలన్నారు. నగరం, పరిసరాల్లో ఆడ పిల్లలపై జరుగుతున్న దారుణాలకు ఈ ఉదంతం ఓ పరాకాష్ట అని అన్నారు. కేవలం ఫిబ్రవరి, మార్చి.. 2 నెలల వ్యవధిలో 42 మంది బాలికలపై లైంగిక దాడులు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అధికారులు గమనించాల్సిన అవసరం ఉందన్నారు.